రసాయన రహిత వ్యవసాయమే జీవనాధారం!
Chemical free agriculture is the basis of life
మనిషి జీవితంలో అత్యంత ప్రధానమైనది ఆహారం. ఆ ఆహార పంటలకు మూలం వ్యవసాయం. వ్యవసాయంలో రసాయనాలు ఉపయోగించకుండా పండించిన ఆహార ధాన్యాలే మనిషి మనుగడకు మూలం. స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన ఆహార పదార్థాలు లభించినప్పుడే మానవులు ఆరోగ్యంగా బతుకుతూ.. నిండు నూరేళ్ళ కాలం వెళ్లదీసే అవకాశం వుంటుంది. ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకరణ, ప్రైవేటీకరణ సంస్కరణల ప్రభావంతో మానవ సమాజం ధనమే సర్వస్వం అన్నట్లు వ్యవహార శైలి మార్చుకొని ఆ వ్యామోహంలో నిట్టనిలువునా కూరుకపోయి, కూచున్న చెట్టు కొమ్మనే నరుక్కునే మూర్ఖ విధానాలను అవలంబిస్తున్నాడు. విపరీతంగా ప్లాస్టిక్, పాలిథిన్ ఉత్పత్తులను వాడి భూమిని, వాతావరణాన్ని, నీటిని కాలుష్యమయం జేస్తున్నడు. తినే ఆహార పంటలను సైతం వదలకుండా ఫెర్టిలైజర్స్, గ్రోత్ ప్రమోటర్స్ ఉపయోగించి పండించిన పంటతో సమాజాన్ని రోగగ్రస్తం చేస్తున్నారు.. పర్యావరణాన్ని విషతుల్యం చేస్తున్నారు.
రైతులు ఆ పాపాన్ని ముడిగట్టుకుని..
మూడున్నర దశాబ్దాలుగా రసాయనాలతో అధిక పంటల వ్యవసాయ తంతు తతంగం ఇప్పుడు పతాక స్థాయికి చేరుకొని రాబోయే తరాలకు ఒక పెద్ద శాపంగా పరిణమించింది. ఫర్టిలైజర్స్, ఇతర రసాయనాలు వాడకుంటే పంటలే పండవు అనే దౌర్భాగ్య మానవజాతి తిరోగమన ఆలోచన నేటి గ్రామస్థాయి రైతులలోనూ మెదడ్లో పాతుకుపోయింది. లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, అందుకు మూల కారణంను బతికి వ్యవసాయం కొనసాగిస్తున్న రైతులు ఆలోచించడం లేదు. తమ స్వయం తప్పిదాలను గుర్తించడం లేదు. పైగా ప్రభుత్వాలే మమ్మల్ని కాపాడుతాయనే పరాధీనతలో సగటు రైతు కూరుకపోయిండు. స్వతంత్ర ఆలోచన లేకుండా అధిక పెట్టుబడికి అలవాటు పడి అనేక పంటలు పండించే కల్చర్ వదిలి మోనో కల్చర్‌కు అలవాటు పడి కేవలం వరి, పత్తి, చెరుకు వంటివే పండిస్తున్నారు. ఇప్పుడు ‘వరి రైతుకు ఉరి’, ‘పత్తి మెడ మీద కత్తి’ అని గ్రహించాల్సిన పరిస్థితి దాపురించింది. అంత అధిక పెట్టుబడులు పెట్టి రసాయనాలు వాడుతూ పంట భూముల్లో జీవం లేకుండా జేశారు. కనీసం నేల సారాన్ని ఇనుమడింప జేసే వానపాములను బతకనీయకుండా పాపాన్ని ముడిగట్టుకుంటున్నరు.
నేడు రైతులు కేవలం ప్రభుత్వాలే వ్యవసాయాన్ని బతికించలేవనే నగ్న సత్యాన్ని గుర్తించి తమ వ్యవసాయాన్ని సమూల మార్పులతో లాభసాటిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అత్యావశ్యకత నేడు నెలకొంది. అధిక పెట్టుబడికి కారణమవుతున్న (GMO) హైబ్రిడ్ విత్తనాలు, రసాయనాలు కొనడం మానేసి స్థానిక విత్తనాలతో రసాయన రహిత వ్యవసాయం కొరకు ప్రతి రైతు ముందుకు రావాలి. ప్రతి రైతు మిద్దె తోట పెంచాలి. అలాంటి కుటుంబాలే ఆరోగ్యంలో ముందుంటారని గుర్తించాలి. ఇప్పుడు రైతు రసాయనాలతో కూడిన వ్యవసాయాన్ని పాప కార్యమని తలచాలి. సేంద్రియ వ్యవసాయం చేయాలి. దీంతోనే స్వయం ప్రతిపత్తి సాధించాలి. ఈ వ్యవసాయమే చేవగల్లదని, తమకు సమాజానికి మేలు చేసేదని, ఆరోగ్యకర వ్యవసాయమనే అవగాహనతో ముందుకెళ్లాల్సిన తరుణం ఇది.
