సంక్షోభంలో బీఆర్ఎస్
అధికారంలో ఉన్నన్ని రోజులు తామే అధికారంలో శాశ్వతంగా కొనసాగుతామని భావించి అసంబద్ధ
అధికారంలో ఉన్నన్ని రోజులు తామే అధికారంలో శాశ్వతంగా కొనసాగుతామని భావించి అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్రాన్ని కల్వకుంట్ల ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలాగా పాలించిన కేసీఆర్ కుటుంబానికి ఇప్పుడు వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీనీ, కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు తమ ప్రతినిధిగా భావించి దశాబ్ద కాలం పాటు అధికారాన్ని అప్పగించారు. కానీ ఈ సదవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ కల్వకుంట్ల కుటుంబ నాయకుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో విధ్వంసకర పాలన జరిగింది. దీంతో ఆ పార్టీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాగ్రహానికి గురై అధికారానికి దూరమైపోయింది.
తాము పదవులు ఇచ్చే ప్రభువులు అయినట్టు... సొంత పార్టీ ఎమ్మెల్యే ఎంపీలతో పాటు అందరూ కూడా తమ బానిసలు అన్నట్టు ఈ నాయకులు వ్యవహరించారు. బంగారు తెలంగాణ పేరుతో ఇతర పార్టీలను చీల్చి తమలో కలుపుకోవడం, కేసీఆర్‌తో, టీఆర్ఎస్ పార్టీతో మొదటి నుంచి ప్రయాణించిన వారిని విస్మరించి పారాచూట్ నాయకులకు అందలం అప్పగించడం నేటి బీఆర్ఎస్ దుస్థితికి కారణం. ఇతర పార్టీల నుంచి సైద్ధాంతిక బలం లేకుండా బంగారు తెలంగాణ పేరుతో బీఆర్ఎస్ పార్టీలో చేరి అధికారం చెలాయించిన చాలామంది నాయకులు ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబం అధికారం కోల్పోయిన 100 రోజుల్లోనే తమ దారి తాము చూసుకోవడం చూస్తే.. బహుశా కేసీఆర్‌కు ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగించవచ్చు.
ఇన్ని ప్రగల్భాలు పలికి..
ప్రత్యర్థి పార్టీలను ప్రతిపక్ష నాయకులను శత్రువులుగా భావిస్తూ కేసీఆర్ ...కేటీఆర్... హరీష్ రావు అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రవర్తించిన తీరు ఇప్పటి అధికారపక్ష నాయకులతో పాటు సొంత పార్టీ ప్రజాప్రతినిధులకు చేదు జ్ఞాపకంగా మిగిలిపోయాయి. టిఆర్ఎస్ పార్టీలో బంగారు తెలంగాణ బ్యాచ్ పేరుతో చేరి పదవులను అనుభవించిన నాయకుడు ఇప్పుడు తీరిగ్గా... పదవుల కంటే ఆత్మగౌరవం ముఖ్యమని కేసీఆర్ అధికారం కోల్పోయిన 100 రోజుల్లోనే ప్రకటించాడు అంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత అరెస్టు అయినప్పుడు తెలంగాణ ప్రజలతో పాటు సొంత పార్టీలో వచ్చిన స్పందన కల్వకుంట్ల కుటుంబానికి ఓ పెద్ద గుణపాఠం. మమ్మల్ని టచ్ చేస్తే ఢిల్లీ అగ్నిగుండం అవుతుందని ప్రగల్భాలు పలికిన వారికి తెలంగాణ ప్రజల స్పందన చూసి ఎలా స్పందించాలో తెలియక గమ్మున కూర్చున్నారు.
