ఎవరు తీసిన గోతిలో వారే పడతారు ..!

ఎవరు తీసిన గోతిలో వారే పడతారు ..!... central governament falls in ditch says malleshwar

Update: 2023-01-12 18:30 GMT

కోవిడ్‍కి సంబంధించిన ఒమిక్రాన్ సబ్ వేరియంట్, బిఎఫ్-7 చైనాను అతులాకుతులం చేస్తోంది. ఇక్కడ పెరుగుతున్న కేసుల సంఖ్య మొత్తం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. కొత్త వేరియంట్ ఎక్కువగా ఎగువ శ్వాసకోశాన్ని ప్రభావితం చేస్తుందని, బలమైన ఇన్‌ఫెక్షన్ వ్యాప్తిని చెందించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనివల్ల తక్కువ వ్యవధిలోనే ఎక్కువ మంది ప్రజలకు సులభంగా సోకుతుంది. వ్యాక్సిన్ తో సంబంధం లేకుండా వ్యక్తులకు అంటువ్యాధికి సమానంగా ప్రభావితం చేస్తుందని కూడా కనుగొన్నారు.

కొత్త వేరియంట్ విస్ఫోటనంతో చైనా విలవిలలాడుతోంది. ఇక్కడ పెరుగుతున్న కేసుల సంఖ్య మొత్తం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా ఒకే రోజు 3.7 కోట్ల మందికి కొత్త వేరియంట్ నిర్ధారణ అయ్యిందంటే చైనాలో తాజా పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఊహించుకోవచ్చు. మూలం ఎక్కడిదో తెలుసు. అయితే అది కుట్రో లేక యాదృచ్చికమో చెప్పడానికి సరైన ఆధారాలు లేవు.. కానీ ఎవరు తీసిన గోతిలో వారే పడతారని చెప్పేందుకు చైనా ప్రస్తుతం ఎదుర్కొంటున్న దుర్భర సంక్షోభ పరిస్థితులు దృష్టాంతంగా నిలుస్తున్నాయి. ఇంత వేగంగా పరిణామాలు మారిపోతాయని ఎగదోసిన దేశం కూడా ఊహించలేదు.

ఈ వేరియంట్ మహా చెడ్డది

2019లో ఆవిర్భవించినప్పటి నుండి కోవిడ్ అనేక రకాలుగా, బహురూపాలుగా పరివర్తన చెందింది. అన్ని వేరియంట్‌లలో కెల్లా ఓమిక్రాన్ ఎక్కువ కాలం జీవించింది. ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పాటు లైవ్ లో ఉంది. కరోనావైరస్ ఇతర రూపాంతరాల మాదిరిగానే, బిఎఫ్ 7 బలహీనమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉన్నవారిని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. జ్వరం, దగ్గు, గొంతు మంట, కారుతున్న ముక్కు, అలసట, కొద్ది మందికి వాంతులు, విరేచనాలు వంటి కడుపు సంబంధిత లక్షణాలను కూడా అనుభవిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వైరస్ కోట్ల మందికి సోకి ఇప్పటికే లక్షలాదిగా కన్నుమూస్తున్నారు. డిసెంబర్ మొదటి మూడు వారాల్లో దేశ జనాభాలో 18 శాతం మంది అంటే 24.8 కోట్ల మంది కరోనా బారినపడ్డట్టు గణాంకాలు చెబుతున్నాయి వారంలోనే ఈ కేసులు ప్రపంచ వ్యాప్తంగా దావానలంలా వ్యాపించే సరికి, మహమ్మారి తీవ్రతను, జరిగిన నష్టాన్ని దాచేందుకు చైనా ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే అభిప్రాయం నిపుణుల్లో ఉంది.

బూస్టర్ డోసే కాపాడింది.