అలా చేస్తే రైతుకు ఆదాయం!
వ్యవసాయంతో పాటు రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల చెట్లు, ఔషధ మొక్కలు, చిరుధాన్యాలు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు పండించడం వ్యవసాయానికి అనుబంధం కావాలి. చిన్న సన్నకారు రైతులు సమూహాలుగా, సహకార బృందాలుగా గ్రామ గ్రామాన ఏర్పడి మోనో కల్చర్ వదిలి బహుళ పంటల వ్యవసాయానికి నాంది పలికితేనె రైతులు అప్పుల బంధ విముక్తులై తామే అప్పులిచ్చే స్థితికి ఎదగొచ్చు. అలాగే వ్యవసాయానికి అనుబంధంగా కోళ్లు, గొర్రెలు, మేకలు, బర్రెలు, చేపల పెంపకం చేపట్టాలి. అప్పుడే ప్రతీ రైతు సముదాయం ఒక మినీ సూపర్ మార్కెట్ అవుతుంది. ప్రజాసమూహాలు ఆరోగ్యంగా ఉంటాయి. పర్యావరణం కాలుష్య నియంత్రణలో వుంటుంది. సేంద్రియ వ్యవసాయం ద్వారా ఎన్నో లాభాలు కలుగుతాయి. కాకపోతే ఇది చేయడానికి కావాల్సింది రైతులలో సమిష్టి కృషి, సహకార భావన, ఐకమత్య భావన! మూడున్నర దశాబ్దాల క్రితపు గత కాల వ్యవసాయ వైభవాన్ని గుర్తు చేసుకొని ఈత చెట్లూ, తాటి చెట్లు పెంచుతూ, నీరా తాగుతూ సమాజానికి తాగిస్తే, మద్యపాన బంధ విముక్తి కల్గిస్తే పల్లెలన్నీ ఆరోగ్యంగా ఆహ్లాదంగా జీవనం కొనసాగిస్తూ దేశ అభివృద్ధికి తోడ్పడతాయి. పండ్ల చెట్లతో పాటు తీగ జాతి, ఇతర అన్నిరకాల కూరగాయలు, ఆకుకూరలు, దుంప కూరలు పండించడం వలన రైతు ఆదాయానికి కొదువుండదు.
రైతులు సమూహాలుగా ఏర్పడి, ఐక్యమత్యంగా పనిచేస్తూ.. రసాయనాలకు స్వస్తి పలకాలి. సేంద్రియ ఎరువులను వాడి వ్యవసాయం చేయాలి. అది లేకుంటే మానవ జాతి అధోగతి. రోగాలతో పోగాలం దాపురించినట్లే. రైతులు ఐటీ కంపెనీల యాంత్రిక ఉద్యోగ బంధ విముక్తి గావించి, వ్యవసాయం వ్యవసాయ అనుబంధ పనుల్లో చేర్పిస్తూ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కల్పిస్తూ తమ కుటుంబాలతో తమ గ్రామ ప్రజలతో బంధు మిత్రులతో మమేకమై హాయిగా ఆహ్లాదంగా ఆరోగ్యంగా జీవించొచ్చు. విష విద్యా, వ్యాపార చదువుల్లో ఒట్టిబోయిన మెదళ్ళకు ఆకు రాయితో పదును పెడితే సర్వ స్వతంత్రంగా, సగౌరవంగా, జీవించే, బతికే మార్గాలెన్నో నేటి యువత పాదా క్రాంత మవుతాయి. ప్రపంచ గమనం గమ్యం సరియైన తోవలో కెలుతుంది.
- గడీల సుధాకర్ రెడ్డి
ప్రధాన కార్యదర్శి, REBS
skrg1966@gmail.com