తెలంగాణ పల్లెటూరి నేపథ్యం బలగం

తెలంగాణ పల్లెటూరి నేపథ్యం బలగం... balamgam movie review

Update: 2023-03-02 19:00 GMT

తెలంగాణ “యాస-బాస, కట్టూ-బొట్టూ, ఆచారాలు-సంప్రదాయాలు, స్వార్ధాలు-త్యాగాలు, ద్వేషాలు-ప్రేమలు” అన్ని సమపాళ్ళలో కలిపి తెలంగాణా పల్లెటూరి నేపథ్యంతో చిత్రీకరించిన చిత్రం బలగం. భారత దేశంలో వేల సంవత్సరాల నుండి కొనసాగుతున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ జీవనమే ప్రాతిపదికగా రూపొందిన ఈ చిత్రంలో కృత్రిమ ప్రేమల నటనల కాలంలో సహజ ప్రేమ మాత్రమే ఉమ్మడి కుటుంబం వ్యవస్థను నిలుపుతుందని చెప్తుంది. అయితే ఈ సినిమా కన్నడలో వచ్చిన ‘తిథి’ కి కాస్త దగ్గరగా ఉన్నా, సరదాగా నవ్విస్తూ, ఏడిపిస్తూ సినిమా మొత్తం ఆకట్టుకునే విధంగా అచ్చమైన తెలంగాణ మట్టి మనుషుల్లో ఉండే అన్ని రకాల ఎమోషన్స్‌తో ‘బలగం’ను తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు వేణు వెల్డండి. మన సంస్కృతి, సంప్రదాయాలు, బంధుత్వాలు, సమస్యల మూలాలను గుర్తు చేస్తూ, తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో సాగి హృదయాన్ని తడిమే భావోద్వేగంతో ఆకట్టుకునే విధంగా రూపొందిన ఈ సినిమా మార్చి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కథేంటంటే

కుటుంబ విలువలు తగ్గిపోయి, రక్త సంబంధీకుల మధ్య బంధాలు బలహీనమై బీటలు వారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఈనాటి పరిస్థితులకు తగినట్టు... చక్కని సందేశాత్మక కథను ‘బలగం’ సినిమాగా తీసిన వేణు అభినందనీయుడు. ఊర్లలోని అమాయకత్వాన్ని, అనుబంధాల్లోని హాస్యాన్ని సున్నితంగా ఆవిష్కరించిన ఈ చిత్ర కథ మొత్తం చావు చుట్టూ ఉండే కుటుంబం, గ్రామం, తెగిన అనుబంధాలు ముడిపడడంతోపాటు, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎమోషన్స్‌తో బతుకు చిత్రంలా ఉంది. పిట్ట ముట్టుడు అనే సంప్రదాయాన్ని ఆచరిస్తూనే కుటుంబాన్ని కలపాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా రూపొందింది. కొమురయ్య చనిపోయాక దినవారాలు కార్యక్రమంలో తిని, తాగి ఊరి వాళ్ళు కొమురయ్యకు పెట్టిన పిండం కాకి ముట్టలేదని, అతను దయ్యమై ఊరోళ్ళకు పడతాడని పుట్టిన పుకారును చిలువలు పలువలు చేయడంతో ఆ కుటుంబం మొత్తం అతలాకుతలమై... కాకి ముట్టేందుకు చేసే ప్రయత్నంలో ‘నేనెంతో సంబరపడ్డా’ కలిసిమెలిసి ఉండాలనే శారద కథల వాళ్ళ పాటతో కనువిప్పు కలిగి, అన్నలిద్దరూ చెల్లిని దగ్గరకు తీసుకోవడం, మొగిలయ్య భార్య కూడా మనసు మార్చుకుని కుటుంబ సభ్యులను అర్థం చేసుకోవడం, అల్లుడు నారాయణ కోపం తగ్గించుకొని కుటుంబం అంతా ఏకం అవ్వడంతో సినిమా ముగుస్తుంది.

నిరుద్యోగ యువత కష్టాలు

కొమురయ్య పాత్రధారి మలి వయసులో ఓరి వారీ! నీయక్క, నీ పాసుగాల.. అంటూ శృంగార భరిత చమత్కార భరిత మాటలతో, ఎంతో చలాకీగా, అందరితో సరదాగా కలిసిపోయి బ్రతుకుతూ ఓ రోజు హఠాత్తుగా చనిపోతాడు. చనిపోయేదాకా ఆయన చేతిలో ఎప్పుడూ ఒక చేతి సంచి ఉంటుంది. అందులో ఏముందో సినిమా క్లైమాక్స్ వరకు ఎవరికీ తెలీదు. ఇలా సరదాగా, ఎమోషనల్‌గా సాగిన ఈ సినిమాలో ఈనాటి యువత ఏదో వ్యాపారం చేసి సంపాదించాలనే తపనతో వ్యాపారంలో నష్టాలు వచ్చి చేసిన అప్పులు తీర్చేందుకు పడే ఇబ్బందులు నిరుద్యోగ యువత కష్టాలకు అద్దం పట్టింది. మనవడు సాయిలు తన పెళ్ళికి వచ్చే కట్నం డబ్బులతో కుటుంబానికి తెలియకుండా చేసిన తన అప్పులు తీర్చుకోవచ్చని ఆశ పడుతున్న ఆయన ఎదుర్కొనే ఇబ్బందులు, తాత చనిపోయినపుడు ఒక్క కన్నీటి బొట్టు కూడా రాలని ఆ మనవడు ఊరికి తాత దెయ్యంలా పట్టుకున్నాడని అబద్దాలు సృష్టించి మోసం చేయడాన్ని భరించుకోలేక, పదిరోజుల తరువాత పొలం దగ్గర తాత పడుకునే మంచంపై కూర్చుని వెక్కి వెక్కి పశ్చాత్తాపంతో ఏడ్చే సన్నివేశంలో మనవడి పాత్రదారి ప్రియదర్శి నటన సహజంగా ఉంది.

