పౌరసేవలే పరమావధి కావాలి
ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా, తద్వారా ప్రజలు వారి వారి ప్రాథమిక హక్కులను పొందేలా చూడాలనే ఉద్దేశంతో జాతీయ పౌర సేవల సంస్థ 2016 ఏప్రిల్ 21న 'పౌర సేవల దినోత్సవాన్ని' ప్రారంభించింది.
దేశంలో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల చదువులలో ఇంజినీరింగ్, మెడిసిన్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. సివిల్ సర్వీసుల మీద అంతగా దృష్టి సారించడం లేదు. దానికి కారణం ఎవరికి వారు సంపాదన లక్ష్యంగా భావించడమే. వారి ఆలోచనలలో మార్పు రావాలి. సమాజ హితం కోసం పనిచేసే ధోరణిని అలవరచాలి. అటువంటి చదువుల కోసం ప్రాధాన్యం ఇవ్వాలి. ఉత్తర భారతదేశం నుంచే చాలా మంది అఖిల భారత సర్వీసులకు ఎంపిక అవుతారు. అందుకే వారే ఎక్కువగా మనకు కనిపిస్తుంటారు. దక్షిణాది వారు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. దేశానికి, ప్రజలకు సేవలు అందించడమే నిజమైన దేశభక్తి అని అందరూ గ్రహించాలి.
ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా, తద్వారా ప్రజలు వారి వారి ప్రాథమిక హక్కులను పొందేలా చూడాలనే ఉద్దేశంతో జాతీయ పౌర సేవల సంస్థ 2016 ఏప్రిల్ 21న 'పౌర సేవల దినోత్సవాన్ని' ప్రారంభించింది. దేశంలోని ప్రజలందరికీ ఇల్లు, ఆహారం, ఆరోగ్యం, విద్యను అందించడం పౌర సేవల ముఖ్య ఉద్దేశ్యం. పౌర సేవల వ్యవస్థ దేశ పరిపాలనా యంత్రాంగానికి వెన్నెముకలాంటిది. ప్రభుత్వం రూపొందించిన విధానాలను, పథకాలను క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు జరిపే బాధ్యత పౌరసేవకులదే. ఇందులో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల సేవలతో పాటు సెంట్రల్ గ్రూప్ ఎ, బి సర్వీసులు ఉంటాయి. ఈ వ్యవస్థకు పునాది వేసింది బ్రిటిషు ప్రభుత్వం. మన దేశ తొలి ఉప ప్రధాని, హోం మంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ పౌర సేవల అధికారులను 'స్టీల్ ఫ్రేం ఆఫ్ ఇండియా' అని అభివర్ణించారు. ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ఈ రోజున అవార్డులు, నగదు బహుమతులను అందజేస్తారు.
అభివృద్ధిలో కీలకం
ప్రజలకు ప్రభుత్వాలు అందించే సేవలలో ఉన్నతాధికారుల పాత్ర కీలకం. అన్ని వ్యవస్థలూ వీరి మీదనే ఆధారపడి ఉంటాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలు విజయవంతం కావాలన్నా, దేశం స్వావలంబన దిశగా పయనించాలన్నా వీరు క్రమశిక్షణతో, నిజాయితీగా పని చేయాలి. ఉన్నతాధికారుల పనితీరు, సామర్థ్యం మీదనే కింది ఉద్యోగులు పని చేస్తారని గ్రహించాలి. ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు మీదనే పరిపాలన, ఆర్థిక, సామాజిక తదితర అంశాలు ఆధారపడి ఉంటాయి. 'సిటిజన్ చార్టర్' ప్రకారం ప్రాధాన్యాన్ని బట్టి పౌర సేవలు అందరికీ సమానంగా అందించాలి. పారదర్శకతకు పెద్దపీట వేయాలి.
ప్రజా సమస్యల పరిష్కారానికి 'గ్రీవెన్స్ సెల్'ను పకడ్బందీగా అమలు చేయాలి. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి. బాధితులకు అండగా నిలవాలి. ప్రజలతో మమేకం కావాలి. వెనుకబడిన వర్గాలు, దివ్యాంగులు, మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. 'డయల్ యువర్ కలెక్టర్' 'డయల్ యువర్ ఎస్‌పీ' 'డయల్ యువర్ కమిషనర్' వంటి వాటిని తరచుగా నిర్వహించాలి. క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేయాలి. రాజకీయ పార్టీలు, అధికార పార్టీ నేతలు, ప్రభుత్వాలకు అనుకూలంగా కాకుండా వాస్తవ పరిస్థితి, చట్ట ప్రకారం వ్యవహరిస్తే ఆదర్శ ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజల మనస్సులలో చెరగని ముద్ర వేయగలుగుతారు.
ఆలోచన మారాలి
దేశంలో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల చదువులలో ఇంజినీరింగ్, మెడిసిన్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. సివిల్ సర్వీసుల మీద అంతగా దృష్టి సారించడం లేదు. దానికి కారణం ఎవరికి వారు సంపాదన లక్ష్యంగా భావించడమే. వారి ఆలోచనలలో మార్పు రావాలి. సమాజ హితం కోసం పనిచేసే ధోరణిని అలవరచాలి. అటువంటి చదువుల కోసం ప్రాధాన్యం ఇవ్వాలి. ఉత్తర భారతదేశం నుంచే చాలా మంది అఖిల భారత సర్వీసులకు ఎంపిక అవుతారు. అందుకే వారే ఎక్కువగా మనకు కనిపిస్తుంటారు. దక్షిణాది వారు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. దేశానికి, ప్రజలకు సేవలు అందించడమే నిజమైన దేశభక్తి అని అందరూ గ్రహించాలి. ముఖ్యంగా అఖిల భారత ఉద్యోగుల పని విధానంపైనే దేశ ప్రజల భవిష్యత్తు, అభివృద్ధి ఆధారపడి ఉంటుందని ఈ దినోత్సవం సందర్భంగా ఉద్యోగుల మనస్సులో మెదలాలని మనసారా కోరుకుందాం. వారంతా మరింత పకడ్బందీగా అంకిత భావంతో నిర్వహిస్తారని ఆశిద్దాం.
(నేడు జాతీయ పౌర సేవల దినోత్సవం)
ఐ. ప్రసాదరావు
99482 72919