ఈ నేపథ్యంలో మన దేశం కూడా అప్రమత్తం కావాల్సిన పరిస్థితి వచ్చింది. మనదేశంలో బిఎఫ్ 7 వేరియంట్ కేసులు ఏడు నమోదు అయినట్లు ఇన్సాకాగ్ వెల్లడించింది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లలో ఎక్స్ బీబీ.1.5. వేరియంట్ కేసులు ఒక్కొక్కటి చొప్పున వెలుగులోకి వచ్చినాయి. గతంలో ఎక్స్ బీబీ.1.5, కేసులు గుజరాత్‌లో మూడు, కర్ణాటక,రాజస్థాన్‌లలో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. బీఎఫ్-7 వైరస్ అమెరికా,యూకే , బెల్జియం, జర్మనీ ,ఫ్రాన్స్ , డెన్మార్క్ తదితర దేశాల్లో కూడా వ్యాపించింది, కాకపోతే అక్కడ జరిగిన నష్టం, దాని ప్రభావం తీవ్రంగా లేదనే గణాంకాలు చెపుతున్నాయి. చైనాను కకావికలం చేసినట్లే భారతదేశంలో కూడా వ్యాప్తి చెందనుందన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. భారత్ లో నమోదవుతున్న ఎక్స్ బీబీ వైరస్‌కి సంబంధించి స్వల్ప సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయి కానీ, బూస్టర్ డోస్ తీసుకున్న వంద మందిలో 95 శాతం మంది సురక్షితంగా ఉన్నారని, వచ్చే మూడేళ్లలో ప్రతి సంవత్సరం బూస్టర్ తీసుకోవడం మంచిదనే అభిప్రాయం నిపుణులు వెలిబుచ్చారు. అయితే మన దేశంలో ఓమిక్రాన్ సబ్ వేరియంట్స్ అయిన ఎక్స్ బీబీ, ఎక్స్ బీబీ1.5, బీఎఫ్ 7 ప్రభావం అంతగా ఉండదని, ప్రముఖ వైరాలజిస్ట్, గగన్ దీప్ అభిప్రాయపడ్డారు.

అయిననూ నిర్లక్ష్యం వద్దు..

దేశంలో కోవిడ్ విజృంభణ నేపథ్యంలో కరోనా కొత్త వేరియంట్‌పై జరిపిన అధ్యయన వివరాలు ఇవ్వండని తెలంగాణ ప్రభుత్వం కోరింది. గతంలో మాదిరిగానే మరో మారు సిరో సర్వేకు సిద్ధం అయ్యింది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కొత్త వేరియంట్‌తో నయా పైసా నష్టం లేదని చెప్పిన కేంద్ర ప్రభుత్వం... ఇప్పుడు వైరస్ తీవ్రత లేకున్నా కాంగ్రెస్ భారత్ జోడో యాత్రను ఆపేందుకు, భారత రాష్ట్ర సమితికి పొరుగు రాష్ట్రాల్లో వస్తున్న ఆదరణను చూసి దాన్ని అడ్డుకోవడానికి జిమ్మిక్కులు చేసిందనే విమర్శ ఉంది. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం విదేశీయులకు విమానాశ్రయాల్లో పరీక్షలు తప్పనిసరి చేసింది. అమెరికాలో లేని నిబంధనలు ఇక్కడ అమలు చేస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. డెల్టా తరహాలో ఇది ప్రమాదకరమేమి కాదని, మార్చి నాటికీ తగ్గి పోతుందని వివిధ శాస్త్రవేత్తలు, పేర్కొనడం కొంత ఊరట కల్గిస్తోంది. ఏదిఏమైనా అప్రమత్తత అనేది తక్షణ అవసరం.. స్వీయరక్షణను మించిన ఔషధం ఏదీ లేదు.. చైనాలో వ్యాక్సినేషన్ చేయకుండా కేవలం ప్రజలను ఐసోలేషన్‌లో ఉంచారని, టీకాల పంపిణీలో నిర్లక్ష్యం చేసినందునే 'బీఎఫ్' 7 వేరియంట్ ప్రాణాంతకంగా మారిందనే విమర్శ కూడా ఉంది.

డా.సంగని మల్లేశ్వర్,

విభాగాధిపతి, జర్నలిజం శాఖ,

కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్,

9866255355

Read More...

ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఇంత వివక్షా? 


Tags:    

Similar News