అసోం వాసుల హక్కుల దివిటీ

Assamese rights divinity Shambhudan Phanglo

Update: 2024-03-16 00:45 GMT

మరుగున పడిన అనేక మంది భారతీయ స్వాతంత్ర్య సమరయోధులలో వీర్ సెంగ్యా శంభుదన్ ఫోంగ్లో ఒకరు. బ్రిటిష్ వలస రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదివాసీ వీరయోధుడు ఫోంగ్లో. అతను అస్సాంలోని ప్రస్తుత దిమా హసావో జిల్లాలోని ఉత్తర కాచర్ హిల్స్ లోని లాంగ్ ఖోర్ అనే చిన్న గ్రామంలో 1850, మార్చి16న జన్మించాడు. గతంలో అంటే 1832లోనే బ్రిటిష్ వారు తొలిసారి కాచర్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి విషయాన్ని తెలుసుకొని అతను చాలా బాధపడ్డాడు. ఆ తరువాత వారు డిమాసా భూభాగాన్ని కూడా ఆక్రమించడమే కాకుండా ' విభజించు - పాలించు ' వ్యూహాన్ని అమలు చేశారు. ఇలా డిమాసా భూభాగాన్ని స్వాధీనం చేసుకున్న బ్రిటిష్ వారు కనీసం అక్కడి స్థానికుల హృదయాలను కూడా గెలుచుకోలేకపోయిన అమానవీయతను పొంగ్లో గమనించాడు. ఇటువంటి దుశ్చర్యలు క్రమంగా బ్రిటిష్ పాలనపై తిరుగుబాటుకు దారితీశాయి.

బానిసలుగా జీవించకూడదని..

1832లో బ్రిటీష్ వారు సదరన్ క్యాచర్‌ను 1854లో ఉత్తర కాచర్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి వారి పాలనలోనే మగ్గుతున్న ఈ చర్యలను ఫోంగ్లో తీవ్రంగా వ్యతిరేకించాడు. అస్సాం ప్రజలను పాలించే హక్కు బ్రిటీష్ వారికి లేదని, స్వదేశీయులను నిర్వీర్యం చేసేందుకే ప్రాదేశిక ఎత్తుగడలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డాడు. స్వదేశీయులు స్థానికంగా స్వేచ్ఛను కోల్పోతే సహించేది లేదని హెచ్చరించాడు. 'స్వేచ్ఛను కోల్పోవడం అంటే బానిసత్వాన్ని స్వీకరించడం కదా! అని ఆవేశపడ్డాడు. కష్టాలు ఎన్నైనా భరించవచ్చు కానీ బానిసత్వం అలా కాదు కదా! అస్సాం ప్రజలు బానిసలుగా విదేశీయుల క్రింద జీవించడం ఆత్మగౌరవం కోల్పోవడమే. కాబట్టి ఒక విదేశీ శక్తి తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంలో ప్రజలెవరు వారికి సహకరించకూడదు' అని ఫోంగ్లో ప్రచారం నిర్వహించాడు. ప్రజలను నిరసనలు తెలపడానికి మరియు అధికారులను ప్రతిఘటించడానికి అతను ఉత్తర కాచర్ హిల్స్ గుండా విస్తృతంగా పర్యటించాడు. దారి పొడవునా పరిచయాలు, మద్దతుదారులను కూడగట్టుకున్నాడు.

మద్దతరాలను కూడగట్టుకుని..

ఫోంగ్లో తగినంత మంది యువకులను సేకరించి ఒక విప్లవ శక్తులను కూడగట్టి మైబాంగ్‌ లో వారికి శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. బ్రిటీష్ ప్రభుత్వం శంభుధన్ వ్యూహ ఎత్తుగడల గురించి తెలుసుకొని ఆందోళన చెందింది. సైన్యం కూడా కఠినంగా స్పందించింది. గుంజుమ్ సబ్ డివిజనల్ అధికారి సైన్యాన్ని పిలిపించి శంభుదన్ పేరు మీద అరెస్ట్ వారెంట్ జారీ చేశాడు. అతడిని అరెస్టు చేసేందుకు సైన్యాన్ని మైబాంగ్ కు పంపించాడు. శంభుధన్ దృష్టికి ఈ విషయం తెలియగానే, వెంటనే తన సైన్యాన్ని ఏర్పాటు చేసి మైబాంగ్ లోని తన శిబిరంపై దాడి చేసిన బ్రిటిష్ అధికారులను కొందరిని చంపాడు. తదుపరి ఎన్ కౌంటర్లలో, బ్రిటీష్ సైన్యం శంభుదన్ కూడగట్టుకున్న బలాన్ని, శక్తిని పసిగట్టింది. చివరికి బ్రిటీష్ వారు అతనిని ద్రోహపూర్వకంగా ఓడించారు. నార్త్ కాచర్ హిల్స్ లోని లోతైన అడవిలో పట్టుబడి, బ్రిటిష్ సైన్యం దాడికి గురయ్యాడు. అక్కడి అడవిలోనే లోతైన గాయాలతో 1883, ఫిబ్రవరి 12న శంభుదన్ ఫోంగ్లో అమరుడైనాడు. అసోమ్ వాసుల హక్కుల కోసం పోరాడిన శంభుదన్ ఫోంగ్లోను "ది అన్ టోల్డ్ హీరో ఆఫ్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్" అని పిలుస్తున్నారు.

(నేడు శంభుదన్ ఫోంగ్లో జయంతి)

గుమ్మడి లక్ష్మీనారాయణ,

ఆదివాసీ రచయితల వేదిక,

94913 18409

Tags:    

Similar News