పవిత్ర విభాగాలు కలుషితం... ఈ పాపం బీఆర్ఎస్‌దే!

BRS government polluted IB and State Intelligence Bureau

Update: 2024-03-09 01:15 GMT

పోలీసు శాఖలోని కీలకమైన ఎస్ఐబీ, కౌంటర్ ఇంటలిజెన్స్ విభాగాల బాస్‌లు, అధికారులు, సిబ్బంది అందరు రోజువారీగా అప్డేట్ అవుతూ ఉంటారు. లేదంటే వారు ప్రజా భద్రత, రక్షణలో ఫెయిల్ అయినట్లే. ఉగ్రవాద, తీవ్రవాద, మత్తు మాఫియా... ఇంకా అనేక కరుడుగట్టిన క్రిమినల్స్ విసిరే సవాళ్ళను ఆదిలోనే అణిచివేసే విధంగా ఈ విభాగాల్లోని సిబ్బంది సాంకేతికంగా, భౌతికపరమైన ఆపరేషన్‌లకు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఒక ఉద్దేశ్యం, లక్ష్యంతో ఏర్పాటైన ఈ విభాగాన్ని చాలామంది అధికారులు పవిత్రంగా భావిస్తారు.

ఈ విభాగాలు నిరంతరం ప్రజల రక్షణ కోసం పని చేస్తుంటాయి. ప్రజా భద్రతకు ముప్పు కలగకుండా ఈ విభాగాలు కంటి మీద కునుకు లేకుండా పని చేస్తాయి. ప్రజలను భయాందోళనకు గురి చేసే టెర్రరిస్ట్, మావోయిస్టు, ఇతర అల్లరి మూకల ఫై డేగ కన్నుతో వెంటాడుతుంటాయి. ఈ విభాగం ప్రజలకు ఇటు రాష్ట్రానికి రక్షణ కవచం. కానీ ఈ పవిత్రమైన విభాగాల్లోకి తమ అడుగులకు మడుగులొత్తేవారిని తీసుకువచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం పోలీస్ శాఖను కలుషితం చేసింది.

ఆఫీసర్లు వ్యతిరేకించినా..

ఈ విభాగాలకు చెందిన అత్యంత విలువైన సాంకేతిక పరిజ్ఞానం, సాధనాలను రాజకీయంగా వాడుకునేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీజం వేసింది. అయితే దీనిని కొందరు నిజాయితీగల అధికారులు వ్యతిరేకించారు. ఈ విభాగం సేవలను రాజకీయ అవసరాలకు వాడుకోవడం చట్టవిరుద్ధమని, ఇది ప్రజా భద్రతకు విఘాతం కలిగిస్తుందనీ, ఇది ప్రమాదకరమని హెచ్చరించారు. ఎన్ని ఒత్తిడిలు వచ్చినా ప్రభుత్వ నిర్ణయాన్ని కొన్ని రోజుల పాటు సంబంధిత అధికారులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వం అలాంటి నిజాయతీ గల ఆఫీసర్స్‌ను మార్చి ఈ పవిత్రమైన విభాగాలను వారి అడుగులకు మడుగులు ఒత్తే వారిని తీసుకు వచ్చి మొత్తం కలుషితం చేసిందని తాజాగా ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావు సస్పెండ్ ఉదంతంతో తేటతెల్లమైంది. అగ్జిల్లరి పదోన్నతిలోని నిబంధనలను పూర్తిగా విస్మరించి అతనికి డీఎస్పీ పదోన్నతిని కల్పించిన విషయం ఇప్పుడు దుమారం రేపుతోంది.

ప్రణీత్ రావు ఒక్కడే కాదు..

ఎస్ఐబీలో కీలక సమాచారాన్ని ధ్వంసం చేసిన ఆరోపణలపై అతనిని డీజీపీ రవి గుప్తా సస్పెండ్ చేశారు. అయితే ఇతను ధ్వంసం చేసిన సమాచారంతో జరిగిన పరిణామాలపై పూర్తి విచారణ జరిపి ప్రణీత్ రావుతో లింక్ ఉన్న వారిని కూడా అరెస్టు చేస్తే గాని ఈ విభాగాలకు అంటిన కలుషితం పోదని ఇప్పుడు తెలంగాణ పోలీసు శాఖలో టాక్. ఇతర రాష్ట్రాల పోలీసు బాస్‌లు కూడా దీనిపై చర్చించుకుంటున్నారు.

కొత్త ప్రభుత్వం ఈ తప్పు చేయొద్దు!

బీఆర్ఎస్ చేసిన తప్పును కాంగ్రెస్ చేయొద్దని ఇప్పుడు అందరూ కోరుకుంటున్నారు. ప్రభుత్వాలు తమ స్వార్థం కోసం ప్రజా భద్రతను సంరక్షించే పోలీసు శాఖను కలుషితం చేయొద్దని పోలీసులతో పాటు, ప్రజలు కూడా కోరుకుంటున్నారు. పోలీసు శాఖ పోస్టింగ్‌లు, పదోన్నతులు కల్పించే అంశంలో మెరిట్స్‌ను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు అమెరికా, ఇంకా కొన్ని విదేశాల్లో ఉంటున్నట్లుగా ప్రజలు ఎన్నుకునే స్వతంత్ర బోర్డులను ఏర్పాటు చేస్తే పోలీసు డిపార్ట్మెంట్‌లో రాజకీయ, ప్రజాప్రతినిధుల అనవసర జోక్యాలను నివారిస్తుంది.

గొట్టిముక్కుల సుధాకర్ గౌడ్

సీనియర్ జర్నలిస్ట్

9052116459

Tags:    

Similar News