ఊహించని మలుపులు.. తెలంగాణ రాజకీయాలు

BRS, BJP, CONGRESS Parties Ready For 2024 Elections In Telangana

Update: 2023-07-23 00:30 GMT

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల జోరు మొదలైంది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిని మించి మరొకటి వ్యూహాత్మకంగా ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. 2024 జనవరి 16 తో ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీకి పదవీకాలం ముగుస్తుంది. 2023 డిసెంబర్ నెలాఖరు వరకే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. దీనికి రెండు నెలల ముందే షెడ్యూల్‌ను విడుదలవుతుంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రజల మద్దతును పొందడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాయి. అధికార పార్టీ సైతం ప్రజలను ఆకట్టుకోవడానికి ఏం చేయాలి, ఎలా చేస్తే ప్రజలు వచ్చే ఎన్నికల్లో మళ్లీ మనకు పట్టం కడతారు అనే అంశాలసైనే దృష్టి సారించింది. ఈ సమయంలో జాతీయ రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్‌పై ఒత్తిడి సహజంగానే పెరిగి పోతుంది.

ఎన్నికలకు ఎంతో దూరం లేకపోవడంతో ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టాయి. ఆత్మీయ సమ్మేళనాలు, పాదయాత్రలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రత్యర్థి పార్టీలో అభ్యర్థి ఎవరు.. ప్రజల్లో ఆ వ్యక్తికి ఏ స్థాయిలో మద్దతు ఉందన్న కోణంలో సొంత పార్టీ అభ్యర్థిపై కసరత్తులు చేస్తున్నాయి. వీలైనంత త్వరగా ఫైనల్ లిస్టు సిద్ధం చేసి అభ్యర్థులను ప్రకటించి... ప్రచారపర్వంలో జోరు పెంచాలని తహతహలాడుతున్నాయి. వచ్చే నెలలో రెండు పార్టీలు కొంత మంది అభ్యర్థులకు సీట్లను ఖరారు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి..

బీఆర్ఎస్ ధీమాతో ఉన్నా..

తెలంగాణలో సెంచరీకి ఒకటి తక్కువ 99 సీట్లు సాధిస్తామని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్‌కు 103 సీట్లు ఉన్నాయి. అయితే ఆ పార్టీ వారు ప్రత్యర్థులను చాలా బలహీనులుగా అంచనా వేయడం మాత్రమే కాదు. చిన్నపామునైనా పెద్దకర్రతో కొట్టే యుద్ధనీతినే అనుసరించాలి. అధికార పార్టీలు మళ్లీ అధికారం దక్కడం గురించి ఎన్ని మాటలైనా చెప్పుకోవచ్చు. కానీ క్షేత్రస్థాయిలో 99 సీట్లు సాధన నిజమయ్యే పరిస్థితులు కనుచూపు మేరలో కానరావడం లేదనేది గుర్తించాలి. అనూహ్యంగా ముందుకు దూసుకెళుతున్న రాష్ట్ర కాంగ్రెస్ కేడర్‌పై బీఆర్ఎస్ ఆకర్ష్ వల విసురుతున్నది. నియోజకవర్గాల వారీగా ఎక్కడ దెబ్బకొడితే కాంగ్రెస్ వీక్ అవుతుందో అలాంటి నేతలపైనే ప్రధానంగా గురిపెట్టింది. ఇందుకోసం మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎమ్మెల్సీ కవిత రంగంలోకి దిగి, బలమైన నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతల చేరికలు ఉండేలా ప్రగతి భవన్ కేంద్రంగా పార్టీ చీఫ్ కేసీఆర్‌తో పాటు పలువురు ముఖ్యనేతలు ఇదే టాస్క్‌లో నిమగ్నమయ్యారు. తెరపైన కేటీఆర్, హరీశ్, కవిత కనిపిస్తున్నా.. తెరవెనుక పెద్ద టీమే పార్టీని నడిపిస్తుందని వార్తలు వస్తున్నాయి. గులాబీ కండువా కప్పుకుంటే రాజకీయ భవిష్యత్ ఉంటుందని వారిలో నమ్మకం పెంచుతున్నారు.

బలపడుతున్న కాంగ్రెస్ !

