మన పిల్లలు డాక్టర్లు కావద్దనే.. ఆల్ ఇండియా పరీక్ష

దాదాపు 24 లక్షల మంది జీవితాలతో చెలగాటం ఆడుతున్న నీట్ పేపర్ లీకేజీ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

Update: 2024-06-28 01:15 GMT

దాదాపు 24 లక్షల మంది జీవితాలతో చెలగాటం ఆడుతున్న నీట్ పేపర్ లీకేజీ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. లక్షలాది విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులకు భరోసా కల్పించాల్సిన ప్రధానమంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి వీటిపై బయటికి వచ్చి మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఎంతో కష్టపడి ఆస్తులని సైతం విక్రయించి లక్షల రూపాయలు వెచ్చించి తల్లిదండ్రులు చదివిస్తున్నారు. ఈక్రమంలో పేపర్ లీక్ అయిందని తెలిసి భయాందోళనకు గురయ్యారు. అందుకే ఈ పరీక్షను రద్దు చేసి మళ్లీ అందరికీ పరీక్ష నిర్వహించాలి. మన పేద పిల్లలు డాక్టర్లు కావద్దనే కుట్రతోనే నీట్ పరీక్ష పేపర్ లీకేజీలు పెరుగుతున్నాయన్న అనుమానాలు ప్రబలుతున్నాయి.

వైద్య విద్య కోసం నాటి కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలోని 'మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా' 2010 డిసెంబర్ 21న నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెస్ట్ టెస్ట్ (కామన్ ఎంట్రెస్ట్ టెస్ట్)ను నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే, 2011లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఈ విధానాన్ని వ్యతిరేకించారు. ఇదిలా ఉంటే 2013, 2016 మధ్య నీట్ పరీక్షా విధానాన్ని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యూపీ, ఉమ్మడి జమ్మూకశ్మీర్ ప్రభుత్వాలు వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. రాష్ట్రాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను 'నీట్' పరీక్షా విధానం కాలరాస్తుందని ఆయా ప్రభుత్వాలు వాదించాయి.

అయితే దేశవ్యాప్తంగా ఒకే పరీక్షలో విద్యార్థులకు సమాన అవకాశాలు, సీబీఎస్ఈ సిలబస్, 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తుండటం వంటి సానుకూల అంశాలను కారణంగా చూపెట్టి దేశంలోని రాష్ట్రాలన్నీ 'నీట్' లో జాయిన్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2017 కు ముందు వైద్య అర్హత పరీక్షను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా నిర్వహించినా, ఆ తర్వాత 'ఆల్ ఇండియా పూల్ ద్వారా మన వైద్య విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతాయన్న సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలతో 'నీట్'లో జాయిన్ కావాల్సి వచ్చింది. తాజాగా ఈ నీట్‌ పరీక్షలోనే అవకతవకలు, అక్రమాలు జరిగాయని దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి.

రాష్ట్రాలు అర్హత పరీక్ష నిర్వహిస్తే..

పరీక్ష నిర్వహణ అధికారాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణలో ఉంటే వాళ్ల పరిధి కొన్ని జిల్లాలతో పరిమితంగా ఉంటుంది కాబట్టి సమస్యలు లేకుండా నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. భద్రతాపరంగా, రవాణా సౌకర్యం, పరీక్ష కేంద్రాలు అన్ని కూడా సౌలభ్యంతో ఉంటాయి. ఆయా రాష్ట్రాలు పరీక్ష నిర్వహణను పారదర్శకంగా నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా చిన్న చిన్న పొరపాటు జరిగినా లేదా పేపర్ లీకైనా, మాస్ కాపీయింగ్ జరిగిన ఆ పేపర్‌ని రద్దు చేయడం ఆ రాష్ట్ర పరిధి వరకే ఉంటుంది. దేశవ్యాప్తంగా పేపర్ రద్దు చేయాల్సిన అవసరం లేదు. ఆ రాష్ట్ర పరిధిలో సమస్య కాబట్టి ఆ రాష్ట్రంలో మాత్రమే రద్దు చేసుకొని, ఆ రాష్ట్ర పరిధిలోనే మళ్లీ నిర్వహించుకోవడం వలన మిగతా రాష్ట్రాల విద్యార్థులకు ఎలాంటి గందరగోళం ఉండదు.

