దళిత బంధు తో పాటు మహిళా బంధు, బీసీ బంధు, గిరిజన బంధు అన్నీ అమలు పరిచేలా ఈ ప్రభుత్వం మెడలు వంచి నేలకు దించడమే తన కర్తవ్యంగా బీజేపీ నాయక, కార్యకర్తల శ్రేణులు పని చేయాలి. ఉద్యోగులను 317 జీఓతో ఉసూరనిపించింది. జంటనగరాలకు తాగునీరు అందించే జంట జలాశయాల ఉనికికి ప్రమాదం తెచ్చే జీవో 111 ను ఎత్తివేసే బహిరంగ ప్రకటన సీఎం అసెంబ్లీ వేదికగా చేయడం ఒక దురదృష్టకర పరిణామం. నియంతృత్వ ధోరణి, అవినీతి, ఆశ్రితపక్షపాతంతో తెలంగాణను కుదేలు చేసిన కేసీఆర్ పాలన పట్ల ప్రజలు విసుగొంది ఉన్నారు. సగటు పౌరుల ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చడమే ఇపుడు బీజేపీ ముందున్న కర్తవ్యం. 'ప్రజా సంగ్రామ యాత్ర'ను విజయవంతం చేయాలని మనవి.
ఎన్నో పోరాటాలు, ప్రాణ త్యాగాలు, రక్తతర్పణల తర్వాత సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, ఆయన కుటుంబ కబంధ హస్తాలలో నలుగుతున్నది. కొత్త కాంతుల కోసం ఎదురుచూస్తున్నది. ఇప్పటికే తెలంగాణ సమాజం 'ఏలిన వారికి అధికారం తలకెక్కి, పాలన పడకెక్కి, జనం ఆశలన్ని అణగారి, భవిష్యత్తు భయం గొలిపే' విధంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. సగటు జనుల గోడు పాలకులు పట్టించుకొని దయనీయ స్థితి ఏర్పడింది. సబ్బండ వర్గాల వారు వారి జీవితాలలో మార్పును కోరుకుంటున్నారు. జనరంజక పాలనను అభిలషిస్తున్నారు. వారి ఆశలను, ఆకాంక్షలను పొత్తిళ్లలోకి తీసుకొని 'ప్రజా సంగ్రామ యాత్ర' పేరుతో ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకునేందుకు సిద్దమైంది బీజేపీ.
ఇప్పటికే తొలి విడత దిగ్విజయంగా పూర్తి చేసుకున్న యాత్ర మలి విడతగా ఈ నెల 14న అలంపూర్ జోగులాంబ ఆలయం వద్ద మొదలు కానున్నది. ప్రజల కష్టాలను తెలుసుకోవడం, ఉద్యమ లక్ష్యం ఏ మేరకు నెరవేరింది. సర్కారు చెప్పిన పథకాల అమలు స్థితి ఎలా ఉంది? తదితర అంశాలను పరిశీలించడం, ఈ ప్రభుత్వం ఇంకెంతో కాలం ఉండదని సర్వ జనులకు విశ్వాసం కలిగిస్తూ భవిష్యత్తు పట్ల భరోసా కల్పించడం ఈ యాత్ర ప్రాథమిక ఉద్దేశం. నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన తెలంగాణ సమాజంలో ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసింది. కానీ, ఆ మూడు అంశాల అమలులోనూ నేడు నీరుగారిన దుస్థితి.
నియంతృత్వ పాలన రుచి మరిగి
తెలంగాణ రాష్ట్ర సమితి దుష్ట పాలనను ఎండగడుతూ, ప్రజల దుస్థితిని అర్థం చేసుకుంటూ తొలి విడత యాత్ర 438 కిలోమీటర్లు, 36 రోజుల పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో కొనసాగింది. ఆగస్టు 24న హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి నుంచి మొదలై, హుస్నాబాద్‌లో అక్టోబర్ 2 గాంధీ జయంతిన ముగిసింది. ఈ యాత్రలో కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ స్థాయి నాయకులు, సామాజిక పెద్దలు, విద్యావేత్తలు, మేధావులు, పాత్రికేయ ప్రముఖులు భాగం పంచుకున్నారు.
రాష్ట్ర పాలనలో నియంతృత్వ ధోరణి. ముఖ్యమంత్రి ఒకరే అన్నీ సర్వం తానై నడిపిస్తారు. ఎక్కడ ప్రజాభిప్రాయానికి చోటు లేదు. మంత్రులకు స్వేచ్ఛ లేదు. శాసనసభ్యులకు దర్శనం కూడా ఉండదు. ప్రజా ప్రతినిధులు తమ అభిప్రాయాలను అధినేత వద్ద వెల్లడించేదెక్కడ? ప్రజల గోడు వినేదెవరు? సమస్యల మీద ఎవరైనా ప్రశ్నిస్తే 'నిలువునా పాతరేస్తామని' మీడియా సహా అందరినీ హెచ్చరించడం దుర్మార్గం. నియంతృత్వ పాలనకు రుచిమరిగి, రాజ్యాంగమే మార్చివేయాలన్న ముఖ్యమంత్రి పాలనలో రాజ్యాంగ స్ఫూర్తి 'నేతిబీరలో నెయ్యి' వంటిదే.
