అధికార దుర్వినియోగానికి పరాకాష్ట

BRS is the epitome of abuse of power

Update: 2024-05-11 00:45 GMT

బీఆర్‌ఎస్ ప్రభుత్వం గద్దెదిగిన తర్వాత వారి హయాంలో జరిగిన అవినీతి భాగోతాలు బట్టబయలు అవుతున్నాయి. వారు పెట్టిన అవినీతి పుట్టలు రోజుకొక్కటి పగులుతున్నాయి. ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కోకొల్లలు. అధికార ముసుగులో రెవెన్యూ, నిఘా, పోలీసు వ్యవస్థలను దుర్వినియోగపరిచారు. పశు సంవర్థక శాఖలో, మిషన్ భగీరథ స్కీం ద్వారా, ఔటర్ రింగ్ రోడ్ లీజుకియ్యడం వంటి స్కామ్‌లు చూసి సగటు తెలంగాణవాది నివ్వెరపోతున్నాడు.

‘రైతుబంధు’ను శ్రీమంతులకు, గుట్టలకు వర్తింపజేసి పేదలకు దక్కాల్సిన ప్రభుత్వ సొమ్మును శ్రీమంతులకు పలారం పంచినట్టు పంచారు. దీంతో కౌలు రైతుకు ‘రైతుబంధు’ బంధువు కాలేకపోయింది. ‘ధరణి’ చిన్న-సన్న కారు రైతులను అరిగోస పెట్టించింది. ఇక కాళేశ్వరం అవినితీ తెలిసి బీఆర్ఎస్ పార్టీని అసలు సిసలైన ఉద్యమకారులు వారి నాయకత్వాన్ని చీదరించుకుంటున్నారు. అలాగే అధికారంలో ఉన్నప్పుడు జరిపిన ఫోన్ ట్యాపింగ్, అసెంబ్లీ ఎన్నికల్లో పోలీసుల వాహనాల్లో డబ్బు పంపిణీ వంటివి తెలిసి ప్రజలు ఆశ్చర్య కితులవుతున్నారు.

పనిచేయని బీఆర్‌ఎస్ జిమ్మిక్కులు

బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ‘నీటి’ పేరుతో ప్రభుత్వ ‘నిధుల’ను దండిగా కాజేయడానికి జరిగిన కుట్రలు ఎన్నెన్నో. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి, ఉద్యమ జ్వాలలు చల్లార్చకుండా అనునిత్యం పోరాడిన యువతను బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఖాతరు చేయకుండా, వారిని చిన్నచూపు చూసింది. రాజకీయం కోసం కన్నతల్లిలా ఉండాల్సిన బి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం, సవతితల్లిలాగా మారిపోయి, యువత కలలుగన్న ‘నియమకాల’ ఊసే ఎత్తకుండా వాటిని కావాలనే మర్చిపోయింది. చివరకు అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్ని ప్రచార ప్రకటనలిచ్చినా కూడా కారు బోల్తా పడలేక తప్పలేదు. ఇప్పటికీ బీఆర్‌ఎస్ పార్టీ అగ్ర నాయకులకు అధికారం శాశ్వతం కాదనే నగ్నసత్యం బోధ పడట్లేదు. అధికారం నెత్తికెక్కినప్పుడు వాళ్ళ పార్టీ గుర్తుపై ‘కుక్క’ను పెట్టినా గెలుస్తుందని కారుకూతలు కూసిన బీఆర్‌ఎస్ అధినాయకత్వానికి, నేడు ఆ పార్టీలో గెలిచిన వారే పార్టీ మారుతున్నా ఆపలేని స్థితిలో ఉంది. అధికారం ఏ ఒక్క పార్టీ సొత్తు కాదు. ప్రభుత్వాలు ప్రజా సమస్యలు పట్టించుకోక, నేల విడిచి సాము చేసినప్పుడు ఏ పార్టీ అయినా అధికారం కోల్పోక తప్పదు. ఇది తథ్యం.

-డా. శ్రీరాములు గోసికొండ,

సోషల్ సైంటిస్ట్

92484 24384

Tags:    

Similar News