ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ప్రకటించి వాటిని 100 రోజులలో అమలు చేస్తామని తెలిపింది. ప్రభుత్వం ఏర్పడిన రోజే వాటి అమలుపై సంతకాలు చేస్తామని హామీ ఇవ్వడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కొంతమేర దోహద పడిందన్న విషయంలో సందేహం లేదు. 6 గ్యారెంటీలలో రైతులకు ప్రయోజనం కల్గించేది ‘రైతు భరోసా’ పథకం. తద్వారా ప్రతి ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు రూ.15000- వ్యవసాయ కూలీలకు రూ.12000-, వరి పంటకు రూ. 500- బోనస్ ఇస్తామని వాగ్దానం ఇవ్వడం జరిగినది. అయితే వీటి అమలుకు ప్రస్తుతం ఉన్న రెవెన్యూ వ్యవస్థ, భూరికార్డులు ఎంతవరకు దోహదపడతాయనేది సందేహమే! ఎందుకంటే గత బీఆర్ఎస్(టీఆర్ఎస్) ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ధరణి’ పోర్టల్‌లో పట్టాదారు పేరు తప్ప, కౌలుదారుల వివరాలు గాని, పంటల వివరాలు గాని నమోదు చేసే అవకాశం లేదు.
ఆంక్షలు విధించినా..
ధరణి పోర్టల్ అమలు కాకముందు భూ రికార్డ్ అయిన పహాని(అడంగల్)లో 32 కాలమ్స్ ఉండేవి. అందులో కాలమ్ నెం 1 నుండి 11 వరకు సర్వే సెటిల్‌మెంట్ బందోబస్తు వివరాలు, కాలమ్ నం.12లో భూ యజమాని పేరు, కాలమ్ నెం 13 నుంచి 15 వరకు వాస్తవంగా సాగు చేసే వారి పేరు అనుభవదారు పేరు, అనుభవ స్వాభావం కాలమ్ నెం 16 నుండి 32 వరకు పంటల వివరాలు, సాగు చేసే విధానం, రెవెన్యూ అధికారుల తనిఖీ వివరాలు నమోదు చేసేవారు. వీటి వలన, పంట విస్తీర్ణం పంటల వివరాలు తెలియడమే కాకుండా అతివృష్టి, అనావృష్టి వలన జరిగే పంట నష్టాల వివరాలు నమోదు చేయడం ద్వారా రైతులకు ఏ మేరకు నష్టపరిహారం చెల్లించాలన్న అంచనా వేయవచ్చు. అయితే వీటిని నమోదు చేయడానికి గ్రామస్థాయిలో VRA సహాయంతో VROలు నమోదు చేసేవారు. ప్రస్తుతం అట్టి వ్యవస్థ గాని, భూ రికార్డులు లేకపోవడంతో రైతు భరోసా పథకం అమలులో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది.
గత ప్రభుత్వం రైతుబంధు పేరుతో పట్టా పాస్ బుక్ ఆధారంగా వాస్తవంగా సాగు చేస్తున్నారా లేదా అన్న విషయం పరిగణలోకి తీసుకోకుండా ఎకరాకు ప్రతి సం. రూ.10000- చెల్లించడం జరిగింది. రైతుకు వ్యవసాయ నిమిత్తంగా ఆర్థిక సాయం చేయాలన్న ఉద్దేశ్యంతో అట్టి పథకాన్ని ప్రవేశపెట్టింది. కానీ, రాళ్లు, గుట్టలు ఉన్న భూములకంటే వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు చెల్లించారన్న విమర్శలు రావడమే కాకుండా, నిధుల దుర్వినియోగం వలన ప్రభుత్వ ఖజానాపై భారం పడినది. ఇది కేవలం ఓటు బ్యాంకుపైన దృష్టి పెట్టడమే. ఇటీవలి ఎన్నికల్లో రైతుబంధు చెల్లించడానికి ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించడంతో, గ్రామీణ ప్రాంతాలలో ఓటర్లు బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపకపోవడం ప్రస్పుటంగా కనపడినది.
