ఊరి జ్ఞాపకాలలోకి తీసుకెళ్లే 'సొంతఊరు'
Book Review of Sontaooru written by varala anand
దాశరథి యుద్ధం వద్దని చెబుతూ కోట్లకొలది ధనాన్ని యుద్ధం కోసం ఖర్చు చేయడం వృథా అంటారు. అంతేకాదు సైనికుడే సైరికుడై భూమిని సాగు చేయాలని దయను వెలిగించాలని అంటారు. ఇదే విధంగా కవిగా చాలా అంశాలనే సాగు చేయాలని చూశారు ‘సొంత ఊరు’ పుస్తక రచయిత వారాల ఆనంద్.
పుస్తకాల మధ్య కొలువు చేసిన ఆయన విరమణ అనంతరం తన ఇంటిని, మనసును పుస్తకాల కొలువుగా మార్చారు. ఆనంద్ రచన, దర్శకత్వంలో పలు డాక్యుమెంటరీ చిత్రాలు వెలువడ్డాయి. అలాగే వివిధ ప్రక్రియలలో పుస్తకాలు రాశారు. అనేక భాషలలో కవిత్వాన్ని అనువదించారు. ఈ మధ్యనే వారు వెలువరించిన ‘ఆకుపచ్చ కవితలు’ (గ్రీన్ పోయెమ్స్ - గుల్జార్ ) అనే అనువాద కవిత్వానికి ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా అందుకున్నారు.
వారాల ఆనంద్ ఈ ‘సొంత ఊరు’ పుస్తకంలో ‘సాయంకాలం’ అనే తొలి కవితతో పలకరించారు. వీరి కవిత్వాన్ని సంక్షిప్తంగా పరిశీలిస్తే అక్షరాల మధ్య కాటగలిసిన ఒక భావుకుడిని మనం చూడొచ్చు. ఒంటరితనం వరమా శాపమా అంటారాయన, ఒంటరితనాన్ని ఏకాంతంగా మార్చుకుంటే అది వరమే కదా, కానీ ఎందరు మనుషులకు ఎన్ని మనసులకు అది సాధ్యమో! మరో కవితలో, దుఃఖాన్ని మోస్తూ అలసిపోయాను అంటారు ఎంతగా అంటే అలసట గురించి మాట్లాడలేనంతగా అంటారు. అవును దుఃఖానికి బరువెక్కువే, అలసటెక్కువే, సంతోషంలా తేలిక కాదుగా గాలిలో తేలిపోవడానికి. వయసు వెనక్కి నడుస్తుంది, కళ్లకింద నలుపు చారలు మెరుస్తాయి అంటారు. నిజమే మనిషి సాధించుకున్న ఇన్ని విజయాలకు దిష్టి తగలకుండా నైనా ముఖం మీద ఎక్కడో ఒకచోట నలుపు చారలు సంపాదించుకోవల్సిందే.
ఓ చోట ఒక అక్షరం నాలుగు కవితలవ్వాలి, ఒక్కడు నలుగురవ్వాలి అంటారు. నలుగురు ఒక్కొక్కరిగా విడిగా ఉండాలని ఆశించే ఈ కాలంలో వారి సకారత్మక భావనకు సలాం చేయాల్సిందే. ఒక్కొక్కరికి ఒక్కో అనుభవం ఉండొచ్చు లేదా కొంతమంది అనుభవాలు సమిష్టిగా ఉండొచ్చు, ఏదేమైనా అనుభవం ఒకటే అయిన అనుభూతులు ఖచ్చితంగా వేరుగానే ఉంటాయి. వారి అనుభూతి ప్రకారం చూస్తే ‘నీళ్ళు’ అనే కవితలో నేను నీటిని ప్రేమిస్తాను, ప్రేమతో పూజిస్తాను అంటారు. కవి దేన్ని ప్రేమించరని? నీరు, నిప్పు, గాలి ఇలా పంచ భూతాలను ప్రేమించడమే కాదు, ప్రేమతో పూజిస్తాను అంటారు అంటే వాటిలో దైవాన్ని చూస్తున్నారు ఆయన.
వాతావరణం పేరుతో ఉన్న ఓ కవితలో ఆహ్లాద వాతావరణంతో ఆరంభించి రివ్వున గాలి వీయించారు, ముసి ముసిగా నవ్వించారు తీరా చూద్దును కదా మెల్లమెల్లగా ఒకానొక భయానక వాతావరణంలోకి తీసుకెళ్ళి, హారర్ సినిమాను తలపించి తాను మాత్రం బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయిన బుద్దుడిలా తనకు మాత్రం శ్రమ లేకుండా నేల మీదనే జ్ఞానోదయమైంది అని కింది పంక్తుల ద్వారా ‘తలకింద చేతులు పెట్టుకుని నేలమీద పడుకున్న నాలో ఏదో తళుక్కున మెరిసింది వాతావరణానికి నాకు మాట కలిసింది’ అని మనకు అర్థం చేయిస్తారు. వాతావరణానికి తనకు దోస్తీ కుదిరినట్టు ఒప్పుకుంటారు. పాఠకుల్ని పక్కన పెట్టి మరీ కవి సంధి కుదుర్చుకున్నట్లు కనిపిస్తోంది. అయినా ప్రకృతికి - కవికి పంచాయితీ చెప్పేవాడు పుట్టాడా ఈ లోకంలో?
