బడిబాట మొక్కుబడి బాట కాకూడదు

ప్రభుత్వ బడుల్లో బడిబాట మొదలైంది. అయితే, బడిలో ప్రవేశాలు ప్రారంభమయ్యయనే బ్యానర్లతో ఉపాధ్యాయుల ఫొటోలు, కరపత్రాల

Update: 2024-06-20 01:15 GMT

ప్రభుత్వ బడుల్లో బడిబాట మొదలైంది. అయితే, బడిలో ప్రవేశాలు ప్రారంభమయ్యయనే బ్యానర్లతో ఉపాధ్యాయుల ఫొటోలు, కరపత్రాల పంపిణీ ఎప్పటి లాగే మొక్కుబడిగా కొనసాగుతున్నది. బడిబాటలో రోజు వారీ షెడ్యూల్ పేర్కొన్న ఆర్భాటాలకు బదులుగా సర్కార్ బడుల పనితీరుపై సమాజంలో వాస్తవాలను ప్రచారం చేయాలి. గత దశాబ్ద కాలంగా బడిబాట కార్యక్రమం సంబంధించి ఉత్తర్వులలో కార్యక్రమాలు ఎలా వున్నాయో.. ఏమున్నాయో ఈ విద్యా సంవత్సరం కూడా ఏమాత్రం మార్పు లేకుండానే రాష్ట్ర స్థాయి అధికారులు తేదీలు, సంవత్సరాలు మార్చి ఈ యేడు ఉత్తర్వులుగా జారీ చేశారు.

మౌలిక సదుపాయాల లేమిని దాచి..

ప్రైవేటు బడులు, వివిధ కులాల పేరిట ఏర్పాటైన గురుకులాల్లో చేరిన పిల్లలు పోగా మిగిలే పేద కుటుంబాల పిల్లల కోసమే మనం బడి బాట అన్నట్టుగా మారుతున్నది. రాష్ట్రంలో మూతబడిన ఆరు వేల ప్రభుత్వ పాఠశాలలు తెరిపిస్తామని, విద్యార్థుల సంఖ్యను పెంచుతామని, అన్ని పాఠశాలలకు మౌలిక సదుపాయాల ఏర్పాటు జూన్ 10 లోపు పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. సర్కార్ బడికి సమాజానికి గల సంబంధాన్ని వేరుచేసి, ఆ బడి తీరుపై సమాజంలో విషపు భావజాలాన్ని నింపటానికి.. తద్వారా సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు ఈ బడుల నిర్వహణ పై చిన్నచూపు కలిగేలా చేయటంలో గతంలోని ప్రభుత్వాలు సఫలమయ్యాయి. ఊరుబడిని సమాజం తమదిగా స్వీకరించే పరిస్థితి లేకుండా చేయగలిగాయి. ఈ నేపథ్యంలో జరిపే బడిబాటలు మొక్కుబడిగా, పత్రికలలో ఫొటోలుగా రిపోర్టులు, రికార్డులు చూపెట్టే ఆచరణకు పరిమితమవ్వకూడదు. వేలాది బడులు మూత వేస్తూ, బడుల్లో ఉపాధ్యాయుల కొరత, మౌలిక సదుపాయాల లేమిని దాచి, నిర్వహించే బడిబాట కార్యక్రమం చేస్తే ఏం ఉపయోగం?

సమిష్టి భాగస్వామ్యంతో నమ్మకాన్ని ఇవ్వాలి!

అందుకే బడి సమాజానిది, బడి తనచుట్టూర ఉన్న సమాజంలో పిల్లల చదువు జ్ఞానం,ఉపాధి అవకాశాలనే కాదు. వారి జీవితాల్లో, వారి కుటుంబాలలో వెలుగులు నింపేదనే సోయి కలిగించవలసిన అవసరం వుంది. ఊరి బడి రేపటి భవిష్యత్ సమాజాన్ని బాగు పరిచే మనుషులను తయారు చేసే కర్మాగారమనే సోయిని తల్లిదండ్రుల్లో కలిగించవలసిన అవసరముంది. ఇలాంటి గొప్ప కార్యక్రమంలో కేవలం ఉపాధ్యాయులనే భాగస్వాములను చేయటం కాకుండా సమాజంలోని అన్ని వృత్తుల, ఉద్యోగ రంగాల, మహిళా యువజన సంఘాలను సైతం భాగస్వాములను చేయవలసిన అవసరాన్ని గుర్తించాలి. ఊరి బొడ్రాయి కన్నా సర్కార్ బడికి సమాజం ఎక్కువ విలువను ఆపాదించటం రేపటి విజ్ఞాన వికాసానికి దారులు వేస్తుంది. సమిష్టి భాగస్వామ్యం మాత్రమే బడి తరపున ఉత్తమ చదువుల విషయంలో సమాజానికి నమ్మకాన్ని హామీ ఇస్తుంది. గత దశాబ్ద కాలంగా కొనసాగుతున్న బడిబాట విజయవంతమే అయిందని భావిస్తే బడి బయట అన్ని జిల్లాల్లో పెద్దయెత్తున డ్రాపౌట్ విద్యార్థుల సంఖ్య వేలల్లో ఎందుకు కనిపిస్తుంది. వేసవి సెలవుల్లో ఏప్రిల్ చివరివారంలో ఇంగ్లీషు మీడియం కాన్వెంట్లు‌, కార్పొరేట్ బడులు ప్రచారం ముమ్మరం చేసి అడ్మిషన్ల నమోదు ప్రారంభించారు. మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాల పిల్లలను ఆకర్షించేందుకు వాళ్ల గారడీలు వాళ్లు ప్రదర్శించారు. అందుకే ప్రభుత్వం విద్యా వ్యాపారం చేస్తూ బహిరంగ దోపిడీకి దిగుతున్న కార్పొరేట్ బడులను కట్టుదిట్టం చేయటంపై ప్రభుత్వం దృష్టి సారించాలి.

