సీబీఎన్ @ 4.O

వ్యక్తులు ముఖ్యం కాదు వ్యవస్థ పని చెయ్యాలి అన్న పరిపాలనా సూత్రాన్ని తూ.చ తప్పకుండా కార్యాచరణలో పెట్టి, నిర్ణీత కాల వ్యవద్ధిలో పింఛన్ల పంపిణీ

Update: 2024-07-05 00:30 GMT

వ్యక్తులు ముఖ్యం కాదు వ్యవస్థ పని చెయ్యాలి అన్న పరిపాలనా సూత్రాన్ని తూ.చ తప్పకుండా కార్యాచరణలో పెట్టి, నిర్ణీత కాల వ్యవద్ధిలో పింఛన్ల పంపిణీ ప్రక్రియను దాదాపు పూర్తి చేసింది ఏపీ ప్రభుత్వం. ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ప్రారంభించిన మొదటి రోజే (జూలై 1వ తేదీనే) రికార్డు స్థాయిలో పంపిణీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులోనే 95 శాతం పింఛన్ నగదును లబ్ధిదారులకు అందజేయటం బట్టి చూస్తే పరిపాలనలలో తనదైన ముద్ర ఎంటో చంద్రబాబు చెప్పకనే చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 4.0లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన అంశాల్లో మొదటిది అమరావతి నిర్మాణమైతే రెండోది పోలవరం పూర్తి.. ఆ తర్వాత ఉపాధి కల్పన.

ఏపీ అంటే అమరావతి, పోలవరం అన్న ధ్యేయంతో కార్యాచరణ రూపొందిస్తున్నారు. ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించాలని మొదటి నుంచీ చంద్రబాబు కలలు కన్నారు. అధికారం చేపట్టిన వేంటనే ఆమరావతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి నిర్మాణ పనుల తీరును అడిగి తెలుసుకుని ప్రాధాన్యత క్రమంలో వాటిని పూర్తి చేయాలని సంకల్పించి కాంట్రాక్టర్లను, నిర్మాణ సంస్దలను పిలిచి సమావేశం నిర్వహించి, పరిపాలనా పరంగా ఉన్న అడ్డంకులను త్వరితగతిన పూర్తి చేయాలని సమీక్ష సమావేశం నిర్వహించారు. అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేసి వాస్తవిక పరిస్థితులను ప్రభుత్వ కార్యాచరణ నిధులు, విదేశీ పెట్టుబడులపై సాధ్యాసాధ్యాలు పరిశీలించడం 4.0 పాలన ప్రథమ ప్రాధాన్యత అని చెప్పవచ్చు. ఏపీకి జీవనాడి.. రాష్ట్రంలో అత్యంత వేగవంతంగా పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ పోలవరం. ఇటీవలే పోలవరంపై క్షేత్ర స్థాయి పరిశీలన పూర్తి చేసి అధికారులతో చర్చించి శ్వేతపత్రం విడుదల చేశారు. రానున్న కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపుపై చర్చించటానికి కేంద్ర ఆర్థిక మంత్రికి నివేదిక సమర్పించనున్నారు.

చంద్రబాబు మరో నినాదం అభివృద్ధి

మౌలిక వసతులు కల్పించి, పెట్టుబడులు తీసుకొస్తే రాష్ట్రం దానంతట అదే అభివృద్ధి చెందుతుంది. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. తద్వారా రాష్ట్రంలోని అన్ని వర్గాలకు మేలు జరుగుతుందనేది చంద్రబాబు ఆలోచన. అందుకే చంద్రబాబు 4.0 పాలనలో ఈ శాఖకు కూడా అత్యంత ప్రాధాన్యత ఉండబోతుందనే చెప్పాలి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనాపరంగా సమస్యల పరిష్కారానికి అడుగులు వేస్తున్నారు. నిన్న ఢిల్లీలో ప్రధానితో ఆర్ధిక శాఖా మంత్రితో, హోం మంత్రితో చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించి పెండింగ్ అంశాల పైన చర్చించారు. పనిలో పనిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌తో సమావేశానికి ప్రతిపాదించారు. ఈ నెల 6న హైదరాబాద్ వేదికగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంలో సంబంధిత అంశాలపై ముఖాముఖి చర్చించుకుందామని ప్రతిపాదించారు.

ఆస్తుల పంపిణీ త్వరగా జరిగితే మేలు..

ఈ సమావేశానికి ముఖ్యమంత్రులతోపాటు రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరు చొప్పున సీనియర్‌ మంత్రులు, సంబంధిత అంశాలకు సంబంధించిన సీనియర్‌ అధికారులు కూడా హాజరవుతారు. ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విభజన చట్టంలో పేర్కొన్న కొన్ని అంశాలు రెండు రాష్ట్రాల మధ్య ఇంకా అపరిష్కృతంగా ఉండిపోయాయి. ఉమ్మడి సంస్థల మధ్య ఆస్తుల విభజన కూడా పూర్తి కాలేదు. ఈ చొరవతో అపరిష్కృతంగా ఉన్న కొన్ని సమస్యలకు పరిష్కారం లభించగలదు. తద్వారా త్వరితగతిన ఆస్తుల పంపిణీ జరిగితే ఆది ఆదాయ వనరు కాగలదు. అలాగే ఉద్యోగుల విషయంలో కూడా స్పష్టత రానుంది

ఉద్యోగుల గౌరవాన్ని నిలబెట్టిన సీఎం

పరిపాలన చేపట్టిన నాటి నుంచి పనిచేసే ఆధికారులకు తగిన ప్రాధాన్యత నిస్తూ గత ప్రభుత్వంలో అయ్యా ఎస్ అన్న అధికారులను దూరం పెట్టటం. ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శుల ఎంపిక కోసం సుదీర్ఘ కసరత్తు చేసి ఆధికారులను నియమించడం, అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించటం, వంటివి పరిశీలిస్తే చంద్రబాబు పరిపాలన పరిణితికి అద్దం పడుతుంది. ఇటీవల ఓ మంత్రి సతీమణి పోలీసులతో మాట్లాడిన తీరును సీఎం తప్పుపట్టారు. ఈ ఘటన తన దృష్టికి రావడం వెంటనే ఆ మంత్రితో ఫోన్‌లో మాట్లాడి వివరణ కోరాడం, అధికారులు, ఉద్యోగుల పట్ల అంతా గౌరవంగా మసలుకోవాలని కోరడం, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఏ స్థాయి వారు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని చెప్పటం బట్టి చంద్రబాబు ఎంత నిశితంగా వ్యవహారాలను పరిశీలిస్తున్నారో దృష్టాంతంగా చెప్పవచ్చు. గత ప్రభుత్వ అవినీతి కలుగులోంచి బయటకు వస్తున్న కట్ల పాముల కోరలు పీకి వ్యవస్థకు పట్టిన అక్రమాల కుబుసాన్ని తొలగించి శ్వేతనాగై బుసలు కొడుతోంది, ఆక్రమార్కుల పని పడుతోంది చంద్రబాబు 4.0 పాలనా వెర్షన్.

- వి.సుధాకర్

99898 55445

Tags:    

Similar News