జంపింగ్‌లతో జర జాగ్రత్త...!

Be careful with jumping leaders!

Update: 2024-03-31 00:30 GMT

పక్క పార్టీల నుండి అధికార పార్టీలోకి వచ్చినటువంటి నాయకులతో ఎప్పటికీ ఉన్న పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు,నాయకులకు ఇబ్బంది తప్పదు. అధికారం ఉందని పార్టీలు మారుస్తూ, వారి స్వలాభం కోసం పార్టీ కండువాలు సైతం మారుస్తున్నారు. అలాంటి వారికి పెద్దపీట వేస్తే వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదు. ఇది జగమెరిగిన సత్యం.అలాంటి వారిని ప్రజలు ఎప్పుడు వ్యతిరేకిస్తూనే ఉంటారు. గత ఎన్నికల్లో మనం చూసాం, ఎన్నికల్లో సైతం మనం చూస్తాం.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ సీట్లు వచ్చాయి. బీఆర్ఎస్‌కు కేవలం 38 మాత్రమే వచ్చాయి. దీంతో 2018 ఎన్నికల తర్వాత జరిగినటువంటి పరిణామాలు మళ్లీ కనిపిస్తున్నాయి. అప్పుడు కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్‌లో రాజకీయ నాయకులు జంప్ చేస్తే, ఈసారి అందుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, చైర్మన్లు, మాజీ చైర్మన్లు పార్టీ మారుతున్నారు. కొంతమంది కాంగ్రెస్ లోకి వెళ్తే మరికొంతమంది బీజేపీ వైపు వెళుతున్నారు. బీఆర్ఎస్ ఓడిపోవడంతో అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే రాజకీయ ముఖచిత్రం మారింది. కాంగ్రెస్ ముఖ్య నేతలను కలిసి తమ మనసులోని మాటను చెప్పకనే చెబుతూ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేలా పలు వ్యూహరచనలు చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో సైతం కొంతమంది కాంగ్రెస్ లోకి వెళ్తే మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరి ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు సైతం బీజేపీలో చేరి పోటీ చేస్తున్నారు.

ఆ పార్టీలే కీలకం

మారుతున్న రాజకీయాల నేపథ్యంలో జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు వారి రాజకీయ భవిష్యత్తు కోసం అధికారంలో ఉండే పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే, దేశంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ఈ రెండు పార్టీలే రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో కీలకం కానున్నాయనేటటువంటి ఉద్దేశ్యంతో నాయకులు పార్టీలు మారుతున్నారు. దీంతో రాష్ట్ర,దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పార్టీ లేవైనా పదవిలో ఉండాలనే లక్ష్యంతో పార్టీలు మారడానికి సన్నద్ధమవుతున్నారు. 2014, 2018లో బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు వివిధ పార్టీల నుండి రాజకీయ నాయకులను తీసుకొని రెండు టర్ములు పాలించింది. అలా తీసుకున్న నాయకులే తిరిగి వెళ్ళిపోతున్నారు. జెండా మోసినటువంటి కార్యకర్త, ఉద్యమాన్ని నడిపినటువంటి కార్యకర్త, నాయకులు, ఉద్యమకారులు, పార్టీని వదిలి వెళ్లడం లేదు. పార్టీలో ఉండి అవకాశాల కోసం ఎదురు చూసినటువంటి సీనియర్ నాయకులు సైతం పార్టీని వదిలి వెళ్లడం లేదు. కష్టమైనా, సుఖమైన పార్టీతోనే అని భావించి, పార్టీ కష్టాల్లో ఉంది కాబట్టి పార్టీతో ఉండాలి, పార్టీకి వెన్నుదన్నుగా నిలవాలి. ఆపదలో ఉన్న పార్టీకి అక్కున చేర్చుకోవాలని, పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు పొంగి పోకుండా, అధికారం లేనప్పుడు కృంగిపోకుండా, పార్టీకి వెన్నుదన్నుగా నిలవాలని ఉద్దేశంతో పార్టీతోనే మా ప్రయాణం అంటూ ఇప్పటికీ కొంతమంది నాయకులు బీఆర్ ఎస్ పార్టీని వీడడం లేదు.

కండువా మార్చిన వారిపైనే కనికరం

2014 నుండి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్నటువంటి నికార్సయిన నాయకులకు ఎటువంటి పదవులూ వారు అనుకున్న స్థాయిలో లభించలేదు. అయినా పార్టీతోనే ఉన్నారు. కొంతమంది నాయకులు వారి స్వార్థ బుద్ధితో బీఆర్ఎస్ పార్టీలో చేరి పదేళ్లు వివిధ పదవులను అనుభవించి మళ్లీ పదవుల కోసం, వాళ్ల రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీలు ఫిరాయిస్తున్నారు. అప్పుడు ఎలా అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సరియైన మెజారిటీ ఉన్నా కానీ వివిధ పార్టీల నుండి ఎమ్మెల్యేలను, ఎంపీలను, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులను పార్టీలోకి తీసుకొని వారికి మంత్రులుగా, ఉపముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించారు. అలా బయట నుండి వచ్చినటువంటి కండువా మార్చిన వారి పైన మాత్రమే కనికరం చూపించి, పార్టీ జెండా భుజాన ఎత్తుకున్న వారిపైన వెన్ను చూపించాడు. అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం పక్క పార్టీల నుండి వలసలను ప్రోత్సహిస్తున్నాడు. ఇలా చేయడం వల్ల పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు నాయకులకు న్యాయం చేయడం అర్థమవుతుంది. నమ్ముకున్న వారిని నట్టేట ముంచడమవుతుంది.

బీజేపీదీ అదే రూటే

కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేస్తే బీజేపీ కేంద్రంలో మళ్లీ అధికారం చేపట్టాలనే లక్ష్యంతో పావులు కదుపుతూ వివిధ పార్టీల నుండి తమ పార్టీలోకి తీసుకొని లోకసభ ఎన్నికల్లో టికెట్లు కేటాయించింది. వింటే సరాసరి, లేదంటే వారి పైన కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలచే పలు కేసులు పెడుతూ రాజకీయ నాయకులను భయభ్రాంతులను చేస్తుంది. తద్వారా బీజేపీకి లాభం చేకూరుతుందనేటువంటి ఉద్దేశంతో ఇలా అనేక రాష్ట్రాల్లో తన ఉనికిని చాటుకుంటుంది. కానీ ఇలాంటి పార్టీలు మారే జంపింగ్ రాజకీయ నాయకులతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీ కోసం పని చేసినటువంటి నాయకులు టికెట్‌ను ఆశించి, టికెట్ రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు.

పార్టీని వీడని వారిని కాపాడుకోరు

కష్టకాలంలో పార్టీనీ, కార్యకర్తలను కాపాడుకుంటూ ఖర్చు పెట్టినటువంటి నాయకులు సైతం ఆర్థికంగా నష్టపోతున్నారు. అంతేకాక ఇంతకుముందు పోటీచేసి ఓడిపోయిన నాయకులు తమకు కాకుండా వేరే వారికి టికెట్ ఎలా ఇస్తారు అని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా పక్క పార్టీల నుండి వచ్చినటువంటి వారికి పెద్దపీట వేయడం వల్ల ఉన్న పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు నష్టపోవడం అనేది జగమెరిగిన సత్యం. దానిని నివారించడానికి ఉన్న పార్టీలో ఉన్నటువంటి వారిని కాపాడుకుంటే సరిపోతుంది అని విశ్లేషకుల అభిప్రాయం.

-మోటె చిరంజీవి

99491 94327

Tags:    

Similar News