బసవేశ్వరుడు.. ఆదర్శప్రాయుడు

Basaveshwara’s ideals are relevant forever

Update: 2024-05-10 00:30 GMT

వీరశైవ సంప్రదాయాన్ని మహోజ్వలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన గొప్ప భక్తుడు బసవేశ్వరుడు. లింగాయత ధర్మ సృష్టికర్త అయిన మహాత్మా బసవేశ్వరుడు మహా మానవతావాది, సంఘ సంస్కర్త, కుల, మత, వర్గ, వర్ణ వ్యవస్థను రూపుమాపడానికి క్రీ.శ. 12వ శతాబ్దంలోనే పూనుకున్న సాంఘిక విప్లవకారుడు. స్త్రీ పురుష అసమానతలను తొలగించడానికి కృషి చేసిన అభ్యుదయవాది.

క్రీ శ 1134 లో ఆనందానామ సంవత్సరంలో నేటి కర్ణాటక బీజాపూర్ జిల్లా బాగే వాడిలో జన్మించారు. ఆయన స్త్రీ పురుష అసమానతలు, బాల్య వివాహాలు, సతీసహగమనం వంటి దురాచారాలను ఎదుర్కొనేందుకు ఆనాడే కృషిచేశాడు. దురాచారాలు స్వార్థపరుల సృష్టి అంటూ వాటిపై సమరభేరి మోగించిన సాంఘిక విప్లవకారుడు బసవణ్ణ సర్వసమానత్వమే శాంతికి మూలమని ఉపదేశించారు. జాతి, వర్గ భేదం లేకుండా అందరూ దీక్షా సంస్కారం పొందవచ్చునని చెప్పిందే లింగాయత ధర్మం. బూజుపట్టిన మూఢాచారాలకు సంప్రదాయాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగురవేసిన మొదటి సంఘ సేవకుడు బసవేశ్వరుడు. బాల్య వివాహాలు, సతీసహగమనం వంటి దురాచారాలను అరికట్టుటకు ఆనాడే కృషి చేసాడు. దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలని ఘోషించిన అపూర్వ ప్రగతిశీలి, మొట్టమొదటి కులాంతర వివాహం చేసిన గొప్ప సంఘసంస్కర్త. తన కాలపు సమాజ జీవితంలో వెలుగులు నింపిన చింతనాపరుడు బసవన్న. సామాజిక వ్యవస్థలో సమానత్వం ఉండాలని ఆయన ఆకాంక్షించారు. మనుషులు శాంతి సామరస్యాలతో సహజీవనం జరపాలని బోధించారు. సుఖసంతోషాలకు కష్టపడి పని చేయాలని నిరాడంబర జీవితం గడపాలని ఉపదేశించారు.

