బీఆర్ఎస్, ఈ కృత్రిమ ధర్నలు ఎందుకు?

సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ ద్వారా దేశ చరిత్రలోనే కొత్త రికార్డును తిరగరాస్తుంటే...తమ రాజకీయ భవిష్యత్తుకు

Update: 2024-08-24 01:15 GMT

సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ ద్వారా దేశ చరిత్రలోనే కొత్త రికార్డును తిరగరాస్తుంటే...తమ రాజకీయ భవిష్యత్తుకు నూకలు చెల్లినట్లే అని వణికిపోతున్న గులాబీ దండు.. తిరగరాయలేని ఈ చరిత్రను అడ్డుకోవడానికి అతి తెలివితో కృత్రిమ ఆందోళనలను సృష్టిస్తూ...భుజాలు చరుచుకుంటోంది. ఓ పక్క శరవేగంగా రుణమాఫీ అమలవుతోంటే... వాళ్లకు రాలేదు.. వీళ్లకు రాలేదు ‘అంటూ పొద్దున లేస్తే ఒకటే లొల్లి. అంతటితో ఆగకుండా రుణమాఫీ రాలేదన్న కోపంతో రైతులు ఆందోళనలు చేస్తున్నారంటూ కొన్ని వీడియోలను మీడియాకు రిలీజ్ చేస్తున్నారు. 

రుణమాఫీ పథకం పూర్తయిందని సీఎం కానీ... మంత్రులు కానీ.. లేదా అధికారులు కానీ ఎక్కడైనా ప్రకటించిండ్రా?... లేదు కదా?.. మరి అప్పుడే రుణమాఫీ పథకం ముగిసిపోయినట్లు... వేలాది మంది రైతులకు ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేసినట్లు ఈ దొంగేడ్పులు ఎందుకు? రుణమాఫీ నిధులు ఖాతాలో జమకాని రైతులు ఫిర్యాదు చేయడానికి కలెక్టరేట్ కార్యాలయాల్లో ప్రతేక సెల్‌ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది కదా?... మరి అప్పుడే ఆందోళనలు.. ధర్నాలు ఎందుకు చేస్తున్నట్లు?... ఎవరు చేయిస్తున్నట్లు?...

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ..

కారు గ్యారేజీకి చేరుకోవడం ఖాయంగా మారడానికి కారణమైన సీఎం రేవంత్ రెడ్డిపై బురద జల్లడం ద్వారా ఆనందంతో గంతులేసేందుకు బీఆర్ఎస్ నేతలు సాగిస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఎందుకంటే? ఆగస్టు 15 వరకు మూడు విడతల్లో రుణమాఫీ చేస్తానని ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నిధులు విడుదల చేసింది.

మొత్తం మూడు విడతల్లో.. రుణ విముక్తులైన రైతులు 22,37,848 - రైతుల ఖాతాల్లో జమ చేసిన నిధులు రూ.17,934 కోట్లు. మిగిలిన రైతులకూ వరుసగా రుణాలు మాఫీ అవుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. మొత్తం 32.50 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేసేందుకు రూ.31 వేల కోట్ల రుణమాఫీకి ప్రభుత్వం నిధులు కేటాయించి దేశంలోనే కొత్త రికార్డు నెలకొల్పింది. జూలై 15వ తేదీన రుణమాఫీ జీవో జారీ చేసిన ప్రభుత్వం.. మూడు రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడం మొదలు పెట్టింది.

రైతులను మోసం చేశారంటూ..

కేవలం 27 రోజుల్లోనే దాదాపు 22.37 లక్షల మంది రైతుల కుటుంబాలకు దాదాపు రూ.18 వేల కోట్ల రుణమాఫీ నిధులు జమ చేయటం తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారి. రూ.2 లక్షలకు మించి పంట రుణాలున్న రైతులకు చివరి విడతగా నిధులు కేటాయించనున్నట్లు రుణమాఫీ విధి విధానాల్లో ప్రభుత్వం ముందుగానే వెల్లడించింది. అయితే సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ జరగడంలో జాప్యం జరగడం నిజమే. కానీ...రైతులకు సంబంధించి సరైన వివరాలు అప్ లోడ్ చేయకపోవడం వంటివి దీనికి కారణం. రైతులు బ్యాంకులకు సరైన వివరాలు అందించకపోవడం... 2 లక్షలకు మించి రుణం ఉండటం...ఇది ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదు. అయినప్పటికీ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని అబద్దాలను ప్రచారం చేస్తున్నారు. గులాబీ పార్టోళ్లు గిన్ని విమర్శలు చేస్తున్నరు కదా?... పదేళ్ల కాలంలో మీరు ఎన్ని వేల కోట్లు మాఫీ చేసిండ్రో ఒక్కసారి గుండెల మీద చెయ్యేసుకుని సెప్పుండ్రి. పదేళ్లలో మీరిచ్చింది 20వేల కోట్లు కూడా దాటలే. అయినా రైతులంటే మీకు ఎంతో ప్రేమ ఉన్నట్లు ఒగలేడ్పులు ఎందుకు?. మీరెన్ని ఒగలేడ్పులు ఏడ్చినా... నమ్మెటోడెవడు?

- జంగిటి వెంకటేష్,

తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఉపాధ్యక్షుడు.

9052889696.

Tags:    

Similar News