నెత్తురోడుతున్న రహదారులు!

Bloody roads!

Update: 2024-02-25 01:15 GMT

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘ఉజ్వల భవిష్యత్తు కలిగిన 37 ఏళ్ల లాస్య నందిత అర్ధంతరంగా తనువు చాలించడం బాధగా ఉంది. రోడ్డు సేఫ్టీ నిబంధనలు ఎలా ఉన్నప్పటికీ తప్పనిసరిగా మనం పాటించాలి. సిటీలో కూడా సీటు బెల్ట్ పెట్టుకోవడం. రద్దీగా ఉన్న సమయంలోనూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి.’ అని వాహనదారులను కోరుతూ ఆయన చేసిన ట్వీట్ పరిస్థితికి అద్దం పడుతోంది.

హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు కొంతకాలంగా రోడ్డు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. మితిమీరిన వేగం, మద్యం తాగి వాహనం నడపడం, నిద్రమత్తు, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం ప్రధాన కారణాలు. ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎంతోమంది ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ప్రమాదాల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇందుకు భద్రత నిబంధనలు పాటించకపోవడమే ఇవి పెరగడానికి కారణం అంటున్నారు నిపుణులు.

సీట్ బెల్టు పై చిన్నచూపు

కారులో ప్రయాణించే వారందరూ సీట్ బెల్ట్‌ పెట్టుకోవాలన్నది నిబంధన. అయితే ఈ నిబంధనను చాలా మంది పట్టించుకోవడం లేదు. సీట్ బెల్ట్‌ పెట్టుకోవడాన్ని చాలా మంది, చిన్నచూపుగా భావిస్తున్నారు. సీట్ బెల్ట్‌ పెట్టుకుంటే, కారు యాక్సిడెంట్‌కు గురైనా, ఎయిర్ బ్యాగ్స్ తెరచుకుంటాయి. ప్రాణాలు కోల్పోవడం జరగదు. గాయాలతో బయటపడతారు. ఇటీవలికాలంలో సిటీ శివార్లలో బర్త్‌ డే పార్టీలు జోరందుకున్నాయి. రాత్రంతా మద్యం తాగి...ఆ నిషా దిగకముందే తెల్లవారుజామున కారు వేసుకుని మిత్ర బృందం బయల్దేరుతుంది. మద్యం తాగి వాహనం నడపడం అంటే ప్రమాదాన్ని కోరి తెచ్చుకోవడమే.

ఈ కాలంలోనే ఎక్కువ ప్రమాదాలు..

నిద్ర లేకపోవడం కూడా రోడ్డు ప్రమాదాలకు మరో కారణం అంటున్నారు నిపుణులు. సహజంగా చాలామంది రాత్రి అంతా వాహనాలను నడుపుతూనే ఉంటారు. కొన్ని నిమిషాలపాటు కూడా నిద్రపోయారు. దీంతో తెల్లవారుజామున వాహనం నడిపేవారిపై నిద్రలేమి ప్రభావం పడుతుంది. చివరకు ప్రమాదం జరుగుతుంది. ఈ నేపథ్యంలో లాంగ్ డ్రైవ్‌లో వెళ్లేవారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని గంటల తర్వాత తప్పనిసరిగా మరో వ్యక్తి డ్రైవింగ్ సీటులో కూర్చోవాలని సలహా ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చలికాలంలో జరుగుతున్నాయి. చలికాలంలో రోడ్లపై మంచు ఎక్కువగా పరచుకోవడంతో.. కొన్ని మీటర్ల అవతల ఏముందో కూడా కారు నడిపే వారికి కనపడదు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి ఇదొక కారణం అంటున్నారు నిపుణులు. నిబంధనలు కేవలం బైక్‌లు, కార్లు నడిపేవారికే అనే దురభిప్రాయం చాలామందికి ఉంది.

నిర్మాణంలో అనేక లోపాలున్నాయని..

ఆటోలు, కార్లు, తుఫాన్ లాంటి వాహనాలలో ప‌రిమితికి మించి ప్రయాణికుల‌ను డ్రైవ‌ర్లు ఎక్కిస్తుంటారు. ఇది అందరూ ప్రతిరోజూ చూస్తున్న తతంగమే. కొన్ని సంద‌ర్భాల్లో డ్రైవ‌ర్‌కే చోటు లేనంత‌గా వాహ‌నాలు కిక్కిరిసి పోతుంటాయి. అయితే ఇలా ప్రయాణికుల‌ను ఎక్కించ‌డం ప్ర‌మాదక‌రం. ఇలాంటి సంద‌ర్భాల్లో రోడ్డు ప్ర‌మాదాలు జ‌రిగేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. మ‌న దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న జాతీయ, రాష్ట్ర ప్ర‌ధాన ర‌హ‌దారుల నిర్మాణంలో అనేక లోపాలున్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. క్రాసింగ్‌లు స‌రిగ్గా క‌నిపించ‌క‌పోవ‌డం, సిగ్న‌ల్స్ లేక‌పోవ‌డం, సూచిక బోర్డులు, హెచ్చ‌రిక చిహ్నాలు, డివైడర్లు లేకపోవడం వంటి అనేక కారణాలవల్ల కూడా రోడ్డు ప్ర‌మాదాలు అధికంగా జ‌రుగుతున్నాయ‌ని ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. క‌నుక ఈ దిశ‌గా కూడా సంబంధిత అధికారులు, ప్ర‌భుత్వాలు ఆలోచించాలి.

జిగ్‌ జాగ్ డ్రైవింగ్ కారణంగా..

ఎక్కువగా సంపన్న కుటుంబాలకు చెందిన పిల్లలు అధునాతన బైక్‌లతో ఓఆర్‌ఆర్‌పై విన్యాసాలు చేసే ట్రెండ్ ఇటీవలి కాలంలో పెరిగింది. ఓఆర్‌ఆర్ పై జిగ్‌ జాగ్ డ్రైవింగ్ చేయడం చాలా మంది కుర్రాళ్లకు ఫ్యాషన్ గా మారింది. జిగ్‌ జాగ్ డ్రైవింగ్...చాలా డేంజరస్ అని ట్రాఫిక్ రంగ నిపుణులు గతంలో చాలాసార్లు హెచ్చరించారు. అయినప్పటికీ నలుగురిలో గొప్ప కోసం లైన్ల మధ్య జిగ్‌ జాగ్ డ్రైవింగ్‌కు కుర్రకారు జై కొడుతున్నారు. చివరకు ప్రమాదపు అంచుల వరకూ వెళుతున్నారు. మనదేశంలో ప్రాణాంతక వ్యాధులతో చనిపోతున్నవారికంటే, రోడ్డు ప్రమాదాల ఫలితంగా ఉసురు కోల్పోతున్నవారే ఎక్కువగా ఉంటున్నారు. దీనికి ప్రధాన కారణం భద్రతా చర్యలను ప్రజలు పట్టించుకోకపోవడమే. ఇంటి గడప దాటి బయటి ప్రపంచంలోకి అడుగు పెట్టిన ప్రతి వ్యక్తి, రోడ్ సేఫ్టీ రూల్స్ పాటించాలంటున్నారు నిపుణులు. ఏమైనా రోడ్డు ప్రమాదాల నివారణ ఒక్కరి బాధ్యత కాదు. అది అందరి బాధ్యత.

-ఎస్‌. అబ్దుల్ ఖాలిక్,

సీనియర్ జర్నలిస్ట్

63001 74320

Tags:    

Similar News