ఇచ్చిన మాట తప్పుతూ
ఉద్యోగాలు, ధాన్యం కొనుగోలు, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు సహా హమీలు ఇచ్చి మాట తప్పడం, అలవోకగా అబద్దాలాడటం ప్రభుత్వానికి రివాజయింది. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే విషయంలో ఏ దశలోనూ చిత్తశుద్ది చూపలేదు. లక్షల ఖాళీలు ఏర్పడుతున్నా, లక్షలాది మంది నిరుద్యోగులు నిత్యం అలమటిస్తున్నా, ఆశ చచ్చి ఎందరో ఆత్మహత్యకు పాల్పడుతున్నా స్పందించిన పాపాన పోలేదు. కానీ, ఎన్నికల ముంగిటిలో వేలాది ఉద్యోగాలంటూ జాతర ప్రకటించారు. 'ప్రకటన ఇవ్వండి, ప్రక్రియ మొదలెట్టండి, ఇస్తే ఇస్తాం. లేకుంటే లేదు, ఈ లోపున కేసులు, ఎన్నికలు వస్తాయి, మనకు ఆ భారముండదు' అని ఎన్నికల వ్యూహకర్త చెవిలో ఊదితే చివరకు కదిలింది ఈ కరుకు సర్కార్.
ఏడేండ్ల ఉద్యోగాలు ఒక్కసారిగా ప్రకటిస్తే, ఎన్నో వయసు తేడాలు, జ్ఞాన వ్యత్యాసాలు, పరిసరాల వైవిధ్యాలు, యువత సమ ఉజ్జీలుగా పోటీపడలేని పరిస్థితి కల్పించారు. ఒక్క రైతుబంధుతోనే మొత్తం వ్యవసాయాన్ని గట్టెక్కిస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్న సర్కారు మరి వరి విషయంలో నిలకడలేని మాటలు చెబుతూ రైతాంగాన్ని నిలువునా మోసగిస్తున్నది. పాత ప్రాజెక్టులకు పేరు మార్చి, వ్యయం పెంచి తమ ప్రభుత్వం చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు.
హామీలు నీరుగార్చి
రాజకీయ లబ్ధి కోసం ప్రతి చిన్నదానికి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం మామూలయింది. కేంద్ర ప్రభుత్వ పథకాల పేరు మార్చి, నిధులు మళ్లించి తమ ఖాతాలో వేసుకోవడం రివాజయింది. ఆరోగ్యశ్రీ గొప్పదంటూ ఏళ్ల తరబడి జాప్యం చేసి చివరకు ఆయుష్మాన్ భారత్‌లో చేరిన రాష్ట్ర ప్రభుత్వం జాప్యానికి క్షమాపణలు చెప్పాలి. దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి, బీసీ-ఎస్‌సీ-ఎస్‌టీ సబ్‌ప్లాన్ వంటివి అటకెక్కాయి. నిధులు ఇతర ఓటు బ్యాంకు రాజకీయాలకు మళ్లాయి. రైతు రుణమాఫీ కొండెక్కింది. నిరుద్యోగ భృతి ప్రసవానికి ముందే అసువులు బాసింది. ఇప్పుడు పూటకో 'బంధు' అంటూ ఊదరగొడుతున్నారు.
దళిత బంధు ని నెమ్మదిగా నీరుగారుస్తున్నారు. దళిత బంధు తో పాటు మహిళా బంధు, బీసీ బంధు, గిరిజన బంధు అన్నీ అమలు పరిచేలా ఈ ప్రభుత్వం మెడలు వంచి నేలకు దించడమే తన కర్తవ్యంగా బీజేపీ నాయక, కార్యకర్తల శ్రేణులు పని చేయాలి. ఉద్యోగులను 317 జీఓతో ఉసూరనిపించింది. జంటనగరాలకు తాగునీరు అందించే జంట జలాశయాల ఉనికికి ప్రమాదం తెచ్చే జీవో 111 ను ఎత్తివేసే బహిరంగ ప్రకటన సీఎం అసెంబ్లీ వేదికగా చేయడం ఒక దురదృష్టకర పరిణామం. నియంతృత్వ ధోరణి, అవినీతి, ఆశ్రితపక్షపాతంతో తెలంగాణను కుదేలు చేసిన కేసీఆర్ పాలన పట్ల ప్రజలు విసుగొంది ఉన్నారు. సగటు పౌరుల ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చడమే ఇపుడు బీజేపీ ముందున్న కర్తవ్యం. 'ప్రజా సంగ్రామ యాత్ర'ను విజయవంతం చేయాలని మనవి.
డా. గంగిడి మనోహర్‌రెడ్డి
ఉపాధ్యక్షుడు, బీజేపీ తెలంగాణ శాఖ
ప్రజాసంగ్రామ యాత్ర ప్రముఖ్
98492 01362