ఆపదలో ఆటోవాలా!

'రిమ్‌జిమ్ రిమ్‌జిమ్ హైదరాబాద్- రిక్షావాలా జిందాబాద్, మూడు చక్రములు గిరగిర తిరిగితే-మోటరు కారే బలాదూర్' అన్నాడో సినీ కవి. ఒకప్పటి రాచ ఠీవికి నిలువుటద్దం రిక్షా......A common man story in hyderabad

Update: 2022-06-06 18:45 GMT

'రిమ్‌జిమ్ రిమ్‌జిమ్ హైదరాబాద్- రిక్షావాలా జిందాబాద్, మూడు చక్రములు గిరగిర తిరిగితే-మోటరు కారే బలాదూర్' అన్నాడో సినీ కవి. ఒకప్పటి రాచ ఠీవికి నిలువుటద్దం రిక్షా. నవనాగరికత చట్రాల కింద రిక్షా నలిగిపోయింది. తరువాత ఆటోరిక్షాలు రంగ ప్రవేశం చేశాయి. ధనికులు మొదలు పేదల వరకు గమ్యస్థానాలకు చేర్చిన ఆటోలకు కూడా ఇప్పుడు ఆపదొచ్చి పడింది. ఆటో మనుగడకే ముప్పొచ్చింది. కార్పొరేట్ మాయాజాలం ఆటోలను మింగేసింది. ఆటో డ్రైవర్లు కూలీలవుతున్నారు.

*

రంగారెడ్డి జిల్లాకు చెందిన కిషన్ పదో తరగతి వరకు చదువుకున్నాడు. పదేళ్ల క్రితం హైదరాబాద్‌కు వలసొచ్చాడు. బీసీ కార్పొరేషన్ నుంచి అప్పు తీసుకొని ఓ ఆటో కొనుక్కున్నాడు. జీడిమెట్ల, షాపూర్‌నగర్, బాలానగర్ వెళ్లే వర్కర్లతో ఆటో గిరాకీ బాగా నడిచింది. అల్లుడి సంపాదన చూసి మురిసిపోయిన మేనమామ కిష్టయ్య తన బిడ్డ పుష్పను ఇచ్చి వైభవంగా పెళ్లి జరిపించాడు. కుత్బుల్లాపూర్‌లో నివాసం పెట్టారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రికామ్ లేకుండా పనిసాగేది. మధ్యలో భోజనానికి రావడానికి ఒక్కోసారి టైం ఉండకపోయేది. వచ్చిన డబ్బులతో ఊళ్లో ఎకరం భూమి కొన్నాడు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. పండుగలు, పబ్బాలకు ఊరెళ్లి వస్తుండేవాడు కిషన్. పిల్లలను కాన్వెంట్‌లో చేర్పించాడు.

హైదరాబాద్‌కు క్యాబ్ కల్చర్ వచ్చింది. రెండు కార్పొరేట్ కంపెనీలు హైదరాబాద్‌లో ఆఫీసులు తెరిచాయి. వారి దగ్గర ఒక్క వాహనమూ లేదు. తమతో కలిసి పనిచేయాలని, రెండు చేతులా డబ్బులు సంపాదించుకోవాలని ప్రకటనలు ఇచ్చారు. తొలుత ఎవరూ వెళ్లలేదు. వారు మరో అడుగు ముందుకేసి 'మీకు కారు మేమే ఇస్తాం, డబ్బులను వాయిదాలలో వసూలు చేసుకుంటాం' అనే మరో ఆఫర్ ప్రకటించారు. దీంతో చాలా మంది డ్రైవర్లు క్యాబ్ కంపెనీలలో చేరిపోయారు. ప్రజలను ఆకట్టుకొనేందుకు మరో పాచిక వేశాయి కంపెనీలు. ఫస్ట్ రైడ్ ఉచితం. ఐదు రైడ్ల వరకు 50 శాతం డిస్కౌంట్ అన్నారు. జనం ఎగబడ్డారు. సాధారణ ప్రజానీకం కూడా క్యాబ్‌లు ఎక్కడం ప్రారంభించారు.

*

ఆటో అడ్డాలన్నీ వెలవెలబోయాయి. ఉదయం వెళ్లిన డ్రైవర్లకు కిరాయిలు దొరకని పరిస్థితి ఏర్పడింది. క్యాబ్ అయితే ఇంటి వరకు వెళ్లొచ్చు. ఇంటి దగ్గరే దింపేస్తారు. ఆటో అయితే రోడ్డు వరకు నడవాలి. మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకుందామనే మైండ్ సెట్‌కు జనం అలవాటు పడ్డారు. ఆ రెండు కార్పొరేట్ కంపెనీలవారినీ ఆటో సంఘాల ప్రతినిధులు వెళ్లి కలిశారు. 'సర్, మాకు కిరాయిలు దొరుకుతలేవు. ఆటోలు కూడా మీరు స్టార్ట్ చేయండి సార్. మా ఆటోలకు గిరాకీ ఇప్పించండి' అని ప్రాధేయపడ్డారు. సరిగ్గా కార్పొరేట్ కంపెనీలవాళ్లు కోరుకున్నదే జరుగుతోంది. పేదవాడి ప్రయాణసాధనం కార్పొరేట్ పంచకు చేరింది. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన ఆటోవాలా ఇప్పుడు వాళ్ల దగ్గర వర్కర్.

