మన ఇంటికి కొత్త చుట్టాలొస్తున్నారు... ఏంటి అర్థం కాలేదా.. నమస్తే కాకా.. నమస్తే తమ్ముడూ.. బాగున్నావా చెల్లెమ్మ అంటూ పొద్దుగాల పొద్దుగాల మన ఇంటికి వచ్చి మర్యాదలు చాలా చేస్తారు.. ఆప్యాయంగా పక్కన కూర్చోని ముచ్చట్లు చెబుతారు.. మన ఆరోగ్యం గురించి మన బాగోగులు గురించి అడిగి లేనిపోని జాలి చూపిస్తారు.. మనకు దోశలు వేస్తారు.. బట్టలు ఇస్త్రీ చేస్తారు... అబ్బో వాళ్ల అవసరం కోసం చాలానే చేస్తారు.. కానీ, ఓ సారి వారి అవసరం తీరాకా మన కంటికి కనిపిస్తే ఒట్టు.. ఇలా ఒక పార్టీ కాకపోతే ఇంకో పార్టీ అభ్యర్థులు వస్తూ పోతూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరు వస్తూ మస్తు మర్యాదలతో పాటు.. మస్తు హామీలు ఇచ్చి మనల్ని మచ్చిక చేసుకుంటారు.. మనమేం తక్కువనా... వచ్చిన రాజకీయ నాయకులకు చుట్టాలకు మించి మర్యాదలు చేస్తుంటాం.. కానీ ఐదేళ్ల కిందట ఒకడు ఇలానే వచ్చి వెళ్లాడు.. వాడిని నమ్మి మనం గెలిపిస్తే మనకిచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చాడా? మన పిల్లలకు ఉద్యోగవకాశాలు కల్పించాడా? మన ఊర్లో సమస్యలు తీర్చాడా? ఎంతవరకు మనకు అందుబాటులో ఉన్నాడు, డబుల్ బెడ్ రూమ్ ఎటుపాయె.. పింఛన్లు, రేషన్ కార్డు సదుపాయం.. ఒక్కటేంటి యాది చేసుకుంటే ఇలాంటివి చాలానే ఉంటాయి... కానీ అవేమీ మనం పట్టించుకోము.. ఎందుకంటే మనకు గతం గతః
‘నోటు’ కన్నా ‘ఓటే’ గొప్పది!
అయితే, ప్రతి అయిదేళ్లకు ఓసారి వచ్చే ఎన్నికల్లో నచ్చిన నేతలను ఎన్నుకునే తరుణం మరోసారి ఓటర్ల చేతికి వచ్చింది. ప్రస్తుతం నాయకుల తలరాత రాసే అవకాశం ఓటర్ల చేతిలోనే ఉంది. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయునికి ఓటు హక్కు కల్పించింది మన రాజ్యాంగం. భారత రాజ్యాంగం ప్రకారం కుల, మతాలకు అతీతంగా అందరికీ సమానంగా ఓటు హక్కు ఉంది. ప్రజాస్వామ్యానికి ఆక్సిజన్ లాంటి వారు ఓటరన్న... పాలకులు మారుతున్నంత మాత్రాన ప్రజల బతుకులు మారడం లేని పరిస్థితిని గమనించాలి. రాజకీయ పార్టీల జాతకాలను మార్చాలన్నా, మీ నియోజకవర్గంలో ఏ సమస్య పరిష్కారం కావాలన్నా ఆ ఓటు వినియోగమే కీలకం. బ్రష్టుపట్టిన వ్యవస్థకు చరమగీతం పాడాలన్నా వజ్రాయుధం ఓటే... అసలు నాయకుడు అంటే ప్రజలకు అండగా ఎండ వాన తేడా లేకుండా అప్పుడప్పుడు వీధివీధి తిరుగుతూ .. కాలనీవాసుల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు నేను ఉన్నానంటూ భరోసానిచ్చే నాయకుడిని ఎన్నుకోవాలి. మనం బాగుపడాలన్నా, మన పిల్లల భవిష్యత్తు కోసం భారత రాజ్యాంగం కల్పించిన అరుదైన అవకాశం ఓటు హక్కును పవిత్రంగా చూసుకుందాం. ఓటు హక్కును ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా సక్రమంగా ధైర్యంగా వినియోగించుకోని సమర్థులైన పాలకులను ఎన్నుకుందాం. ఒక నమస్కారం పెట్టి చేతికి ఒక నోటు ఇచ్చి ఈ గుర్తుకే ఓటు వేయండని చెప్పి గెలిచిన నాయకుడు ఐదు సంవత్సరాల తరువాత మళ్లీ మీ అమూల్యమైన ఓటు కోసమే వస్తాడు తప్పా.. మీ సమస్యలను పరిష్కరించడానికి మాత్రం కాదు.. అందుకే ఓటరన్న ‘నోటు’ కన్నా ‘ఓటు’ గొప్పది.. అది తెలుసుకుని మన తలరాతను.. మన బిడ్డల భవిష్యత్తులను మార్చుకుందాం...
- దాసరి చందు
జర్నలిస్ట్
94406 88986