డ్రాపౌట్లకు కారణాలు అన్వేషించాలి

తెలంగాణలో కేవలం 16,683 మంది బడి వయసు పిల్లలు డ్రాపౌట్స్‌గా వున్నారని ప్రస్తుత ప్రభుత్వ రిపోర్టులు తేల్చాయి. అయితే, గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల పరిస్థితులను, గ్రామీణ‌ ,పట్టణ ప్రాంతాల్లోని దళిత, సంచార జాతుల వారి పిల్లలను కూడా పరిగణనలోకి తీసుకుంటే వాస్తవ సంఖ్య లభించేది. ఈ సంఖ్య నమ్మశక్యంగా లేదు. ఒక గ్రామం లేదా ఆవాసం పరిధిలో ఉన్న ప్రభుత్వ బడి వేర్వేరు కారణాలచే మూతబడితే ఆ బడి పిల్లలు దూరంలో వున్న మరో ప్రభుత్వ బడికి పోయి చేరటానికి సిద్ధపడరు. ఇందుకు పలు కారణాలుంటాయి. బాలికలను దూరం పంపించడంలో తల్లిదండ్రులకు భిన్నాభిప్రాయాలు వుండవచ్చును. సామాజిక సమస్యలు, కుల మత కట్టుబాట్లున్న కుటుంబాలలో ఇది ఒక సాకుగా చూపి పిల్లలచే చదువు మానిపిస్తున్నారు. కనీస ఉపాధి కరువైన కుటుంబాలలో ఆర్థిక సమస్య రీత్యా సెకండరీ స్థాయి బాలబాలికలచే బడి మాన్పించి తల్లిదండ్రులు తమతో పనులకు తీసుకెళ్లడం కూడా ఒక కారణంగా భావించాలి. దశాబ్ద కాలంగా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, బాలికల మూత్రశాలల కొరత కూడా కారణమని ఇటీవల విద్యార్థి సంఘాలు చేసిన పరిశీలనలో తేలింది. ప్రభుత్వం తరపున మౌలిక సౌకర్యాల లేమి, తల్లిదండ్రుల తరఫున పలు రకాల కారణాల కారణంగా సెకండరీ స్థాయిలో డ్రాపౌట్ శాతం పెరిగిపోయింది. గత దశాబ్ద కాలంగా తెలంగాణలో విద్య కర్ణుని చావుకు పది వేల కారణాలన్నట్టు కునారిల్లిపోయింది. దాని ఫలితంగా నమోదు శాతం క్రమంగా తగ్గిపోతున్న క్రమంలో మొక్కుబడి బడిబాటలో విద్యార్థుల నమోదు శాతంపై కాకి లెక్కలు చూపి గత ప్రభుత్వాలు బడిబాట అర్ధాన్ని మార్చేశాయి.

బడిబాట టీచర్లదేనా?

బడిబాట కేవలం ఉపాధ్యాయులది మాత్రమే కాదు. సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత అనే కొత్త దృక్పధం ఏర్పడాలి. స్థానిక ప్రజా ప్రతినిధులు,శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు, జిల్లా కలెక్టర్ తదితరులు ప్రత్యక్షంగా పాల్గొంటూ బడి చదువుల విషయంలోనూ, మౌలిక సదుపాయాల విషయంలోనూ స్పష్టమైన హామీ ఇవ్వటమే కాదు, ఆచరణ రూపంలో చూపిస్తే ఫలితాలు గుణాత్మకంగా వుంటాయి. బడుల ప్రారంభ సమయంలో మొక్కుబడిగా బడిబాట కార్యక్రమాల షెడ్యూల్ ఇవ్వడం ఉపాధ్యాయులు తిరగడం ఈ యేడు కూడా మామూలుగా అయిపోయింది. బడిబాట విజయవంతం కావడమంటే దాదాపు 25 లక్షల మంది ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు రావాలంటే ప్రభుత్వ విద్య మరింత కొనసాగించాలంటే అందరికీ సమాన విద్య రావాలి. అంటే కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యను ఈ సకాలంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాల్సిన అవసరం ఉన్నది.

వాడపల్లి అజయ్ బాబు

99516 24126

Tags:    

Similar News