కార్పొరేట్లపై కనికరం... ఉద్యోగులపై ఉదాసీనత
Central government shows mercy to corporates. Not on employees.
ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ మధ్య తరగతి వర్గానికి, వేతన జీవులకు నిరాశే మిగిల్చింది. దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్న కేంద్రం విధించే ఆదాయ పన్ను పరిమితి పెంచకపోవడం, ఆదాయ పన్నులో (సేవింగ్) 80సీ కింద మినహాయింపులు పెంచకపోవడం, పన్ను శ్లాబుల్లో మార్పు లేకపోవడంతో మధ్యతరగతి వర్గాల్లో, ఉద్యోగులలో అసహనం వ్యక్తం అవుతుంది.
ఈ దశాబ్ద కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లని పరిశీలిస్తే ప్రతి బడ్జెట్లో కేంద్రం ఏదో రూపేణా కార్పోరేట్లపై కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సంవత్సరం బడ్జెట్లో కార్పోరేట్లపై విధించే పన్ను 30 శాతం నుంచి 20 శాతానికి తగ్గించింది. కార్పోరేట్లపై కనికరం చూపిన కేంద్ర ప్రభుత్వం మధ్య తరగతి వర్గాలపై, వేతన జీవులపై మాత్రం సవతి తల్లి ప్రేమను కనబర్చుతోంది.
పీఆర్సీలో వేతనం పెరిగినా...
రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మారిన పరిస్థితులకు అనుగుణంగా పీఆర్సీ ప్రకటించి ఉద్యోగుల వేతనాలు కొద్దో గొప్పో పెంచుతుంటే, పెరిగిన వేతనం ఆదాయ పన్నుకే సరిపోతుంది. 2015 వ సంవత్సరంలో ఒక సాధారణ ఉద్యోగి ఆదాయ పన్ను కిందికి వచ్చే వాడే కాడు. పీఆర్సీ ద్వారా వేతనం పెరగగా ఆ ఉద్యోగి 10శాతం వేతనాన్ని ఆదాయపు పన్నుగా చెల్లించాల్సి వచ్చింది. 2021 లో పీఆర్సీ వల్ల జీతం పెరగగా ఆ ఉద్యోగి ఆదాయపు పన్ను కింద 20 శాతం వేతనాన్ని చెల్లించాల్సి వచ్చింది. ఆదాయపు పన్నుకే 20 శాతం వేతనం చెల్లిస్తే ఆ ఉద్యోగి సాధారణ, విద్య, వైద్యం ఖర్చులు ఎలా భరిస్తాడు? భవిష్యత్ కోసం పొదుపు ఎలా చేస్తాడు? రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ ద్వారా కొద్దో గొప్పో వేతనం పెంచుతుంటే కేంద్ర ప్రభుత్వం ఆదాయ పన్ను ద్వారా పెరిగిన వేతనాన్ని ఉద్యోగి నుంచి వసూలు చేస్తోంది.
ఈ మినహాయింపులూ రద్దు చేసి..
ఆదాయ పనుల్లో ప్రవేశపెట్టిన కొత్త, పాత ఆదాయపు పన్ను విధానాలను చూస్తే కొండను తవ్వి ఎలుకని పట్టినట్టుంది. పాత, కొత్త విధానాలు దొందు దొందే. ఎటు చూసినా కేంద్రం వేతన జీవుల నుంచి పిండాల్సినంత పెండడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుంది. కొత్త పన్ను విధానం ప్రకారం 5%,10%, 15%, 20%, 30% గా ఉన్న శ్లాబులు ఆదాయపన్ను సూత్రాల ప్రకారంగానే ఉన్నాయి. కానీ ఈ నూతన విధానంలో 1961 ఆదాయపు పన్ను చట్టం ద్వారా సమకూరిన అన్ని రకాల మినహాయింపులు రద్దు చేయబడ్డాయి. ఉదాహరణకు అండర్ సెక్షన్ 10,10(13A),10(14)(1) అండర్ సెక్షన్ 16(ii),16(iii) అండర్ సెక్షన్ 24(B) కింద ఉన్న మినహాయింపులన్ని రద్దు చేశారు. అంతేకాకుండా చాప్టర్ VI-A కింద ఉన్న జిపిఎఫ్, టీఎస్ జిఎల్ఐ,జీఇఎస్,చిల్డ్రన్ ట్యూషన్ ఫీ, రీ పేమెంట్ ఆఫ్ హౌస్ లోన్ ప్రీమియం,ఎన్ ఎస్ సీ, ఎల్ఐసి,పిఎల్ఐ లాంటివి అన్ని రద్దు చెయ్యబడ్డాయి. ఎనీ అదర్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80సీ,80 సీ సీ డీ,80 సీ సీ డి (1B) కూడా రద్దు చేయబడ్డాయి. అండర్ అదర్ ప్రొవిజన్ ఆఫ్ చాప్టర్ VIA కింద 80జీ, 80ఈ,80డి, 80డిడి,80 టిటిఏ లాంటి అన్ని రకాలైన మినహాయింపులూ నూతన ఆదాయ పన్ను విధానం ప్రకారం పూర్తిగా రద్దు కాబడ్డాయి.
పన్ను శ్లాబ్‌లు ఇంత శాతం పెరిగితే
పాత ఆదాయపు పన్నులో శ్లాబులు 5% నుంచి వెంటనే 20% కి పెంచడం ఆదాయపన్ను సూత్రాలకు విరుద్ధం. ఎప్పుడైనా ఆదాయపు పన్ను శ్లాబుల పెరుగుదల సాధారణంగానే ఉండాలి. 5% నుంచి మధ్యలో 10%, 15% శ్లాబులు తీసివేసి 20%కి పెంచడం ఆదాయపు పన్ను పేరుతో ఉద్యోగుల ముక్కు పిండి పన్ను వసూలు చేయడమే అవుతుంది.
కార్పోరేట్లకు తగ్గించినట్లు మధ్యతరగతి వర్గానికి, వేతన జీవులకు ఆదాయపు పన్ను పరిమితిని పెంచి, పన్ను శ్లాబుల్లో మార్పు చేసి ఉంటే ఆ మేరకు కొనుగోలు శక్తి పెరిగి ఆర్థిక వ్యవస్థకు మేలు జరిగేది. అవకాశం ఉంటే, కొత్తగా వచ్చే ప్రభుత్వమైనా జూలైలో ప్రవేశ పెట్టే పూర్తిస్థాయి బడ్జెట్లో, లేదా వచ్చే సంవత్సరం బడ్జెట్‌లో అయినా తమ గురించి ఆలోచించాలని మధ్య తరగతి వర్గాలు, వేతన జీవులు ఆశిస్తున్నారు.
జుర్రు నారాయణ యాదవ్,
తెలంగాణ టీచర్స్ యూనియన్,
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,
94940 19270.