మండుతున్న కూరగాయల ధరలు..
రోజురోజుకు కూరగాయల ధరలు మండుతున్నాయి. ఈ వేసవికాలంలో ఎండలు ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రతను ఈసారి చూశాం. ఇప్పుడిప్పుడే
రోజురోజుకు కూరగాయల ధరలు మండుతున్నాయి. ఈ వేసవికాలంలో ఎండలు ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రతను ఈసారి చూశాం. ఇప్పుడిప్పుడే ఎండలు తగ్గి చల్లబడుతున్న తరుణంలో కూరగాయల ధరలు సామాన్య ప్రజలను మంటనెక్కిస్తున్నాయి.
15 రోజుల వ్యవధిలోనే..
మామూలుగా అయితే వేసవిలో కూరగాయల ధరలు పెరగడం వర్షాకాలం రాగానే తగ్గడం జరుగుతుంది. ఇప్పుడు అది దానికి విరుద్ధంగా ఎండాకాలంలో ధరలు అంతంత మాత్రంగానే ఉన్నా వర్షాకాలంలో మాత్రం అమాంతంగా పెరిగాయి. కూరగాయలు కిలోకి దాదాపు రూ.80 నుంచి రూ. 100 వరకు పలుకుతున్నాయి. కేవలం 15 రోజుల వ్యవధిలోనే కొండెక్కి కూర్చున్నాయి. ఉల్లి, టమాటా సహా అన్ని కూరగాయల ధరలు 60 శాతం పెరిగాయి. 2024 మే నెలలో ఆహార పదార్థాలు, ఆహార ఉత్పత్తుల తయారీ, ముడి చమురు, సహజవాయువు, నూనెల ధరలు అమాంతం పెరిగిపోవడమే దీనికి ప్రధాన కారణం. ఇవే కాకుండా ఆకుకూరల ధరలు కూడా భారీగా పెరిగాయి. డిమాండ్‌కు తగ్గట్టుగా సరిపడా ఆకుకూరలు మార్కెట్లోకి రాక వీటి ధర భారీగా పెరిగిందని చెప్పొచ్చు. మన రాష్ట్రంలో జనాభాకు ప్రతి ఏడాది 38.54 లక్షల టన్నుల కూరగాయలు అవసరమౌతాయి. ప్రస్తుతం 19.54 లక్షల టన్నుల మాత్రమే ఉత్పత్తి అవుతోందని అంచనా. రాష్ట్రంలో 1.3 కోట్లకు పైగా ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగవుతున్నాయి అందులో కూరగాయలు పంట 3.11 లక్షల ఎకరాలకే పరిమితమయ్యింది. జనాభా అవసరాలకు సుమారుగా 19 లక్షల టన్నుల దిగిబడి కోసం మనం ఇతర రాష్ట్రాల పైన ఆధారపడాల్సి ఉంటుంది. నిత్యావసర ధరలు వారిపై అదనపు భారాన్ని కూడా మోపుతున్నాయి.
దడ పుట్టిస్తున్న టమోటా
ప్రస్తుతం టమోటా ధరలు దడ పుట్టిస్తున్నాయి. వర్షాలు సకాలంలో పడక వర్షాకాలంలో కొత్త పంట వేయడంతో పాటు.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా పడటం వల్ల దిగుమతి తగ్గింది. సీజనల్ కూరగాయలు కాకపోవడంతో ధరలు అమాంతంగా పెరిగి ఉండవచ్చు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుబడి తక్కువగా ఉండడం పెరుగుదలకు కారణమవ్వవచ్చు. రూ. 500లు తీసుకెళ్తే వారానికి సరిపడా కూరగాయలు తీసుకొచ్చే పరిస్థితి లేదంటూ సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు కూడా ముందస్తు ప్రణాళిక ప్రకారం కూరగాయలు పండిస్తేనే సామాన్యులకు ధరలు అందుబాటులో ఉంటాయి. లేకపోతే ధరలను చూసి సామాన్య జనం బెంబేలెత్తవలసిన పరిస్థితి ఉంటుంది.
- మోటె చిరంజీవి,
99491 94327