లింగాయత ధర్మ సృష్టికర్త

వ్యక్తుల జీవితాలను సమాజ గమనాన్ని ప్రభావితం చేసే విధంగా బసవణ్ణ తన స్వంత ఒరవడిలో కొత్త ధర్మాన్ని సృష్టించారు. అదే లింగాయత ధర్మం. అనాదిగా వస్తున్న మూఢ నమ్మకాలను, ఆచారాలను బసవణ్ణ తీవ్రంగా ఖండించారు. ఆయనకు పూర్వం స్త్రీలకు పంచములకు ధార్మిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులు ఉండేవి కావు. బసవణ్ణ ఆగమనంతో అందరూ అన్ని బంధాల నుండి విముక్తి పొందారు. వర్గ, వర్ణ, లింగ భేదాలను తెంచి ఒక నూతన సమ సమాజాన్ని స్థాపించారు. సమాజ నిర్మాణంలో ఆయన దార్శనికత నాయకత్వం ఇన్ని శతాబ్దాల తర్వాత కూడ స్ఫూర్తి నిస్తూనే ఉన్నాయి. బసవణ్ణ పూర్వపు యుగంలో పంచములకు, వెనుకబడిన కులాల వారికి దేవాలయంలోకి ప్రవేశం లేకుండేది. వారిని పశువులతో సమానంగా చూసే కాలంలో బసవేశ్వరుడు సమ సమాజ స్థాపనకై దేవుడినే భక్తుడి వద్దకు తీసుకు రావడానికి ఇష్టలింగాన్ని కనిపెట్టారు. పరమ శివునికి ప్రతిరూపమైన ఇష్ట లింగాన్ని చేతికిచ్చి గుడి సంస్కృతిని, కుల వ్యవస్థను అంతమొందించారు. ఆచార పారాయణులు పంచములను గుడిలోనికి రానివ్వనపుడు ఆ గుడిలోని లింగాన్ని తెచ్చి వారి ఒడిలోన ఉంచిన మహనీయుడు బసవణ్ణ. నేడు మనం ఆచరించే యోగాని ఆనాడే ఆయన తన ఇష్టలింగ పూజలో జత చేశారు. మాంసాహారాన్ని త్యజించి శాకాహారాన్ని స్వీకరించడం ఇష్టలింగాదరణ, ఇష్టలింగ పూజ. ఇదే బసవణ్ణ సూచించిన భక్తి మార్గం. సామాజిక వ్యవస్థలో సమానత్వం ఉండాలని మనుషులు మధ్య మతాల మధ్య సామరస్యం ఉండాలని ఆకాంక్షించిన ఆయన కుల మతాల మధ్య భేదాలను తెంచి ధార్మిక రాజకీయ ఆర్థిక హక్కులను కల్పించి నూతన సమసమాజ ఒరవడికి శ్రీకారం చుట్టి నేటి ఈ సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

స్త్రీలకు ప్రాతినిధ్యం కావాలని..

లింగాయత ధర్మం ఓ విప్లవాత్మకమైన మత రూపం, మనుషులంతా ఒక్కటే కులాలు, ఉపకులాలు లేవు. సమాజంలో ధర్మం పేరిట దురాచారాలను చూసి ఇవన్నీ స్వార్థపరుల సృష్టి అంటూ అప్పటి సమాజంలోని లోపాలపై సమరభేరి మోగించిన సాంఘిక విప్లవకారుడు బసవణ్ణ, జాతి వర్గ భేదం లేకుండా ఆసక్తి కలవారందరు దీక్షా సంస్కారం పొందవచ్చునని చెప్పేదే లింగాయత ధర్మం. జ్ఞానమే గురువు, ఆచారమే లింగం, దేహమే దేవాలయం, శ్రమకు మించిన సౌందర్య లేదు, కాయకమే కైలాసం అనే కొత్త ఒరవడికి నాంది పలికారు. మనుషులంతా ఒక్కటే, కులాలు మతాలు లేవు, ఇవన్నీ స్వార్ధపరుల సృష్టి అంటూ సమరభేరి మోగించారు. నేటి మన పార్లమెంటరీ వ్యవస్థతో సమానమైన అనుభవ మంటపాన్ని బసవేశ్వరులు ఆనాడే స్థాపించి అందులో జాతి, కుల, వర్గ, వర్ణ భేదాలు లేకుండా అందరికీ సమాన అవకాశం కల్పించారు.

12వ శతాబ్దంలోనే బసవేశ్వరుడు అభినవ మండపం ఏర్పాటు చేసి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మార్పులకు శ్రీకారం చుట్టారు. బలహీన వర్గాలకు, స్త్రీలకు ప్రాతినిధ్యం కావాలని స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి.. ప్రజాస్వామ్యంలో, పార్లమెంటరీ వ్యవస్థలో అవకాశాలు రావాలని అడుగుతున్నారు. కానీ అది ఇప్పటికీ ఆచరణలో సాధ్యం కాలేదు. కానీ 11 శతాబ్దంలోనే బసవేశ్వరుడు ఆచరించిండు. ఇప్పటి పాలకులు బసవేశ్వరుడి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని బలహీన వర్గాలకు, స్త్రీలకు ప్రజాస్వామ్యంలో అవకాశం కల్పించాలి.

(నేడు బసవేశ్వరుడి జయంతి)

శుభ ప్రద్ పటేల్ నూలీ

రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు

97010 69698

Tags:    

Similar News