భూ యజమానులకు ఆ భయం
అయితే రైతు భరోసా అమలు చేయాలంటే వాస్తవంగా సాగు చేస్తున్న వారి వివరాలు (కౌలు రైతులు) అలాగే పంటల వివరాలు నమోదు చేసే అవకాశం ప్రస్తుతం ఉన్న ధరణి పోర్టల్‌లో అవకాశం లేనందున అందుకు అనుగుణంగా వీఆర్ఏ, వీఆర్ఓ వ్యవస్థకు పూర్తి స్థాయిలో పునరుద్దరణ చేయవలసిన అవసరమే కాకుండా కౌలు రైతులను గుర్తించే విధంగా తగు భూరికార్డులను తయారు చేయవలసిన అవశ్యకత ఎంతైనా ఉంది. గతంలో అయితే కౌలు రైతులను (licensed cultivators) గుర్తించి వారికి తగు గుర్తింపు కార్డులను జారీ చేయడానికి అనుగుణంగా ల్యాండ్ లైసెన్సెడ్ కల్టివేషన్స్ యాక్ట్ 2011 చట్టం తీసుకురావడం జరిగినది. కాని ఆ చట్టం అంతగా అమలులోకి రాలేదు. దానికి ముఖ్య కారణం, కౌలుకు ఇవ్వడం ద్వారా ఏమైన ఇతర హక్కులు కౌలు రైతులకు సంక్రమిస్తాయేమో అనే భయాందోళన భూయజమానులలో ఉండటమే కారణం.
అంతేగాక తెలంగాణ రాష్ట్ర రక్షిత కౌలుదారు చట్టం (Telangana state tenancy & Agri lands act) 1950 ప్రకారం రక్షిత కౌలుదారుకు చట్ట ప్రకారం కొన్ని హక్కులను కల్పించడం వలన భూ యజమానులు తిరిగి కౌలుకు భూమి ఇవ్వడానికి జంకుతున్నారు. అంతే కాక, కౌలు రైతులను గుర్తించాలంటే, భూ యజమానులు రాతపూర్వకంగా కౌలుకు ఇవ్వవలసి వస్తుంది. వారి వివరాలను తెలియజేసే భూ రికార్డును తయారు చేయకపోతే, రైతు భరోసా చెల్లించడానికి అవకాశం లేదు. అందుకు గాను భూయజమానులలో, తమ భూమిని, రాతపూర్వకంగా కౌలుకు ఇచ్చిన, అదీ కేవలం సాగు చేయడానికే తప్ప లేదా పంట నష్టపరిహారంలో కొంత చెల్లించడానికో తప్ప కౌలు రైతులకు ఎలాంటి యాజమాన్య హక్కులు, ఏ ఇతర హక్కులు గానీ సంక్రమించవనే భరోసా భూ యజమానులలో కల్గించే విధంగా తగు విధివిధానాలను రూపొందించాలి. అంతేకాక అట్టి కౌలుకు కూడా కొంత నిర్ణీత కాలాన్ని నిర్ణయించాలి. లేకపోతే ప్రతి సంవత్సరం కౌలు రైతులను గుర్తించాలన్న ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది.
లోపాలను సరిచేయాలి..
ఇకపోతే వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేలు చెల్లించడానికి ఎలాంటి ఆటంకాలు లేవు. ఎందుకంటే గ్రామాలలో జాతీయ ఉపాధి పథకం కింద ఇదివరకే వ్యవసాయ కూలీలను గుర్తించే విధంగా వారికి జాబ్ కార్డు జారీ చేయడంతో వారికి రైతు భరోసా కింద అట్టి మొత్తాన్ని చెల్లించవచ్చు. ప్రస్తుత రెవెన్యూ వ్యవస్థ, భూ రికార్డులు (ధరణి పోర్టల్ అమలులో ఉన్నందున) రైతు భరోసా పథకం అమలు చేయడానికి వీలులేనందున, అలాగే ధరణి పోర్టల్‌లో అనేక సమస్యలు ఉన్నందున, రైతు భరోసా అమలుకు తిరిగి వీఏఏ, వీఆర్ఓ వ్యవస్థను పునరుద్ధరించాలి. అందుకు అనుగుణంగా భూరికార్డులను తయారు చేయడానికి, పథకం విధి విధానాలను రూపొందించడానికి, ధరణి సమస్యలను సులువుగా పరిష్కరించడానికి, నిష్ణాతులైన పదవీ విరమణ పొందిన రెవెన్యూ అధికారులు, అలాగే అనుభవం ఉండి ప్రస్తుతం సర్వీసులో అనుభవం ఉన్న రెవిన్యూ అధికారులతో, న్యాయకోవిదులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పర్చి, రైతు భరోసా పథకాన్ని అమలు చేసే విధంగా, విధి విధానాలను రూపొందించడమే కాకుండా వ్యవస్థను ధరణిలోని లోపాలకు సరైన పరిష్కారాలను సిఫార్సు చేయాలి. లేకుంటే కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్షాల నుండి, రైతుల నుండి విమర్శలు చేసేందుకు అవకాశం ఇచ్చినట్లవుతుంది.
పి. సురేష్ పొద్దార్
విశ్రాంత జాయింట్ కలెక్టర్, న్యాయవాది
80080 63605