మేము గేట్లు తెలిస్తే బీఆర్ఎస్ పార్టీలో మామ, కొడుకు, అల్లుడు, కూతురు తప్ప ఒక్కరు కూడా మిగలరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటించడం చూస్తుంటే బీఆర్ఎస్‌లో సంక్షోభం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారంలో ఉన్నన్ని రోజులు అనుమతి లేకుండా ప్రగతి భవన్ గేటు కూడా దాటనియ్యని వారు... కార్యకర్తల పేర్లు కూడా గుర్తు పట్టని వారు... పార్టీ పేరు నుండి తెలంగాణ పదాన్ని తీసివేసి తద్వారా అస్తిత్వాన్ని వదులుకున్న వారు ఇప్పుడు రాజకీయాల కోసం తెలంగాణ పేరును, కార్యకర్తల ఊసును నెమరు వేసుకోవడం ప్రజలకు హాస్యాస్పదంగా కనిపిస్తుంది.
ఎంపీ టికెట్లు వచ్చినా రాజీనామాలే..
గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినప్పటికీ కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ టికెట్ కోసం సొంత పార్టీ నాయకులతో పాటు తటస్థులు కూడా తీవ్రమైన ప్రయత్నాలు చేసేవారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ లభిస్తే తాము గెలిచిపోయినట్టు సంబరాలు చేసుకునేవారు. కానీ నేడు పరిస్థితి మారిపోయింది. పార్లమెంట్ టికెట్లు పొందిన వారు కూడా పార్టీకి రాజీనామా చేసి ఇతర పార్టీలో చేరి అక్కడి నుండి పోటీకి సిద్ధం కావడం కేసీఆర్ వాస్తవ దుస్థితికి నిదర్శనం. అధికారం కోల్పోయి ప్రజల చేతిలో శిక్షకు గురైనప్పటికీ ఈ నాటికి తామే శాశ్వత అధికారానికి అర్హులం అన్నట్టు, ఇతరులకు అధికారం చలాయించే సామర్థ్యం లేదన్నట్టు కేటీఆర్... కేసీఆర్ మాట్లాడుతున్న తీరు ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మరోసారి మారింది. ఇతర పార్టీలో చేరికలు, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్టు పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల పోటీకి నిరాసక్తత వంటివి, అసలు సిసలు రాజకీయాలు అంటే ఎలా ఉంటాయో ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబానికి తెలియజేస్తున్నాయి.
ఫోన్ ట్యాపింగ్‌తో అడ్డంగా దొరికినా...
క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టంగా లేకపోవడం తెలంగాణ వాదంతో కేసిఆర్‌తో దశాబ్దాలుగా ప్రయాణించిన వారిని విస్మరించడం తెలంగాణ రాజకీయ చరిత్రలో కేసీఆర్ చేసిన అతి పెద్ద చారిత్రక తప్పిదం. ప్రజల నుండి వచ్చే బలం కంటే పార్టీ ఫిరాయింపు చేసిన నాయకుల నుండి వచ్చిన బలమే శాశ్వతం అని విర్రవీగిన కేసీఆర్‌కు ఇప్పుడు సొంత పార్టీ నాయకుల తీరుతో పాటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వస్తున్న ఆరోపణలు పెద్ద అగ్ని పరీక్షలా మారనున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదో సాధారణ పరిపాలన కార్యక్రమంలా భావిస్తూ కేటీఆర్ చేసిన ప్రకటనలు వాళ్ళ డొల్లతనాన్ని తెలియజేస్తాయి. ప్రతిపక్ష నాయకులతో పాటు సొంత పార్టీ ప్రతినిధుల ఫోన్లను, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొంత మంది ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని ప్రభుత్వ వర్గాల నుండి లీకులు రావడం కేసీఆర్ పాలనలోని చీకటి కోణాన్ని తెలియజేస్తున్నాయి. దశాబ్ద కాలం పాటు అధికారాన్ని అనుభవించిన బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర ఎలా పోషిస్తుందో చూడాలి. అలాగే ఈ తీర్పు అధికారంలో ఉన్న పార్టీకి కూడా కనివిప్పు కలిగించాలి. అధికారంలో ఉన్నన్ని రోజులు చేసిన పనులకు జవాబుదారితనంగా ఉంటూ వాటికి అహంకార పూరితంగా కాకుండా విజ్ఞతతో సమాధానం ఇవ్వడం కీలకమని తెలుసుకోవాలి.
మాచనపల్లి శ్రీధర్
సీనియర్ జర్నలిస్ట్
90527 89666