ఈ సినిమాలో తెలంగాణ ఇంటి ఆడబిడ్డ సెంటిమెంట్ బాగా పండింది. అన్నలు చెల్లెలి మధ్య బంధాలు బాగానే ఉండేవి. కానీ, అందరూ కలిసి భోజనం చేస్తుండగా మధ్యలో బావమరదులు లేచి వెళ్లడం, బావ ప్లేటులో నల్లి బొక్క వేయనందుకు అవమానం జరిగిందని పెద్ద గొడవ జరగడం, దీంతో కొమురయ్య బిడ్డ లక్ష్మి ఇరవై సంవత్సరాలు తల్లిగారింటికి రాకపోకలు లేక, తన వారిపై ఎంత ప్రేమ ఉన్నా మనసులో దాచుకుని అల్లాడిపోతుంది. చివరకు తండ్రి చనిపోయాడని తెలుసుకొని తల్లిగారింటికి వస్తుంది. కానీ బావ, బామ్మర్దుల మధ్య మనస్పర్థలు తొలగక గొడవ పడుతూనే ఉంటారు. ఈ గొడవల మధ్య లక్ష్మీ కూతురు సంధ్య, కొమురయ్య మనవడు సాయిలు మధ్య ప్రేమ చిగురించడం సహజంగా వుంటుంది. ఇక కొమురయ్య చిన్న కొడుకు మొగిలయ్య సూరత్‌లో బతుకుతెరువు కోసం వెళ్లి కుటుంబానికి దూరంగా ఉంటాడు. తండ్రి చనిపోయాక ఇంటికి వచ్చిన మొగిలయ్య తాగుడుకు బానిసై పెళ్ళాం మాటలకు తల ఊపుతూ తండ్రి సమాధి విషయంలో గొడవ పడటం లాంటి సంఘటనలను దర్శకుడు చక్కగా చిత్రీకరించారు.

పల్లె ఒడిలోకి తీసుకెళ్ళే సినిమా

ఇక ఈ సినిమాలోని పాటలు వింటుంటే తెలంగాణ మాండలికాన్ని చేతితో తడిమినట్టు ఉన్నాయి. మిర్యాల రామ్, మంగ్లీ ఆలపించిన “ఊరు పల్లెటూరు.. దీనితీరే అమ్మ తీరు..”, పాటలో పల్లె పచ్చి వాసనను గుబాళించింది. ‘బలరామ నర్సయ్యో.. బలరామ నర్సయ్యో.. బంగారి తోవబట్టి బయలెల్లుతుంటివో..’ అంటూ సాగే ఎమోషనల్ పాట, ‘పొట్టి పిల్లా.. పొట్టి పిల్లా.. నువ్వే నాకు దిక్కు మల్లా..’ అంటూ హీరో సాయిలు హీరోయిన్‌ సంధ్యని టీజ్ చేసే పాట‌, సినిమా కథ క్లైమాక్స్ లో చనిపోయిన కొమురయ్య కుటుంబ బంధాలను, అనుబంధాలను, కొడుకులు, కూతురుకు ఉన్న జ్ఞాపకాలు గుర్తు చేస్తూ శారద కథల వాళ్ళు ఎమోషనల్ గా పాడిన ‘నేనెంతో సంబరపడ్డా..’ గీతం ప్రేక్షకుల గుండెలు పిండి కళ్ల నుండి కన్నీళ్లు తెప్పిస్తాయి. ఇప్పటికే విడుదలైన పాటలన్నింటికీ మంచి స్పందన లభిస్తోంది. కాగా ఈ సినిమాలోని పాటలకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, భీమ్స్‌ సిసిరోలియో సంగీతం సమకూర్చారు.

శీరిష్ సమర్పణలో దిల్ రాజు కూతురు హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ద్వారా ప్రముఖ కమెడియన్ వేణు ఎల్దండి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో ముగ్గురు, నలుగురు తప్పితే దాదాపు అందరినీ కొత్త వాళ్ళనే సెలక్ట్ చేసుకున్న వేణు వారి నుండి మంచి నటనను రాబట్టగలిగారు. సినిమాలో హీరో తాత పాత్రలో నటించిన సుధాకర్‌ రెడ్డి, హీరో తండ్రి పాత్రలో నటించిన జయరాం, అలాగే హీరో మేనమామ నారాయణ పాత్రలో మురళీధర్ గౌడ్, హీరో మేనత్త పాత్రలో విజయలక్ష్మి, హీరో తల్లి పాత్రలో స్వరూప, హీరో బాబాయ్‌ పాత్రలో మొగిలి, రచ్చ రవిలు ఎంతో సహజంగా నటించి, ప్రేక్షకులను పల్లె ఒడిలోకి తీసుకెళ్లారు.

ఇవి కూడా చదవండి : ఖతార్ ఎయిర్‌వేస్ బ్రాండ్ అంబాసిడర్‌గా స్టార్ హీరోయిన్..

ఈ చిత్రానికి కెమెరా: ఆచార్య వేణు, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, కథా విస్తరణ, స్క్రీన్‌ప్లే: రమేష్‌ ఎగిలేటి, నాగరాజు మడూరి, పాటలు: కాసర్ల శ్యామ్‌, దర్శకత్వం: వేణు ఎల్దండి.

పొన్నం రవిచంద్ర

సీనియర్ జర్నలిస్ట్, ఫిల్మ్ క్రిటిక్

94400 77499

Tags:    

Similar News