బర్రెలక్క తెగువ..ప్రజాస్వామ్యంలో నూతనాధ్యాయం
Barrelakka's nomination is a new chapter in democracy
పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ... అంటారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. సరిగ్గా ఇదే స్ఫూర్తితో తెలంగాణ ఎన్నికల బరిలో శాసనసభ అభ్యర్థిగా పోటీలో నిలిచిన ఒక సామాన్య నిరుపేద దళిత యువతి దేశవ్యాప్తంగా సంచలనానికి కేంద్ర బిందువు అయింది. ప్రస్తుతం మన దేశ ఎన్నికలలో ధన ప్రభావం అధికంగా ఉన్నది. ప్రధాన పార్టీలు డబ్బున్న వ్యక్తులను మాత్రమే ఎన్నికల బరిలో నిలుపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన విధంగా తమ సమస్యల సాధనకు అధికారమే పరిష్కారంగా భావించి ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ప్రపంచాన్ని ఆకర్షించిన యువతి కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క. ఎన్నికల్లో పోటీ చేసేందుకు డిపాజిట్ డబ్బులు కూడా లేని ఒక యువతి ఎన్నికల్లో ఎంతో తెగువతో నిలవడం అంటే ప్రజాస్వామ్యం పరిఢవిల్లడమే!
మొక్కవోని ఆత్మవిశ్వాసంతో..
ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సాంకేతిక విప్లవం ద్వారా బర్రెలక్కగా తనను తాను ప్రపంచానికి పరిచయం చేసుకొని, తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై తనదైన శైలిలో ఆమె తెలిపిన నిరసన ప్రజల హృదయాల్లో ఒక స్థానాన్ని సంపాదించే విధంగా చేసింది. ఈ ప్రభుత్వంలో ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టమో తెలియజేసే క్రమంలో... బర్రెలను కాచుకోవడమే మేలని, చదువుకుంటే పట్టాలొస్తాయి గానీ ఉద్యోగాలు రావంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు లక్షలాదిమంది నిరుద్యోగుల వేదనను, ఉద్యోగాలు తెచ్చుకుని తమ కుటుంబాలను పోషించుకునేందుకు పడుతున్న ఆవేదనను కళ్ళకు కట్టినట్లు చెప్పేందుకు ఆమె చేసిన ప్రయత్నం ప్రభుత్వానికి సూటిగా తగిలింది. అందుకే ప్రభుత్వం ఆమెపై సుమోటోగా కేసులు పెట్టింది. గోరుచుట్టుపై రోకటి పోటులా నిరుపేద నేపథ్యంతో తినడానికే తిండిలేని ఆ కుటుంబం ప్రభుత్వ కేసులతో సతమతమయింది. కానీ పట్టుదల మొక్కవోని ఆత్మ విశ్వాసంతో అన్నింటిని అధిగమించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చూపిన మార్గంలో ఓటును వజ్రాయుధంగా, అధికారాన్ని ప్రభుత్వాలపై ఎక్కుపెట్టే రామబాణంగా భావించిన ఆ యువతి ఎన్నికల్లో పోటీ చేయాలనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం ప్రజాస్వామ్యవాదుల మన్ననలను అందుకుంది. ఒక జనరల్ నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలను వెచ్చించి గెలుపే పరమావధిగా పోటీపడుతున్న అభ్యర్థుల మధ్య ఒక దళిత నిరుపేద యువతి పోటీకి సై అనడం అంటే ఇది నిజంగా ప్రజాస్వామ్య గొప్పతనమే.
కేసులతో అణచివేయాలని చూడటంతో..