ఆఫర్లు ప్రకటించిన కంపెనీలు ఆటోనూ బుక్ చేసుకోవడం జనాలకు నేర్పాయి. ఆటో డ్రైవర్లు రోడ్లు మర్చిపోయారు. జీపీఎస్ ఆధారంగానే ఆటోలు నడుపుతున్నారు. కిషన్ సైతం పదిమంది వెంటే పరుగులు తీశాడు. ప్రతి వారం డబ్బులు ఇచ్చేవారు. రోజూ చేతినిండా డబ్బులతో ఇల్లు చేరిన కిషన్ ఇప్పుడు వారం రోజుల వరకు వేచి చూడాల్సి వస్తున్నది. ఒక్కోసారి పెట్రోలుకు కూడా డబ్బులు ఉండటం లేదు. ఎలాగోలా బతుకుబండి సాగిస్తున్నాడు. అంతలోనే కరోనా మహమ్మారి వెంటాడింది. లాక్ డౌన్ మొదలైంది. ఆటో ఇంటికే పరిమితమైంది. పూటగడవడం కష్టంగా మారింది. ఊళ్లో ఉన్న ఎకరం పొలం అమ్మేశాడు. ఏడాదిపాటు ఎలాగోలా బతుకుబండిని లాగించారు.

*

లాక్‌డౌన్ ముగిసినా జనం రోడ్ల మీదకు రావడం లేదు. నెలల తరబడి ఇంటి వద్దే ఉన్న ఆటోను సర్వీసింగ్ చేయించేందుకు దాదాపు ఆరు వేల రూపాయలు ఖర్చయింది. ఓలా బుకింగ్స్ స్టార్ట్ కాలేదు. జనరల్ కిరాయిలు చేసుకుందామని రోడ్డుమీదకు వస్తే ఆటో ఎక్కేవారు కరువయ్యారు. జనం బయటికి రావడం లేదెందుకని ఆరా తీస్తే మరో కొత్త విషయం తేలింది. కరోనా సమయంలో మధ్యతరగతి ప్రజలు చాలా మంది సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేశారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు సిస్టంలో పోతే కరోనా అంటుకుంటుందనే భయం వారితో కార్లు కొనేలా చేసింది.

రోజంతా ఆటో తిరిగితే మూడు వందల రూపాయలు వచ్చేవి. డీజిల్ ఖర్చులు పోను 150 రూపాయలు మిగిలేవి. ఒక్కోసారి 100 రావడం కూడా కష్టంగా మారింది. భార్యాపిల్లలతో పట్నంలో సంసారం నడపడం కష్టంగా మారింది కిషన్‌కు. మళ్లీ ఊరెళ్లలేడు. పిల్లల ఫీజులకు డబ్బుల్లేవ్. కాన్వెంట్ స్కూలు వాళ్లు డబ్బులకోసం ఒత్తిడి తెస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. భార్యకు చెప్పకుండానే ఆటో అమ్మేశాడు. రిపేర్‌కు ఇచ్చానని అబద్ధం ఆడాడు. ఆటో అమ్మగా వచ్చిన డబ్బుతో స్కూలు ఫీజులు కట్టాడు. ఇంటికి దగ్గరగా ఉంటుంది, పైగా ఆడపిల్లలు అని భార్యకు చెప్పి తక్కువ ఫీజున్న వేరే స్కూలుకు మార్చాడు.

*

మరుసటిరోజు ఉదయాన్నే ఇంటి నుంచి బయల్దేరాడు. చింతల్ లేబర్ అడ్డాకు చేరుకున్నాడు. అడ్డాకూలీగా మారాడు. మొదటి రోజు రూ. 500 వరకు సంపాదించాడు. సాయంత్రం ఆరు గంటలకు ఇల్లు చేరాడు. భోజనం చేసి నైట్ కిరాయి ఉందని చెప్పి, ఆటోలు లీజుకు ఇచ్చే సర్దార్ ఖాన్ వద్దకు వచ్చాడు. 'అన్నా నాకో ఆటో కావాలి. రాత్రిపూట నడుపుకొంటాను' అన్నాడు. సాధారణంగా రాత్రి పూట ఎవరూ తీసుకోరు. తెలిసిన వ్యక్తే కావడంతో సర్దార్ ఓకే చెప్పాడు. 12 గంటలకు రూ. 300 ఇవ్వాలనేది వీరిద్దరి మధ్య ఒప్పందం.

సోమాజిగూడలోని రాజ్‌భవన్ రోడ్ చౌరస్తాకు చేరాడు. అప్పటికే అక్కడ ఐదారు ఆటోలున్నాయి. ప్లాట్‌ఫాం మీదకు ఆటో ఎక్కించాడు. గిరాకీ కోసం వెయిట్ చేస్తున్నాడు. మిగతా డ్రైవర్లతో మాటకలిపాడు. 'పొద్దున్న మూడు గంటలకు గిరాక్ చాలైతదన్న. దో గంటే బస్, కిరాయా మిల్తే, బాద్ మే ఘర్ కు చలేజా సక్తే' అన్నాడు డ్రైవర్ చాంద్ పాషా. పడుకోమ్మంటూ పక్కన స్థలం చూపించాడు. పొద్దంతా కూలీ పనిచేసిన కిషన్‌కు ఇట్టే నిద్దరొచ్చేసింది. ఉదయం మూడు గంటలకు హడావుడి మొదలైంది. కిషన్ నిద్రలేచాడు. కిరాయిల కోసం పరుగులు తీశాడు. 7 గంటల వరకు ఆటో నడిపాడు 600 రూపాయలు వచ్చాయి. డీజిల్ ఖర్చులు, రోజూ వారీ కిరాయి పోను 200 మిగిలాయి. ఇంటికి బయల్దేరాడు. స్నానం చేసి మళ్లీ అడ్డా బాట పట్టాడు. రాత్రింబవళ్లూ కష్టపడుతున్నా అప్పుల చక్రబంధం నుంచి బయటికి రావడం లేదు కిషన్.

ఎంఎస్‌ఎన్ చారి

79950 47580

Tags:    

Similar News