బుద్ధుని బోధనలు కాలాతీతం
మనిషి పుట్టుకతోనే ఒక మతం ఏర్పడడంతో పెరిగే వయస్సుతో పాటు ఆ మతం తాలూకు నమ్మకాలు అతడి మెదడుపై పెనవేసుకుపోయి, తర్కాన్ని
మనిషి పుట్టుకతోనే ఒక మతం ఏర్పడడంతో పెరిగే వయస్సుతో పాటు ఆ మతం తాలూకు నమ్మకాలు అతడి మెదడుపై పెనవేసుకుపోయి, తర్కాన్ని చిదిమేసి మూఢ నమ్మకాలవైపు నడిపిస్తున్నాయి. మనుషులు ఏర్పరుచుకున్న మతంలో మానవత్వం మరుగునపడి, అనునిత్యం గాయపడే మనోభావాల ఆర్తనాదాలు మంటలు రేపుతున్నాయి. తమ మతం ప్రమాదంలో పడిందనే ఆందోళనతో కంపించి పోతున్న మతస్తులు కొందరు, తమ మతమే ప్రపంచాన్ని ఏలాలనే ఉన్మాదం తలకెత్తించుకొని తీవ్రవాదాన్నే ధర్మయుద్దంగా భావించి దేశాలను అశాంతికి గురిచేసి మరో మతస్తులు మనుషులేనని మరచిపోతున్నారు. ఆయా మత గ్రంథాల్లో పేర్కొన్న దేవుళ్ళ పరాక్రమాలు, గుణగణాలు, ఆలోచనలు నేటి కాలానికి, పరిస్థితులకూ అన్వయిస్తూ చేసే అసమంజస ప్రసంగాలు ఆధ్యాత్మిక వ్యాఖ్యానాలుగా మారిపోతున్నాయి. వీటికి పూర్తి భిన్నంగా మనిషి అతని నడవడిక, ఆలోచన, ఆచరణలే కేంద్రంగా ఏర్పడిన మతం బౌద్ధం. ప్రపంచానికి ప్రేమను కరుణను, అహింసను మొదటిసారిగా అందించిన వాడు బుద్దుడు.
ఎదగడానికి కృషి చేయకుండా..
కర్మను బట్టి మన బుద్ధి నడుచుకుంటుందనీ ఏ ఆలోచన వచ్చినా, ఆపద కలిగినా, ఉపద్రవం సంభవించినా అది మన కర్మ ఫలితమే అనే భావన హైందవం కలిగిస్తుంటే దానికి భిన్నంగా మనం చేసే ప్రతి కర్మ మన ఆలోచనల ఫలితం అని బౌద్ధం చెబుతుంది. ఈ చిన్న తేడా ఆయా మతాలను అనుసరించే మనుష్యుల మీద, సంఘం మీద పెను ప్రభావం ఎలా చూపిస్తోందో పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. ప్రతి దానిని కర్మనే నిర్ణయిస్తే వ్యక్తి తాను చేస్తున్న పనుల గురించి దృఢమైన ఆలోచనలు ఎలా చేయగలడు? పేదరికంలో ఉన్నవాడు, అణచివేయబడ్డ వాడు, అన్యాయాలకు గురవుతున్న వారు ఇదంతా తన కర్మ ఫలితమే అనే ఉదాసీనతకు గురవుతున్నాడు. దీంతో జీవితంలో ఎదగడానికి కృషి చేయకుండా కర్మ ఫలితం మనకిలా, వాళ్ళకిలా రాసిపెట్టి ఉన్నది అని నమ్ముతున్నారు.
ధర్మచింతన ముఖ్యమని..
అలాగే బౌద్దాన్ని ఆచరిస్తున్న సింగపూర్, చైనా, జపాన్, థాయ్‌లాండ్, భూటాన్, వియత్నం లాంటి దెశాల్లో పరిస్థితులు భిన్నంగా ఉండటానికి కారణం.. మన ఆలోచనల ఫలం, మన ఆలోచనల ఆధారంగా మనం నిర్మితమవుతామని వారు నమ్మడం. త్రిశరణాలుగా ఖ్యాతి పొందిన బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అనేవి బుద్ధునికి ప్రతీకలు. సంఘం అంటేనే మనుషుల సమూహం. నైతిక ప్రవర్తన, ధర్మ చింతన, స్వీయ పరిశీలన లేని మనుషులు ఉండే సంఘంలో అశాంతి, ఆటవికతలే రాజ్యమేలుతాయి. కాబట్టి మనిషికి సంఘం ఎంత ముఖ్యమో ఆ సంఘంలో ఉండే మనుషుల్లో ధర్మచింతన అంతే ముఖ్యమని వేల సంవత్సరాల క్రిందటే తెలియపరిచిన బుద్దుని బోధనలు కాలాతీతంగా ప్రపంచానికి మార్గదర్శకాలు.
(బుద్ధ జయంతి సందర్భంగా)
- నరసింహ ప్రసాద్ గొర్రెపాటి
94407 34501