రహదారులు యమ కూపాలుగా మారుతున్నాయి. రోడ్లన్నీ గుంతలతో నిండిపోతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ప్రమాదాలకు సంకేతాలుగా మారుతున్న రహదారులను పట్టించుకోకపోతే వాహన చోదకులు ప్రమాదాలకు గురై, ప్రాణాలు కోల్పోయే అవకాశముంది. ఏ దేశంలో అయితే రవాణా వ్యవస్థకు అనువైన రోడ్డు సౌకర్యాలు ఏర్పడతాయో, అక్కడ అభివృద్ధికి మార్గం సుగమమవుతుంది. వాయు మార్గాలు, జలమార్గాలు ఇతర దేశాలతో ఎగుమతి, దిగుమతులకు అనుసంధానంగా ఉన్నాయి. అయితే ప్రజలకు రైల్వే, రోడ్డు రవాణా మార్గాలు సులభతరంగా, అనుకూలంగా ఉన్నాయి. మన దేశం పల్లెలకు పుట్టినిల్లు. గ్రామీణ ప్రాంత ప్రజలకే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు రోడ్డు మార్గాలు అత్యంత అనుకూలం ఉంటాయి. ప్రజల నిత్య జీవనం సజావుగా సాగడంలో రోడ్డు రవాణా వ్యవస్థ అత్యంత కీలక భూమిక పోషిస్తున్నది. ఇటువంటి రోడ్ల వ్యవస్థను మరింత భద్రతా ప్రమాణాలతో తీర్చిదిద్ది, ప్రమాదాలను అరికట్టి,ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారత దేశంలో ప్రతీ ఏటా లక్ష మందికి పైగా ప్రజలు రోడ్డు ప్రమాదాలకు గురై, విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. ఇటువంటి ప్రమాదాలను అరికట్టి, ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించి, ప్రమాదాలు లేని రోడ్డు ప్రయాణాలకు అనువైన వాతావరణం కల్పించాలి.
నాణ్యతా ప్రమాణాలు లేకపోవడంతో..
అన్ని రకాల రహదారులు నాణ్యతా లోపం వలన స్వల్పకాలానికే పాడైపోతున్నాయి. అధిక ట్రాఫిక్‌తో, భారీవాహనాలతో, వర్షాల వలన మన రోడ్లన్నీ గుంతలతో నిండిపోతున్నాయి. మిగతా కాలం దుమ్ము, ధూళిని వెదజల్లే కాలుష్య కారకాలుగా మన రహదారులు రూపాంతరం చెందాయి. మనం కాంక్రీట్, తారుతో రహదారులను ఎక్కువగా నిర్మిస్తున్నాం. రహదారులు ఎలా నిర్మించాలనేది ప్రభుత్వాల నిర్ణయం. కానీ రహదారుల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, గుంతలు లేని రహదారులు కావాలని ప్రజల ఆకాంక్ష. నాణ్యతా లోపాలవలనే రహదారులు త్వరగా పాడైపోవడం, గుంతలతో అనేక మంది అమాయక ప్రాణాలు బలికావడం నిత్యం రహదారులన్నీ రక్తసిక్తం కావడం మనం చూస్తున్నాం. నిర్మించిన కొద్ది రోజులకే రహదారులన్నీ గుంతలతో బీభత్సంగా మారి, వాహనాలు బోల్తాపడడంతో అమాయకుల పంచప్రాణాలు అనంత వాయువుల్లో కలిసి పోతున్నాయి. రహదారులన్నీ మృత్యుకుహరాల్లా మారిపోతున్నాయి. స్వర్గానికి ప్రత్యక్ష దారులుగా రహదారులు తయారైనాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వలన, వాహనదారుల మితిమీరిన వేగం వలన, తాగి వాహనాలను నడపడం వలన అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఏటా 1.3 మిలియన్ల మంది ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తుంటే ఒక్క మన దేశంలోనే లక్షన్నర మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. రహదారులపై పడే గుంతల వలన 3500 కు పైగా మరణిస్తున్నారు. అనేక వేల మందికి పైగా మృత్యువాత పడుతున్నారు. ఇరవై వేల మందికి పైగా తీవ్ర గాయాలౌతున్నాయి.
సౌకర్యమా.. మృత్యు మార్గమా
మనిషి ప్రాణం చాలా విలువైనది. జీవించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. ఇతరుల పొరపాట్ల వల్లనో, నిర్లక్ష్యం వల్లనో, నాణ్యతా ప్రమాణాలు లేని రోడ్ల నిర్మాణం వలనో ప్రజల జీవించే హక్కును హరించడం దుర్మార్గం. వాహన దారుల తప్పులకు భారీ జరిమానాలను విధించే ప్రభుత్వ చట్టాలు నాణ్యత లేని రహదారులను నిర్మించే సంబంధిత వ్యవస్థలలోని అవినీతిపరులను, గుంతల వలన ప్రాణాలు కోల్పోయే పరిస్థితులను కల్పిస్తున్న స్వార్థపరులపై దృష్టి కేంద్రీకరించాలి. రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు సక్రమంగా నిర్మించాలి. చాలా చోట్ల ఇవే ప్రమాద హేతువులుగా మారుతున్నాయి. వేగనిరోధకాలవద్ద తప్పని సరిగా అందరికీ కనిపించే విధంగా రంగులను పూయాలి. రిఫ్లెక్టర్లను తప్పని సరిగా వేగనిరోధకాల వద్ద అమర్చాలి. తాగి వాహనాలను నడుపుతూ, ఇతరుల ప్రాణాలను హరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. రహదారులు దేశ ప్రగతికి సోపానాలు. అలాంటి రహదారులను పటిష్టంగా నిర్మించడం, గుంతల వలన కలిగే అనర్ధాలను ప్రభుత్వాలు గుర్తించి తగు విధివిధానాలు రూపొందించాలి. ప్రజల ప్రాణాలను కాపాడాలి. రహదారులను పాడవకుండా, నాణ్యతా ప్రమాణాలతో నిర్మించి, పర్యవేక్షించవలసిన బాధ్యత ప్రభుత్వాలది. అన్ని రకాల అనుమతులతో, ట్రాఫిక్ నిబంధనలు పాటించి, ప్రమాదాలను దరిచేరనీయకుండా, ప్రాణాలను కాపాడు కోవడం ప్రజల బాధ్యత. అయితే రహదారులు అస్తవ్యస్థంగా తయారై, ప్రమాదాలు జరిగితే అందుకు ప్రభుత్వాలు, సంబంధిత శాఖలు బాధ్యత వహించాలి. రహదారులు సౌకర్యవంతమైన ప్రయాణానికి ఆలవాలం కావాలి. మృత్యువుకు మార్గాలు కాకూడదు. ప్రజల ప్రాణాలు నష్టపరిహారంతో తిరిగిరావు. ప్రజల నుండి వివిధ రూపాల్లో పన్నులు వసూలు చేసి, సరైన రోడ్లు వేయకుండా వాహన చోదకులపై వివిధ కారణాలతో ఫైన్లు కట్టమనడంలో ఔచిత్యం లేదు.
-సుంకవల్లి సత్తిరాజు
97049 03463