సెఫాలజిస్టులను నమ్మితే అమాయకత్వమే..!

ఎన్నికల ముందు మచ్చుకు కొంత మంది ఓటర్లతో మాట్లాడి, దాని ఆధారంగా ముందే ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పే శాస్త్రాన్ని ‘సెఫాలజి’ అంటారు

Update: 2024-06-07 01:00 GMT

ఎన్నికల ముందు మచ్చుకు కొంత మంది ఓటర్లతో మాట్లాడి, దాని ఆధారంగా ముందే ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పే శాస్త్రాన్ని ‘సెఫాలజి’ అంటారు. ఈ ఎన్నికల్లో సెఫాలజిస్టులు ప్రకటించిన ఫలితాలు అంచనాలకి విరుద్ధంగా వచ్చాయి. యాక్సిస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా తాము ప్రకటించిన అంచనాలు వాస్తవ ఫలితాలకు దూరంగా ఉండటంతో బహిరంగంగానే ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు. 'ప్రజల నాడి' నిజానికి ఎవరికీ తెలియదు, తెలియరాదు. అది ఒక చాలా సంక్లిష్ట విషయం. కొంత మందితో మచ్చుకి మాట్లాడి దాని ఆధారంగా ఒక అంచనాకు రావచ్చు. కానీ అదే నిజం అవుతుందని భావించడం తార్కికం కాదు, సహేతుకం కాదు. ఎవరైనా అలా నిజంగా నమ్మితే అది వారి అమాయకత్వం అనుకోక తప్పదు.

ఎన్నికల సమయంలో ఇంచుమించు అన్ని రాజకీయ పక్షాలు తాము భారీ ఓట్లతో, సీట్లతో గెలుస్తామని చెబుతాయి. తమకు ప్రజల నాడి తెలుసనీ, దాని ఆధారంగా ఈ మాట చెబుతున్నామని సమర్థించుకుంటాయి. రాజకీయ పక్షాలు అలా చెప్పడానికి కారణం, బహుశా నాయకుల చుట్టూ ఉండే వందిమాగధులు అయి ఉండవచ్చు.

అంచనాలు నిజమౌతాయా?

రాజరిక వ్యవస్థ భౌతికంగా పోయినా సరే, మానసికంగా ఇది ఇంకా మన దేశంలో అంతరించిపోలేదు. రాజులు పోయి రాజకీయ నేతలు వచ్చారు. ఈ నాయకుల చుట్టూ శ్రేయోభిలాషులు, బంధువులు, హితులుగా కనిపించేవారు కొంతమంది వందిమాగధులుగా, మారి నేతలను ఆకాశానికి ఎత్తేస్తుంటారు. ఓటమికి ఇది ఒక కారణం కావచ్చు.

తప్పక గెలుస్తామని చెప్పడానికి రెండో కారణం... అలా చెప్తే తటస్థ ఓటర్లు తమ వైపు మొగ్గు చూపవచ్చననే నమ్మకం కావచ్చు. కానీ అసలు ఫలితాలు మాత్రం పరిస్థితులను అర్థం చేసుకున్న సామాన్య జనులకు సైతం తెలియాలి. ‘ప్రజల నాడి’ నిజానికి ఎవరికీ తెలియదు, తెలియరాదు. అది ఒక చాలా సంక్లిష్ట విషయం. కొంత మందితో మచ్చుకి మాట్లాడి దాని ఆధారంగా ఒక అంచనాకు రావచ్చును. కానీ అదే నిజం అవుతుందని భావించడం తార్కికం కాదు, సహేతుకం కాదు. ఎవరైనా అలా నిజంగా నమ్మితే అది వారి అమాయకత్వం అనుకోక తప్పదు.

సంభావ్యత అంటే

సెఫాలజి అనేది సాంఖ్యక శాస్త్రం, సంభావ్యత అన్న భావనలు మీద ఆధార పడుతుంది. సంభావ్యత అనేది చాలా లోతైన, గంభీరమైన విషయం. ఈ విషయంలోనే అసలు గందరగోళం ఉంది. సంభావ్యతని కొంచెం పైపైన మాత్రమే నేను వివరిస్తాను. సంభావ్యత అర్థం తెలుసుకోవడానికి ఉపకరించేటట్టు. పది నాణేలను ఒకేసారి పైకి విసిరామనుకోండి. అప్పుడు తలలు (హెడ్స్) పైకి 1 నుంచి 10 వరకు రావచ్చు కదా! ఎన్ని తలలు పైకి వచ్చాయో రాసుకోండి. ఇలా ఈ ప్రయోగం (10 నాణేలను ఒకేసారి పైకి విసిరడం, తలల లెక్క రాసుకోవడం) చాలా సార్లు చేసామనుకోండి. ఉదాహరణకి వెయ్యి సార్లు అనుకుందాం. సరిగ్గా నాలుగు తలలు ఎన్ని సార్లు పైకి వచ్చాయో, శాతం పరంగా చెబితే దాన్ని, 4 తలలు పైకి వచ్చే ఘటన తాలూకు సంభావ్యత అంటాము. దీనిలో కొంత అనిశ్చితి దాగి ఉందని మనం మరిచి పోగూడదు.

గణాంకాల పరిమితి

'అసత్యాలు, హేయమైన అసత్యాలు, గణాంకాలు' అనేది బలహీనమైన వాదనలు, అనువర్తిత గణాంకాలపై విమర్శలను బలపరిచేందుకు వాడే పదబంధం. 'అమెరికన్ సాహిత్య పిత' అని పేర్కొంటున్న మార్క్ ట్వైన్, గణాంకాలకి వ్యతిరేకంగా పై విధంగా వ్యాఖ్యానించారు అని చెబుతారు. ఆయన గణితజ్ఞుడు కాదు, శాస్త్రవేత్త కాదు, అయినా సరే, విజ్ఞుడు కాబట్టి గణాంకాల ప్రవాహంలో కొట్టుకుపోలేదు. గణాంకాల పరిమితులను, అవధులను గుర్తించగలిగి, అలా చమత్కారంగా ఛలోక్తి విసిరారు.

ప్రొ. సీతారామరాజు సనపల

డీఆర్‌డీఓ పూర్వ శాస్త్రవేత్త

72595 20872

Tags:    

Similar News