లంచం ఇవ్వడమూ నేరమే!

అత్యాశనే మానవ జీవితంలో అతిపెద్ద కుంభకోణం...సులువుగా తమ పనులు కావాలనే స్వార్థం ప్రజలదైతే...ప్రజల వద్ద ఉన్న అవకాశాలను లంచం

Update: 2024-12-11 00:45 GMT

అత్యాశనే మానవ జీవితంలో అతిపెద్ద కుంభకోణం...సులువుగా తమ పనులు కావాలనే స్వార్థం ప్రజలదైతే...ప్రజల వద్ద ఉన్న అవకాశాలను లంచం రూపంలో తీసుకోవడం...లంచం ఇస్తే గానీ పనులు జరగకపోవడం బంగారు తెలంగాణలో నిజంగా బాధాకరం.. అటెండర్ నుంచి కలెక్టర్ దాకా బల్ల కింద నుంచి చేయి చాచే గుణాన్ని పెంచుకుంటున్నారు. ఓ సంతకానికే కోట్ల రూపాయల డబ్బులను లంచంగా తీసుకోవడం...నిజంగా వ్యభిచారం కంటే ఘోరమైన పని.

జిల్లా స్థాయిలో మంత్రితో సమానమైన హోదాను కలిగి, ఏ క్షణంలోనైనా పరిస్థితులను బట్టి స్వయం నిర్ణయం‌ తీసుకునే విశేషమైన అధికారాన్ని కేవలం కలెక్టర్లకే ఇచ్చింది మన వ్యవస్థ. స్వార్థంగా వ్యవహరించిన రాజకీయ నాయకులను సైతం ఎదురించే అధికారం కలెక్టర్లకు ఉంది. అయితే, ప్రజల కోసం వినియోగించాల్సిన అధికారాన్ని.. కేవలం పాలకుల కోసం వినియోగించి వారికి పావులుగా కలెక్టర్లు మారిపోవడం దురదృష్టకరం. విచక్షణ, నిబద్ధత లేని అధికారుల వల్ల తెలంగాణ నయా దోపిడీకి గురవుతుంది. రోజురోజుకూ నయా విధానంలో జరుగుతున్న ఈ లంచం అనే అవినీతి దోపిడీపై మరో తిరుగుబాటు అవసరమే అనిపిస్తోంది. భవిష్యత్తులో చావడానికి కూడా లంచం ఇచ్చే పరిస్థితుల్లోకి తెలంగాణ జారుకునే అవకాశం ఉంది. ఇప్పటికే సామాన్య, మధ్యతరగతి వారికి ప్రభుత్వ కార్యాలయాల్లోకి వెళ్లడానికి కూడా లంచం అనే ఫీజు చెల్లించవలసి న పరిస్థితులు.. ఇది కేవలం అధికార యంత్రాంగం తప్పిదమని కూడా చెప్పలేం. ఓపిక సహనం లేని ప్రజలు.. బాధ్యత మరిచిన అధికారులు. వారి వెనుక అండగా ఉండే రాజకీయ నాయకులు. సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించని యువత అందరూ దీనికి కారణం.

ఇది ఎప్పటికీ ఆగదా?

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి ప్రజలకు నిస్వార్థ సేవ చేయవలసిన వివిధ రంగాల ఉద్యోగ వర్గం బల్ల కింద నుంచి చేయిచాచడం మాత్రం ఆగడం లేదు. ప్రధానంగా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ అధికారుల వద్దకు వెళ్లాలంటేనే సామాన్య ప్రజలు జంకాల్సిన పరిస్థితి దాపురించింది. దేశవ్యాప్తంగా లంచం అనే మహమ్మారి బారిన పడిన వారెందరో సమాజానికి తన వృత్తి ద్వారా సేవలందించాల్సిన వారు అక్రమ సంపాదనకు అలవాటు పడడం.. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే లంచం లేనేదే పని జరగదనే విధంగా ప్రజల్లో దొడ్డిదారిని వారి మెదళ్లలో నిండా నింపారు. ప్రజలు సైతం సహనాన్ని కోల్పోయి తమ అత్యుత్సాహం వల్ల పనిజరిగితే చాలు అన్నట్లుగా లంచం ఇవ్వడానికి సిద్దపడుతున్నారు.

కోట్లకు పడగలెత్తడం ఎలా సాధ్యం?

చిన్న ఉద్యోగుల నుంచి కలెక్టర్ హోదా అనుభవించిన వారు సైతం లంచాలకు నీతిని అమ్మేసి అవినీతిని గెలిపిస్తున్నారు. గతంలో రంగారెడ్డి జిల్లాలో తహసీల్దార్‌పై పెట్రోల్ పోసిన చంపిన ఉదంతం.. మెదక్ జిల్లా అదనపు కలెక్టర్‌గా పని చేసిన ఓ వ్యక్తి కోటికి పైగా లంచంతో రెడ్ హ్యాండెడ్‌గా గతంలో దొరికిపోయారు. వివిధ స్థాయిలోని ఉద్యోగులు లంచావతారాలెత్తి కోట్లకు పడగలేస్తున్నారు‌. చిన్న స్థాయి ఉద్యోగి నుంచి అదనపు కలెక్టర్ వరకు లంచానికి దాసోహం కావడం పేదలను మరింత అదిమి పట్టడమే అవుతుంది.

సేవలను డబ్బుతో కొనడమూ నేరమే!

ప్రతీ కార్యాలయంలో సేవల వివరాలు అవి పొందే విధివిధానాలు ఏ పని ఎన్ని రోజుల్లో చేస్తారో వివరించే ఫిజికల్‌ చార్టర్‌లు చాలా శాఖల్లో ప్రకటించారు. వీటిని సక్రమంగా అమలు జరిగేలా కార్యాచరణ ఉండాలి. సమాచార హక్కు చట్టం ద్వారా పూర్తి సమాచారం ప్రజలకు తెలుసుకునే వీలు కలిగింది. దీన్ని సక్రమంగా వినియోగించుకుంటే అవినీతి దూరమవుతుంది. కేంద్రీ కృత పాలన అవినీతికి మూలమైంది. దీనికి విరుగుడుగా అధికార వికేంద్రీకరణ జరగాల్సి ఉంది. అవినీతి వ్యతిరేక ఉద్యమం నిరంతరం కొనసాగాలి. చురుకైన పౌర సమాజం అంతకంటే అవసరం. ప్రభుత్వోద్యోగుల నియామకాలు, బదిలీ, పదోన్నతి, క్రమశిక్షణా చర్యల లాంటి అంశాలను స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సివిల్ సర్వీస్ బోర్డ్ లాంటి వ్యవస్థకు అప్పగించాలి. రాజకీయ జోక్యాన్ని పూర్తిగా తొలగించాలి. ప్రభుత్వం చేత పని చేయించుకోవడం పౌరులుగా మన బాధ్యత ‌‌‌దానిని డబ్బుతో కొనాలని చూడడం నేరమే. మన అవసరం కొంత ఆలస్యమైనా ఫర్వాలేదు గానీ అవినీతిని మాత్రం ప్రోత్సహించకుండా ‌‌‌‌ఉండాల్సిన బాధ్యత అందరి పైన ఉంది.

సంపత్ గడ్డం

78933 03516

Tags:    

Similar News