ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం!
ఈ రోజుల్లో పేద, మధ్య తరగతి కుటుంబాలలో విద్య, వైద్య ఖర్చులు భరించటం దుర్లభంగా మారింది. పిల్లల ప్రాథమిక విద్యను అందించటమే లగ్జరీగా మారింది.
ఈ రోజుల్లో పేద, మధ్య తరగతి కుటుంబాలలో విద్య, వైద్య ఖర్చులు భరించటం దుర్లభంగా మారింది. పిల్లల ప్రాథమిక విద్యను అందించటమే లగ్జరీగా మారింది. అధిక ఫీజులను నియంత్రించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు గత దశాబ్ద కాలంగా వైఫల్యం చెందాయి. నిరాశా, నిస్పృహల్లో కూరుకుపోయిన ఈ వర్గాలకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయ ప్రకటన బీడు భూముల్లో తొలకరివానలా ఈ శుభవార్త ఆనందాన్ని పంచింది. విద్యార్థులకు ఉన్నత చదువులకై ఆర్థికంగా సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ముఖ్యంగా దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందే విద్యార్థులకు విద్యా లోన్లు ఇచ్చేందుకు ప్రధానమంత్రి (పీఎం)- విద్యాలక్ష్మి స్కీమ్‌ను తెచ్చింది. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2024-25 నుంచి 2030-31 వరకు మొత్తం రూ.3,600 కోట్లతో ఈ స్కీమ్‌ను అమలు చేసేందుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మొత్తాన్ని 2024 -25 ఆర్థిక సంవత్సరానికి గాను వర్కింగ్ క్యాపిటల్ కింద ఇవ్వనుంది.
ఇదీ పీఎం-విద్యాలక్ష్మి పథకం
పీఎం- విద్యాలక్ష్మి స్కీమ్ కింద దేశంలోని క్వాలిటీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్ (క్యూహె. ఈఐ)లో అడ్మిషన్లు పొందే విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ గ్యారంటీ ద్వారా లోన్ లభిస్తుంది. నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ద్వారా ప్రకటించే టాప్ 860 క్యూహెచ్‌ఈఐలలో అడ్మిషన్లు పొందే స్టూడెంట్లు ఈ పథకాన్ని పొందడానికి అర్హులు.. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యాసంస్థలతో పాటు... ప్రైవేట్ విద్యాసంస్థలూ ఉంటాయి. ఈ పథకం కింద రూ.7.5 లక్షల వరకు విద్యార్థులకు రుణం ఇస్తారు. ఇందులో 75 శాతం రుణానికి బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది.
దీనికి అదనంగా ఒకవేళ స్టూడెంట్ ఫ్యామిలీ ఇన్ కమ్ రూ.8 లక్షల కంటే తక్కువ ఉండి, ఏ ప్రభుత్వ పథకం స్కాలర్ షిప్ గానీ పొంది ఉండకపోతే.. రూ.10 లక్షల వరకు లోన్ ఇవ్వడంతో పాటు 3 శాతం వడ్డీ రాయితీ కల్పిస్తారు. ప్రతి ఏటా లక్ష మంది స్టూడెంట్లకు వడ్డీ రాయితీ ఇస్తారు. ఇందులో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేరి టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుంది. సెంట్రల్ హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పీఎం-విద్యాలక్ష్మి పోర్టల్ తీసుకొస్తారు. అందులో ఈ లోన్ అవసరమైన స్టూడెంట్లు ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకం త్వరలో అమల్లోకి వస్తే... ముఖ్యంగా పేద, మధ్య తరగతి కుటుంబాలలోని మెరిట్ కలిగిన పిల్లలకు వరప్రదాయినిగా ఉంటుందని అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దండెబోయిన అశోక్ యాదవ్,
గెజిటెడ్ హెడ్మాస్టర్
94405 21990