మహిళలపై అంతటా వివక్షే
మహిళలపై అంతటా వివక్షే... article on Discrimination against women
ప్రతి ఏటా మహిళా దినోత్సవం రోజున మహిళా సాధికారత గురించి, మహిళా సంక్షేమం గురించి, మహిళల హక్కుల గురించి ఊరూ వాడా ఉపన్యాసాలివ్వడం మామూలైపోయింది. ఆ తర్వాత రోజు నుంచి వారి గురించి పట్టించుకునే వారే ఉండరు. ప్రసంగాలు ఇవ్వడం తప్ప వారి గురించి, వారి హక్కుల గురించి ఆ ఆచరణలో శూన్యత కనబడుతున్నది. భవిష్యత్తును తీర్చిదిద్దుకునే హక్కు మగవారికెంత ఉన్నదో మహిళలకు అంతే ఉన్నదని మహాత్మా గాంధీ తెలిపారు. పురుషాధిక్య భావజాలం అధికంగా ఉన్న భారతీయ సమాజంలో అన్నింటా లింగ సమానత్వానికి రాజ్యాంగం పట్టం కట్టింది. గౌరవప్రదమైన జీవితం కోసం శ్రమించి ఎదుగుతున్న మహిళలకు అంతటా వేధింపులు పీడగా దాపురించాయి.
ఆర్థిక స్థిరత్వం చేకూరితేనే
స్త్రీలకు అన్నింటా సమాన అవకాశాలు కల్పించాలని గొంతెత్తి అరవడమే తప్ప వారికి దేశంలో ఎక్కడా సమాన అవకాశాలు కల్పించడం లేదు. కనీసం చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కావాలని దశాబ్దాలుగా పోరాడుతున్నా వారి కల సాకారం కావడం లేదు. ప్రస్తుతం మహిళలు గెలుస్తున్న స్థానాలతో పోలిస్తే చట్టసభల్లో వారు 33 శాతానికి చేరుకోవాలంటే వందేళ్ళు పట్టే అవకాశముందని ప్రోఫెసర్ సిహెచ్ హనుమంతరావు అభిప్రాయపడ్డారు. ఇక ఎంపీ, ఎమ్మెల్యేల శాతమైతే 15 లోపే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వీరి శాతం 10 లోపే ఉంది. దేశంలోని 19 రాష్ట్రాల్లోని చట్టసభల్లో వారి వాటా కూడా 10 శాతం లోపే ఉంది. లోక్‌సభలో 14.94 శాతం, రాజ్యసభలో 14.05 శాతం ఉన్నది. అయితే స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తున్నా వారి పదవులు అలంకారప్రాయంగానే మిగిలిపోయి పేరుకు పదవున్నా ఆమె తరఫున భర్తలు, సోదరులు అధికారాలు చెలాయిస్తున్నారు. వారి తరఫున వారి భర్తలే సమావేశాలకు హాజరవుతున్న సందర్భాలు ఉన్నాయి. రాజకీయ పార్టీల్లో పదవులైనా, అధికారిక పదవులైనా పూర్తిగా మగవారి చేతుల్లోనే ఉంటున్నాయి. ఈ పదవుల కోసం మగవారిని దేబిరించి అడుక్కోవాల్సిన దయనీయ పరిస్థితి ఉంది. దేశంలోని 29 రాష్ట్రాలలో కేవలం ఒక్క మహిళా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రమే ఉండటం బాధాకరం.
2021 అంతర్జాతీయ లింగ సమానత్వ సూచీలో 150 దేశాలకు గానూ అందులో మనదేశ స్థానం 140 వ స్థానంలో ఉండటం విచారకరం. మహిళ కార్మికుల శక్తి పెరగాల్సిందిపోయి మన దేశంలో తగ్గిపోవటం ఘోరం. 1990లో 30.27శాతంగా ఉన్న మహిళ కార్మిక భాగస్వామ్య రేటు 2019కి వచ్చేసరికి 20.8శాతానికి పడిపోయిందని గణాంకాలు తెలుపుతున్నాయి. ఇక కరోనా వలన పనిచేసే ప్రతి 10 మందిలో 4గురు మహిళలు ఉపాధి కోల్పోయారు. 15-59 వయో వర్గం లోని మహిళల్లో కేవలం 20.6 శాతం మాత్రమే వేతన ఉద్యోగాలు ఉన్నారని జాతీయ గణాంక సర్వే తేల్చింది. కానీ ఈ వయసు మగవారు 70 శాతం ఉన్నారు. దేశ ఆర్థిక ప్రగతిలో స్త్రీలను కూడా భాగస్వాములను చేయాలి. పిల్లల ఆలనా, పాలనా చూసుకునే బాధ్యతల కారణంగా కూడా మహిళలు ఉద్యోగాలు వదులుకోవలసిన పరిస్థితి ఉంది. అందుకే పని ప్రదేశాల్లో పిల్లల ఆలనా, పాలనకు వసతులు కల్పించడం ద్వారా ఈ పరిస్థితి నుంచి తప్పించవచ్చు. మహిళలకు ఆర్థిక స్థిరత్వం చేకూరినప్పుడే వారు తమ హక్కులు సౌకర్యాల కోసం గట్టిగా డిమాండ్ చేయగలుగుతారు. మహిళలకు సమాన అవకాశాలు లభిస్తే 2025 కల్లా భారత జీడీపీకి అదనంగా 77వేల కోట్ల డాలర్ల సంపద చేకూరుతుందని మికిన్సే గ్లోబల్ ఇనిస్టిట్యూట్ 2021 నివేదిక పేర్కొన్నది. కనుక దేశాభివృద్ధికి మహిళా కార్మిక భాగస్వామ్యం పెంచడం అత్యవసరం.