కాంగ్రెస్ పార్టీ అంటేనే ముఠా తగాదాలకు చిరునామా. తెలంగాణ కాంగ్రెస్ అందుకు అతీతమైనదేమి కాదు. గుప్పెడు ఓట్లు సాధించలేని నేతలు కూడా రాష్ట్ర నాయకత్వం నిప్పులు చిమ్ముతారు, కానీ ఇప్పుడా పరిస్థితి లేనే లేదు, ఊహించని రీతిలో తెలంగాణ కాంగ్రెస్‌లో దూకుడు కనిపిస్తోంది. అధినాయకత్వం తెలంగాణ కోసం ప్రత్యేకంగా కార్యాచరణ సిద్ధం చేస్తోంది, బీజేపీలో అంతర్గత కలహాలు కాంగ్రెస్‌కు కలిసి వస్తున్నాయి. కడుపులో కత్తులు దాచుకున్నారేమో తెలియదు గానీ.. పైకి మాత్రం అంతా ఒక్కటేనన్నట్లు మసలుతున్నారు. ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల తర్వాత.. కొత్త ఉత్సాహంతో కాంగ్రెస్ శ్రేణులు పనిచేస్తున్నాయి. జాతీయ స్థాయిలో శరద్ పవార్ లాంటి నేతలు సైతం కేసీఆర్‌ను బీజేపీకి బీ టీంగా అభివర్ణించారు. తెలంగాణ కాంగ్రెస్ అదే నినాదాన్ని బలంగా తీసుకెళ్తుంది. అంతే కాకుండా బీఆర్ఎస్‌, బిజెపిలోని అసంతృప్త నాయకులకు కాంగ్రెసు పార్టే పెద్ద దిక్కుగా కనిపిస్తోంది. అందులోనే తమకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని నమ్ముతున్నారు.. ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులు తమ ప్రస్థానానికి కాంగ్రెస్‌ను ఎంచుకోవడం పార్టీకి పెద్ద మైలేజ్‌గా చెప్పుకోవచ్చు.. నానా రకాలుగా ఒత్తిడిలు పడిన తర్వాత కూడా వారు కాంగ్రెస్ వైపే మొగ్గడంతో.. ‘ఏది బెటర్’ అనే సంశయం ఉన్న ఆశావహులకు ఒక దారి దొరికినట్లు అయింది. సాధారణంగా రాష్ట్ర స్థాయుల్లో గ్రూపులను ప్రోత్సహించే అలవాటున్న కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఈసారి భిన్నంగా వ్యవహరిస్తోంది. కేసీఆర్ మీద కాంగ్రెస్, బీజేపీ నాయకుల కంటే కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడే షర్మిల కూడా కాంగ్రెస్‌లో చేరడం నిజమైతే.. ఆ పార్టీకి మహోత్సవం కలుగుతుంది. అన్ని రకాలుగానూ.. కాంగ్రెస్‌కు గతం కంటే సానుకూల పవనాలు వీస్తున్నాయి. కాంగ్రెస్ మీద కేసీఆర్ చేసే విమర్శలు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కూడా కేసీఆర్ ఎంపిక చేస్తారని, గెలిచిన తర్వాత తన పార్టీలో కలుపుకుంటారని బీజేపీ చేస్తున్న ప్రచారాలు పెద్దగా ఫలితమివ్వకపోవచ్చని విమర్శకుల అభిప్రాయం. కేసీఆర్‌కు చెక్ పెట్టడంలో ప్రస్తుతానికి బీజేపీ కంటే కాంగ్రెస్‌దే పైచేయిగా కనిపిస్తోంది.

బీజేపీ స్లో అయినా సీరియస్సే..

మొన్న మొన్నటిదాకా కేసీఆర్ సర్కారు మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ.. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్‌కి చుక్కలు చూపించిన భారతీయ జనతా పార్టీ ఒక్కసారిగా స్పీడ్ మోడ్‌లో నుంచి స్లో మోడ్ లోకి వెళ్లిపోయింది. తెలంగాణ బీజేపీలో ముఠా తగాదాలు హద్దులు మీరుతున్నాయి. పాత, కొత్త నేతలకు మధ్య పొసగడం లేదు. ఇప్పుడు అధికారం దక్కుతుందని అనుకుంటున్న వేళ.. వీరి కుమ్ములాటలు ఏకంగా పార్టీ దూకుడును కూడా మందగమనంగా మార్చేశాయి. అయినప్పటికి బిజేపీ, బీఆర్ఎస్‌కు ఎంతో కొంత నష్టం చేయకుండా ఉండలేని పరిస్ఠితి. బీజేపీ నుంచి కూడా చాలా మంది కీలక నాయకులు కాంగ్రెస్ వైపు వెళ్లబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు వరుసగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించే పనులు పెట్టుకొన్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఎదురైన చేదు అనుభవాలను పరిగణనలోకి తీసుకొని తెలంగాణలో మెరుగైన వ్యూహాలతో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి బీజేపీ అధిష్టానం గట్టి పట్టుదలతో పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే తెలంగాణలో బీజేపీ రాష్ట్ర నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ అధిష్టానం రాష్ట్ర నాయకత్వంలో అనూహ్య మార్పులు చేర్పులు చేసిందని ప్రజలు భావిస్తున్నారు.

ప్రజా నిర్ణయమే ఫైనల్!

హ్యాట్రిక్ కొట్టాలనే కోరిక కేసీఆర్‌కు ఉండొచ్చు. ఒకసారి హ్యాట్రిక్ సీఎం అనిపించుకుని.. ఆరునెలల తర్వాత కేటీఆర్‌కు పట్టాభిషేకం చేసేసి.. హస్తినాపురి కేంద్రంగా తర్వాతి జీవితం గడపాలనే ఆలోచన, ఆశ ఉండొచ్చు. హ్యాట్రిక్ అవకాశాన్ని తెలంగాణ ప్రజలు కచ్చితంగా ఇస్తారనే అంచనాలతో ఉన్నారు. రాజకీయరంగంలో అపర చాణక్యుడుగా ప్రసిద్ధి పొంది, ఊహకందని రీతిలో శత్రువులను సైతం తన వైపు తిప్పుకునే చాతుర్యమున్న కేసీఆర్‌ను తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు. ఎర్రకోట మీద గులాబీ జెండా రెపరెపలాడిస్తానని ప్రతిజ్ఞ చేసిన కేసీఆర్‌కు, గోల్కొండ కోట మీద రెపరెపలాడించే అవకాశం మళ్లీ దక్కుతుందా లేదా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కి అవకాశం ఇస్తారా లేదా తెలంగాణకు మద్దతు ఇచ్చిన బీజేపీకి పట్టం కడుతారా అన్నది రాబోయే కాలంలో ఓటర్లే నిర్ణయించాల్సి ఉంటుంది!

డా. బి. కేశవులు నేత. ఎండి.

చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం.

85010 61659

Tags:    

Similar News