బీజేపీ..నాటి నుంచి నేటిదాకా
తెలంగాణ సమస్యల మీద గొంతెత్తిన మొదటి పార్టీ బీజేపీ. తొలి నుంచీ బీజేపీ తెలంగాణ పట్ల పూర్తి స్పష్టంగా ఉంది. సుమారు 500 సంవత్సరాల ముస్లిం
తెలంగాణ సమస్యల మీద గొంతెత్తిన మొదటి పార్టీ బీజేపీ. తొలి నుంచీ బీజేపీ తెలంగాణ పట్ల పూర్తి స్పష్టంగా ఉంది. సుమారు 500 సంవత్సరాల ముస్లిం పాలనలో తెలంగాణ అన్ని రంగాలలో వెనకబడింది. ఆంధ్ర, తెలంగాణను భాష ఆధారంగా కలపాలనుకున్నప్పుడు సమతుల్యం చేయడానికి తీసుకున్న నిర్ణయాలు, చేసుకున్న ఒప్పందాల అమలు విషయంలో బీజేపీ ఏనాడూ రాజీ పడలేదు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను ఏనాడూ తక్కువ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రతీసారి తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసుకుంటూనే వచ్చింది.
1971లో మర్రి చెన్నారెడ్డి స్థాపించిన తెలంగాణ ప్రజాసమితి (టీపీఎస్)ని తెలంగాణ ప్రజలు ఆదరించారు. 14 ఎంపీ స్థానాలుంటే 11 స్థానాలలో గెలిపించారు. చివరకు చెన్నారెడ్డి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. తరువాత ముఖ్యమంత్రి అయ్యారు. 1975 ఎమర్జెన్సీ వలన తెలంగాణ అంశం కొంత మరుగునపడిపోయింది. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకోసం తెలంగాణను వాడుకుంది. ఏనాడూ ప్రజల ఆకాంక్షల కోసం పనిచేయలేదు. 2014లో కూడా అనివార్య పరిస్థితులలో రాజకీయ లబ్ధి కోసం మాత్రమే తెలంగాణ ఏర్పాటుకు సహకరించింది.
ఆనాటి నుంచే నేతల స్పందన
బీజేపీ శాసనసభ్యులు ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తూనే ఉన్నారు. 1996లో కేంద్రంలో ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం తెలంగాణను సశ్యశ్యామలం చేయడం కోసం ప్రొఫెసర్ ఎస్‌వీ శేషగిరిరావు అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేసి, మార్గదర్శకాలు తయారు చేసింది. తుమ్మిడిహెట్టి నుంచి పోలవరం వరకు తెలంగాణలో కట్టగలిగిన ప్రాజెక్టుల విషయంలో సెమినార్లు నిర్వహించింది. గోదావరి పరీవాహక ప్రాంతంలో పర్యటించి తెలంగాణ జల అవసరాల కోసం స్పష్టమైన విధానాన్ని రూపొందించింది. ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తే రెండు రాష్ట్రాలు సమగ్రంగా అభివృద్ధి చెందుతాయని 1997 కాకినాడలో జరిగిన కార్యవర్గ సమావేశంలో తీర్మానించింది.
1998-2004లో జరిగిన ఎన్నికలలో టీడీపీతో పొత్తు కారణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయలేకపోయింది. కానీ, తెలంగాణ సమస్యల మీద రాజీ పడకుండా 2002లో అప్పటి కేంద్రమంత్రి కుమార మంగళం అధ్యక్షతన గోదావరి నదీ జలాల వినియోగంపై రెండు రోజుల సమావేశాన్ని నిర్వహించి, ముసాయిదా పత్రాన్ని తయారు చేసింది. మాజీ మంత్రి సురేశ్‌ప్రభు నాయకత్వంలో నదుల అనుసంధానం కోసం అటల్ బిహారి వాజ్‌పాయి కమిటీ సమావేశం నిర్వహించి తెలంగాణ ప్రయోజనాలను భంగం కలగకుండా విధాన పత్రాన్ని తయారు చేసింది. పాలమూరు-నల్లగొండ జిల్లాలను సశ్యశ్యామలం చేసే లక్ష్యంలో చిలకం రాంచంద్రారెడ్డి, అలంపూర్ శాసనసభ్యుడు రావుల రవీంద్రనాథ్ రెడ్డి పాదయాత్ర కూడా చేశారు.
పోరుయాత్ర సాగించి
పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలనే డిమాండ్‌తో 19 జనవరి 2012న అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిగారి ఆధ్వర్యంలో 'తెలంగాణ పోరుయాత్ర' ప్రారంభించారు. యాత్ర 22 రోజుల పాటు కొనసాగి ఫిబ్రవరి 9న ముగిసింది. చెన్నారెడ్డి, కాంగ్రెస్ మాయలో పడి తెలంగాణ తొలి ఉద్యమకారులు ఓడిపోయారు. అందుకే, 'తెలంగాణ పోరుయాత్ర' చేశారు. రాష్ట్ర సాధనను ఎన్నికల నినాదంగా మార్చి తెలంగాణ యువకుల బలిదానాలకు కారణమైన కాంగ్రెస్, టీడీపీ బండారాన్ని బయటపెట్టేందుకు, రాష్ట్ర సాధన బీజేపీతోనే సాధ్యమని చాటి చెప్పేందుకు యాత్రను ఉధృతం చేశారు. యాత్రలో భాగంగా హైదరాబాద్ నిజాం కళాశాలలో నిర్వహించిన భారీ బహిరంగసభలో కాంగ్రెస్ రాష్ట్ర డిమాండ్ ను నెరవేర్చకపోతే బీజేపీ ఆ కలను సాకారం చేస్తుందని హామీ ఇచ్చారు.
అంచనాలు తారుమారు
కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణి, టీడీపీ రెండు కళ్ల సిద్ధాంతం యువకుల మనోభావాల మీద తీవ్ర ప్రభావం చూపాయి. తెలంగాణ రాదనే భావనతో బలిపీఠమెక్కారు. అలాంటి సమయంలో 'బలిదానాలతో తెలంగాణ రాదు. ఉద్యమాలతో, పోరాటాలతోనే వస్తుంది. పార్లమెంటరీ విధానం ద్వారానే అది సాధ్యమవుతుందని' బీజేపీ వారిలో విశ్వాసం కలిగించింది. సుష్మాస్వరాజ్ చేత అనేక ర్యాలీలు నిర్వహించి 166 సభ్యులచే చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలంగా వ్యవహరించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు మద్దతు ఇచ్చింది.
రాష్ట్రం సాధించుకున్న తర్వాత ప్రజలు తమ అంచనాలు తారుమారు కావడంతో ఇప్పటికీ ద్రోహానికి గురవుతూనే ఉన్నారు. తెలంగాణ పేరుతో రాజకీయ లబ్ధి పొందినవారే ప్రజలను మోసం చేయడంలో ముందున్నారు. ఉపాధి అవకాశాలతో యువత జీవనోపాధి పొంది సంతోషంగా ఉండే తెలంగాణను బీజేపీ కోరుకుంది. అయితే, టీఆర్‌ఎస్ గత ఎనిమిదేళ్లలో ప్రజల జీవితాలను, జీవనోపాధిని పూర్తిగా నాశనం చేసింది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేస్తొంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 2023లో బీజేపీ అధికారంలోకి వచ్చి అభివృద్ధి చెందిన తెలంగాణను అందిస్తుందనడంలో సందేహమే లేదు.
బింగి కరుణాకర్
బీజేపీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి
99498 42307