నైతిక విద్యకు స్థానం లేకపోవడంతోనే
ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికల విషయంలో తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రతి మహిళ తన సన్నిహితుల వలనో, కుటుంబ సభ్యుల వలనో ప్రతీ 11 నిమిషాలకు ఒకరు హత్యకు గురవుతున్నారు. అలాగే ఆన్‌లైన్ ద్వారా బాలికలు ఎంతో హింసను ఎదుర్కొంటున్నారని తెలిపింది. ఇవి రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. అలాగే ప్రేమోన్మాదుల వేధింపులు ఎక్కువయ్యి అనేకమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత ఏడాది రాష్ట్రంలో మహిళలపై 2,126 అత్యాచార సంఘటనలు జరుగగా, 181 హత్యలు, 40 వరకట్న హత్యలు, 9,071 గృహహింస కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్ దొరకడం, మద్యం మత్తులో సైతం మహిళలపై అఘాయిత్యాలు పెరగటానికి కారణమవుతున్నాయి. ఇటీవల వరంగల్‌లో మెడికో ప్రీతీ విద్యార్థిని ర్యాగింగ్ కారణంతో బలవన్మరణానికి పాల్పడింది. ఇది హత్య? లేదా ఆత్మహత్య అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విద్యాలయాల్లో అమ్మాయిలపై సాటి విద్యార్థులు, టీచర్లు సైతం లైంగిక వైధింపులకు పాల్పడటం ఎక్కువైంది. వీటికి భయపడి ఆడపిల్లలను చదివించటానికి తల్లిదండ్రులు వెనకాడుతున్నారు. ఇది మహిళలకు తీవ్ర నష్టం చేకూర్చుతుంది. తమపై జరుగుతున్న దాడులకు భయపడకుండా వాటిపై పోరాటం చేయాలి. ఆత్మహత్యా ప్రయత్నాల వంటి ఆలోచనలకు దూరంగా ఉండాలి. తల్లిదండ్రులు సైతం లైంగిక వేధింపుల సమయంలో భయపడకుండా ఏవిధంగా వ్యవహరించాలనేదానిపై పిల్లలకు అవగాహన కల్పించాలి. పిరికితనంతో ఆత్మహత్యల వైపు వెళ్లవద్దని, వీటిని ధైర్యంగా ఎదుర్కోవాలని పిల్లలకు బోధించాలి.
మహిళలపై నేరాలు జరిగినప్పుడు కఠిన శిక్షల గురించి మనం మాట్లాడుతున్నాం. కానీ అసలు నేరాలే జరగకుండా చూడాల్సిన విధానంపై చర్చ జరగడం లేదు. పాఠ్య పుస్తకాల్లో సైతం నైతిక విద్యకు స్థానం కల్పించాలి. తాము తప్పు చేస్తే జరిగే పరిణామాల గురించి ప్రత్యేకించి మగ పిల్లలకు వివరించాలి. ప్రస్తుత విద్యా విధానంలోనే చాలా లోపమున్నది. విద్యార్థులకు ర్యాంకులు, ఉద్యోగాలు, ధన సంపాదన గురించి చర్చించడం తప్ప పిల్లల వ్యక్తిత్వ వికాసం గురించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆలోచించకపోవడం, బోధించకపోవడం పిల్లల చెడు నడతకు కారణమవుతున్నాయి. సమాజం మొత్తం దీనికి బాధ్యత వహించాలి.
కాట్రగడ్డ ప్రసూన
టీడీపీ మాజీ ఎమ్మెల్యే