ఎన్నో పర్వదినాల మాసమిది

పూర్వాషాఢ నక్షత్రంతో కూడి పౌర్ణమి ఉన్న నెలయే ఆషాఢ మాసం. ఇది సంవత్సరములో నాలుగవది. దీనిని శూన్య మాసమని కూడా అంటారు.

Update: 2022-07-06 18:30 GMT

పూర్వాషాఢ నక్షత్రంతో కూడి పౌర్ణమి ఉన్న నెలయే ఆషాఢ మాసం. ఇది సంవత్సరములో నాలుగవది. దీనిని శూన్య మాసమని కూడా అంటారు. వర్ష బుుతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమతుంది. పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ, పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోనికి వచ్చే నెల. ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథునరాశి నుంచి కర్కాటకరాశిలోని ప్రవేశించడంతో దక్షిణాయనం మెదలవుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజును గురుపౌర్ణమిగా వ్యవహరిస్తారు. ఈ మాసంలో చేసే దానం, జపం విశేష ఫలితాలనిస్తాయి.

పెద్దల కట్టుబాట్లు

తొలి ఏకాదశిని శయన ఏకాదశి అంటారు. ఈ రోజు నుంచే చాతుర్మాస వ్రతం మొదలవుతుంది. దీనినే మతత్రయ ఏకాదశి అంటారు. ఆషాఢంలో తెలంగాణా ప్రాంతంలో సంప్రదాయబద్ధమైన బోనాల ఉత్సవాలను జరుపుకొంటారు. అమ్మవారికి తయారు చేసే భోజనాన్ని బోనం అంటారు. దానిని అమ్మవారికి నివేదించే పర్వదినాన్నే బోనాల పండుగ అంటారు. గ్రామీణ ప్రాంతంలో ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అన్నం, బెల్లం, పెరుగు, పసుపు నీళ్లు, వేపాకులు ఈ బోనంలో ఉంటాయి.

ఇక ఈ రోజులలోనే వ్యవసాయ పనులు ఎక్కువగా ఉంటాయి. కొత్త అల్లుళ్లు ఎక్కడ అత్తారింటిలో ఉంటారోనని 'ఆషాఢంలో అత్తా అల్లుళ్లు ఎదురు పడకూడదనే' ఆనవాయితీని ప్రవేశపెట్టారు. ఈ సమయంలో మహిళ గర్భం దాల్చితే ఉత్తమ సంతానం కలగదనే నమ్మకం కూడా ఉండేది. దీని వలన ఆషాఢ మాసాన్ని నిషిద్ధ మాసం అంటారు. ఈ మాసంలో గర్భం దాలిస్తే ప్రసవ సమయానికి ఎండాకాలం వస్తుంది. ఎండ తీవ్రత తల్లీపిల్లలకు మంచిది కాదు. ఇలా ఎన్నో రకాలుగా ఆలోచించి మన పెద్దలు కట్టుబాట్లు పెట్టారు.

అశుభం అంటూనే

ఆషాఢ మాసం శుభకార్యాలకు పనికిరాదంటారు. కానీ, ఈ నెలలోనే ఎన్నో పండుగలు, పుణ్య దినాలు ఉన్నాయి. శుక్లపక్ష ఏకాదశి: తొలి ఏకాదశి దీనికే ప్రథమ ఏకాదశి అని, శయన ఏకాదశి అని కూడా పేరు. శ్రీమహావిష్ణువు ఈ దినం మొదలుకొని నాలుగు నెలలపాటు పాలకడలిలో శేషశయ్యపై శయనించి యోగనిద్రలో ఉంటాడు. ఈ దినమంతా ఉపవాసం ఉండి విష్ణువును పూజించాలి. మరునాడు ద్వాదశిన తిరిగి శ్రీమహావిష్ణువుని పూజించి నైవేద్యం సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించి అటుపిమ్మట భోజనం చేయాలి.

ఈ రోజు నుంచే చాతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుంది. శుక్ల పూర్ణిమ: వ్యాసపూర్ణిమ / గురుపూర్ణిమ. శ్రీ వేదవ్యాసులవారి జన్మదినంగా చెప్పబడుతూ ఉన్న ఈ రోజున వ్యాసుడిని, కృష్ణుడిని, గురుపరంపరను పూజించాలని శాస్త్ర వచనం, కృష్ణ పక్ష అమావాస్య : దీప పూజ, అషాఢ మాసం చివరి రోజు అమావాస్య నాడు చెక్క మీద అలికి ముగ్గులు పెట్టి దీపపు స్తంభాలను ఉంచాలి. వాటిని వెలిగించి పూలు, లడ్డూలు సమర్పించాలి.

తిరుమల మనోహర్ ఆచార్య

శ్రీ రామానుజ యాగ్నిక పీఠం దక్షిణ భారతదేశ సహాయ కార్యదర్శి

హైదరాబాద్

9989046210

Tags:    

Similar News