కుల, మత, వర్గ, ప్రాంతాలకు అతీతంగా దేశ విదేశాల నుండి ఆమెకు మద్దతు లభించడం అనూహ్య పరిణామమేమీ కాదు. ఎందుకంటే సమాజంలో ఇటువంటి తెగువ చూపిన వారికి మద్దతు లభించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. కానీ ఇది ఒక అరుదైన సంఘటనగా మాత్రం చెప్పక తప్పదు. ఎందుకంటే తెలంగాణ ఏర్పాటు అనేది నీళ్లు, నిధులు, నియామకాల కోసమే అంటూ ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాటి ఉద్యమ సమయంలో ప్రజలకు నమ్మబలికారు. ఆనాడు యూనివర్సిటీలలోనూ, కళాశాలలలోనూ చదివిన వేలాదిమంది నిరుద్యోగులు ఉద్యమ బాట పట్టి ప్రాణత్యాగాలకు వెనుకాడలేదు. అటువంటిది రాష్ట్రం ఏర్పడిన ఇన్నేళ్లలో నియామకాల మాట మరిచారని, తమను గాలికి వదిలేసారని లక్షలాది మంది నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. దానికి తోడు ఇటీవల కాలంలో గ్రూప్ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా గోచరిస్తోంది. చివరి నిమిషంలో పరీక్షల వాయిదా, తర్వాత రద్దు కావడంతో ఎందరో నిరుద్యోగులు మనస్థాపం చెందారు. మరికొందరైతే ఆత్మహత్యలకు తెగించారు.
ఈ నేపథ్యంలోనే ఈ యువతి ప్రభుత్వంపై నిరసన తెలిపి బర్రెలక్కగా ప్రాచుర్యం పొందింది. ప్రభుత్వం కేసులతో అణచివేయాలని చూడడంతో, తాను ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించి అణిచివేతలకు ఎదురు నిలిచిన తీరుతో సోషల్ మీడియానే కాక, కొన్ని ప్రధాన పత్రికలు ఛానళ్లు ఆమెకు ప్రాధాన్యతని ఇచ్చాయి. ఎన్నికల ప్రచార సందర్భంగా ఆమె సోదరుడి పైన దాడులు జరగడం దురదృష్టకరం. దీనిని ప్రజాస్వామ్య పక్షాలు ఖండించాయి. రక్షణ కల్పించాలని ఎన్నికల సంఘాన్ని కోరాయి.
మార్పునకు సంకేతంగా నిలవాలని..
ఏదేమైనప్పటికీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేయడమే కాక విజయం సాధించడం కొత్తేమి కాకపోవచ్చు. కానీ ప్రస్తుత ఎన్నికల్లో బర్రెలక్క పోటీ ఎందరినో కదిలించింది. రాజకీయాల్లో కాకలు తీరిన నేత, పాండిచ్చేరి ప్రభుత్వంలో ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సైతం దీనిపై స్పందించి ఆమె ఎన్నికల ఖర్చులకు విరాళం ప్రకటించారు. అంతే కాదు ఆమె భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు కొంత మొత్తాన్ని ఆమె పేరిట ఫిక్సెడ్ డిపాజిట్ చేసేందుకు కూడా నిర్ణయించారు. బీఎస్పీ తదితర రాజకీయ పార్టీలు సైతం దాడి సంఘటనలను నిరసించాయి. సీబీఐ మాజీ జెడి లక్ష్మీ నారాయణ, ప్రొ.కంచె ఐలయ్య, డా.సిద్దోజీ రావు తదితరులు ఛలో కొల్లాపూర్ చేపట్టారు.
ఇక ఒక ప్రముఖ సినీనటుడు, ఒక ప్రధాన పార్టీకి చెందిన నాయకుడు ఆమె గెలుపును కాంక్షిస్తూ ప్రజాస్వామ్యంలో ఇది ఒక నూతనాధ్యాయం కాగలదని పేర్కొనడం కొసమెరుపు. ఒక సామాన్య దళిత వనిత ఇంతటి కదలికను తీసుకురావడం, చైతన్యానికి కేంద్ర బిందువు కావడం, ఎన్నికలను ప్రభావితం చేయడం నవశకానికి నాంది కావాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు. గెలుపు ఓటములను పక్కన పెడితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక కదలికను తీసుకొచ్చిన ఈ పరిణామం రాజకీయాల్లో పెనుమార్పుకు సంకేతంగా నిలవాలని ఎందరో మేధావులు, సామాజిక వేత్తలు ఆకాంక్షిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాధితుల పక్షాన ఆమె చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఇతర ప్రతిపక్ష పార్టీలు మద్దతునిచ్చి ఆమెను గెలిపిస్తే రాజకీయాల్లో పెను సంచలనంగా నిలుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
- నేలపూడి స్టాలిన్ బాబు
83746 69988