అన్ని రాష్ట్రాలు నీట్‌ను వ్యతిరేకించాలి!

తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో భద్రతా రీత్యా దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందున్నది. ఈ కారణంగా ఇతర రాష్ట్రాల్లోని విద్యార్థులు ఇక్కడికి రావడానికి మొగ్గు చూపుతున్నారు. కానీ, మన విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి ఆసక్తి కనబరచడం లేదు. ఆల్ ఇండియా కోటాలో భాగంగా ఎంబీబీఎస్ సీట్లలో 15 శాతం, పీజీ సీట్లలో 50 శాతం ఇతర రాష్ట్రాల్లోని వైద్య విద్యార్థులకు కేటాయిస్తుండటం వల్ల మన వైద్య విద్యార్థులకు సరైన న్యాయం జరగడం లేదు. దీనికి తోడు లోకల్, నాన్ లోకల్ సమస్య కూడా మన విద్యార్థులను వెంటాడుతున్నది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డి ప్రకారం మన వైద్య విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేస్తే మన రాష్ట్రంలో వారిని నాన్ లోకల్‌గా పరిగణిస్తున్నారు. దీంతో వేలాది మంది వైద్య విద్యార్థులు డాక్టర్ కావాలనే తమ కలలను వదిలేసుకుంటున్నారు. కాబట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు 'ఆల్ ఇండియా పూల్' నుంచి వైదొలగాలి. తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో నీట్ వ్యతిరేక బిల్లును ప్రవేశ పెట్టింది. కానీ ఆ బిల్లును ఆమోదించి రాష్ట్రపతికి పంపించాల్సిన గవర్నర్ నెలల తరబడి తన వద్దే ఉంచుకొని ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తుండటం విచారకరం. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం నీట్ పరీక్ష విధానాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలి. అప్పుడే నీట్ గండం నుంచి విద్యార్థులు బయటపడే ఆస్కారం ఉంటుంది.

ఉత్తరాదికి లాభం... దక్షిణాదికి నష్టం

నీట్లో తాజా అక్రమాలను పరిగణనలోకి తీసుకున్నట్లయితే నీట్ పరీక్షా విధానం వల్ల ఉత్తరాది వైద్య విద్యార్థులకే లాభం చేకూరుతున్నదని, దక్షిణాది విద్యార్థులు నష్టపోతున్నారనే ఆరోపణలున్నాయి. హర్యానా, గుజరాత్, బీహార్ రాష్ట్రంలోనే పేపర్ లీక్ ఆరోపణలు వస్తున్నాయి. ర్యాంకులు కూడా వాళ్లకి రావడం మూలంగా అనేక అనుమానాలు ముందుకొస్తున్నాయి. కాబట్టి నీట్ పరీక్ష నిర్వహణ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి. కమిషన్ ద్వారా కాకుండా పకడ్బందీగా విచారణ చేయాలంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలి. మే 5న నిర్వహించిన నీట్ పరీ‌క్షను రద్దు చేయాలి. కొంత మందికి మాత్రమే పరీక్షలు నిర్వహించడం కాకుండా మళ్లీ అందరికీ పరీక్ష నిర్వహించాలి. ఎన్టీఏ సంస్థను తక్షణమే రద్దు చేయాలి. పేపర్ లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. పరీక్ష వల్ల నష్టపోయిన 24 లక్షల మంది విద్యార్థులకు వాళ్ల తల్లిదండ్రులకు భరోసా కల్పించాలి. పూర్తిస్థాయిలో పేపర్ నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పగించాలి.

పెద్దింటి రామకృష్ణ,

పీడీఎస్‌యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు

97055 18978

Tags:    

Similar News