బతుకు భయం కవితా పంక్తులలో ఇన్నేళ్లుగా బతుకే అర్థం కాలేదు/ ఎప్పుడో ఒక్కసారే వచ్చే /చావెట్లా అర్థమవుతుంది. అంటూ కవి తన నిద్రలోని కలవరింతలను కవితగా మలిచారా! అడగాలి మరి, ఏ ప్రవృత్తితో ప్రపంచాన్ని చూస్తే అది దానికి అనుగుణంగానే కనిపిస్తుంది. ఈ కవితలో జీవితానికి గమ్యం లేనట్టుగా, అగమ్యగోచరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. మెల్లమెల్లగా కవికి ఈ లోకం ద్వంద్వ ప్రమాణాలు అర్థం అవుతున్నట్టున్నాయా? ఈ కవితలో తాను అనుభవిస్తున్న భావాలు, భావనా శక్తితో నిండి భయంతో బతుకంతా వ్యాపించాయా? ఇంతకీ భయం వల్ల చావు ఇబ్బంది పెడుతుందా, చావు వల్ల భయం వేస్తుందా...కవి అన్నట్టు చావు బతుకు ఏది అర్థం కాదా! బతుకు చావు రెండూ వేరైతేగా అర్థం కావడానికి, మరి రెండు ఒకటేనా ఏమో మరేమో!
తనదైన ప్రపంచంలోకి వెళ్లేంతలా?
సాహిత్య రచనకు ఎందరో తమ వంతుగా తమతమ దారుల్లో సేవలందిస్తూ ఉన్నారు. కొంతమంది రచనలను పరిశీలిస్తే ప్రత్యేకించి కొన్ని అంశాలను ఉద్దేశించి ఉన్నట్టనిపిస్తాయి. ఉదాహరణకి సంతోషం, విషాదం, రౌద్రం, ఆవేశం, అక్రోషం, బంధం, బాధ ఇలా సాగిపోతూ ఉంటాయి. ఆనంద్ గారి సొంత ఊరు కవిత్వాన్ని తరచి చూస్తే అపుడే నడుస్తారు, అపుడే ఏడుస్తారు, వెనువెంటనే నవ్వుతారు. ఎంచక్కా ప్రకృతి ఒడిలో నిద్రిస్తారు. ఉదయమే నిద్రలేచి సూర్యచంద్రులతో చెలిమి చేస్తారు. ఒకటేమిటి ఎన్ని ఉంటే అన్ని రసాలు ఒలికించారు.
‘ఆగమాగం బిజీ బిజీ’ అంటూ ఇస్టాగ్రం, ట్విట్టర్ అంటూ అధునికుడైపోయారు. ‘సొంత ఊరు’లో మంచి మమతలున్న పౌరుడయ్యారు. తలుపురెక్కలో దినచర్య చూపించారు. ‘ప్రద్యుమ్న’లో మనుమడిలో పరకాయ ప్రవేశం చేశారు. ‘నది సాక్ష్యం చెప్పదు’ అంటూ జీవన గమనాన్ని అవలోకించారు. ‘నువ్వు - నేను’ ద్వారా స్నేహం ప్రేమను మించిన బంధం ఏదైనా ఉందా అంటూ మలి సంధ్యలో ఆలోచనల్లో పడ్డారు. ‘మనసుంటేనే మార్గముంటది’ అని జీవన సూత్రాలు నేర్పారు. ‘నాలుగు అడుగులు’ వేస్తూ వైరాగ్యంలోకి వెళ్ళారు. ‘ఇద్దరు’లో ఎంతో అందమైన ఉపమానాలతో ఇద్దరినే కాదు ఎందరినో జతపరిచారు.
ఇలా ఎనభై మూడు కవితల సమాహారాన్ని చదివిన సామాన్య పాఠకుడికి సైతం తనదైన ఓ ప్రపంచంలోకి వెళ్లిపోవాలని అనిపించే విధంగా, మలయమారుతంలా పాఠకుల మదిని కదిలించారు. 164 పేజీలతో, 83 కవితలతో గ్రామసీమలో గల ఇంటిముఖ చిత్రం కలిగి పాఠకుల పాదాలకు సొంత ఊరు బాట చూపే విధంగా ఉంది. కాళ్ళు కదలకపోయినా మనసు మాత్రం మన ఊరి జ్ఞాపకాలలోకి మన అనుమతి లేకుండానే పోయే విధంగా ఉంది అందమైన పుస్తకం. చివరగా ఒక్కమాట మనం సొంతఊరిలో ఉండలేక పోయినా, మన పుస్తకాల సొరుగులో ఆనంద్ రాసిన 'సొంత ఊరు' పుస్తకం చేర్చుకుంటే అలసిన సొలసిన మనసుకు అది అప్పుడప్పుడు ఆలంబన అవుతుంది. ఇంతటి ప్రతిభాశాలైన వారాల ఆనంద్‌కు ప్రతిష్టాత్మకమైన 'తెలంగాణ సాహిత్య పరిషత్' వారు నేడు సాయంత్రం 5 గంటలకు 'వరిష్ట’ పురస్కారం అందజేయనున్నారు.
కల్వకుంట్ల శ్రీలత రావు
9491480386