అదానీ వ్యాపార సామ్రాజ్యంలో కల్లోలం

article on Adani Enterprises Share losses by kolahalam ramkishore

Update: 2023-01-30 18:45 GMT

గౌతమ్ అదానీ 1988లో చిన్న ఎగుమతి, దిగుమతుల కంపెనీతో వ్యాపారం ప్రారంభించిన అదానీకి 1991 నుండి మన దేశంలో ప్రారంభం అయిన సరళీకరణ ఆర్థిక విధానాలు వ్యాపార రంగంలో మంచి ఊపునిచ్చాయి. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ వచ్చాక అదానీ ప్రభ వెలిగి పోయింది. తిరిగి మోడీ ప్రధాని పదవిని అధిష్టించగానే అదానీ వ్యాపారం సామ్రాజ్యం అవధులు దాటింది. రవాణా రంగంలో ముఖ్యమైన రోడ్లు, రైల్వేలు, ఎయిర్ పోర్టులు, నౌకా పోర్టులు, విద్యుత్తు, బొగ్గు, గ్యాస్, రియల్-ఎస్టేట్, ఇలా దాదాపు అన్ని మౌలిక వర్తక, వాణిజ్య రంగాలు అదానీ వశమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా ఇంత తక్కువ కాలంలో ప్రపంచ కుబేరుడి స్థాయికి ఎదగడం అసాధ్యం. శ్రీలంక, బంగ్లాదేశ్‌లో అదానీ వ్యాపార విస్తరణకు మోడీ సర్కారు తోడ్పాటే కారణమని గతంలో వార్తలు వచ్చాయి. అందుకే ప్రపంచంలో అపర కుబేరుడిగా, మూడవ స్థానంలో నిలిచిన అదానీ భారత వ్యాపార సామ్రాజ్యంలో తిరుగులేని సంపన్న దిగ్గజంగా గణతికెక్కారు. ఆయన వ్యాపార నైపుణ్యాలను పత్రికలు, మీడియా ఆకాశానికి ఎత్తాయి. ఆయన ఘనకీర్తిని పొగడని వారు లేరు.

ఆయనపై ఉన్న అనుమానాలు..

గత సంవత్సర కాలంగా అదానీ గ్రూప్ స్టాక్స్ మదుపర్లను లాభాల్లో ముంచెత్తాయి. ఇదీ, అదీ అని కాకుండా స్టాక్ మార్కెట్‌లో నమోదైన స్టాక్స్ అన్నీ మదుపర్లకు మంచి లాభాలను అందించాయి. కానీ కొందరు వ్యాపార వేత్తలు, ఆర్థిక నిపుణులు ఆయన వ్యాపార లావాదేవీలపై అడపాదడపా కొన్ని అనుమానాలు చాటుమాటుగా వ్యక్తం చేసినా ఎవ్వరూ వాటిని లెక్కపెట్టలేదు. ఆ అనుమానాల్లో కొన్ని ఏమిటంటే.. అదానీ గ్రూపులోని ఏడు ప్రధాన కంపెనీల షేర్లును కృత్రిమంగా ధరలు పెంచుతున్నాయని, వాటిని బ్యాంకులలో తాకట్టుపెట్టి ఇబ్బడిముబ్బడిగా అప్పులు తీసుకుంటున్నారనీ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇతర వ్యాపార దిగ్గజాలను వెనక్కు నెట్టి టాక్స్‌లు ఎగవేస్తున్నారని, ఇలాంటి వారిని ప్రోత్సహించే సింగపూర్, మారిషస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కరేబియన్ దీవులలో డొల్ల కంపెనీలు తెరిచి అక్రమంగా మనీలాండరింగ్ పద్ధతుల్లో నల్లధనాన్ని వైట్ మనీగా మారుస్తున్నాయని, ఇలాంటి అక్రమాల వల్లే అదానీ గ్రూపు షేర్లు అమాంతం 819 శాతానికి ఎగబాకాయని ఇతర పోటీ వ్యాపార వర్గాల్లో గుసగుసలు వెలువడ్డాయి. కేవలం స్వల్ప కాలంలోనే మూడేళ్ళ క్రింద అదానీ గ్రూపు షేర్ల విలువ 1.62 లక్షల కోట్ల నుండి 9.78 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే 8.1 లక్షల కోట్లు అసాధారణ స్థాయిలో పెరగడం, ఇతర వ్యాపార వర్గాలను, ఆర్థిక నిపుణులను సైతం విస్మయానికి గురిచేసింది. ఒకవైపు కరోనా విలయతాండవం చేస్తున్న రోజుల్లో కూడా అదానీ ఆదాయం ఏమాత్రం తగ్గకపోగా మరింత లాభాలతో విజృంభించింది.

నిజాలను దాచగలరా..

సరైన ఆధారాలు లభించక కేవలం అసూయతో తోటి వ్యాపారుల నిరాధార ఆరోపణలుగా అందరూ వీటిని భావించారు. కానీ ఒక్కసారిగా ఈ లాభాల జైత్రయాత్రకు బుధవారం భారీ బ్రేక్ పడింది. షేర్ల విలువ పెంచడంలో అదానీ గ్రూపు అవకతవకలకు పాల్పడుతున్నట్లు అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిడెన్ బర్గ్ ఇచ్చిన నివేదిక దీనికి కారణం. 32 వేల పేజీల ఆ నివేదిక మదుపర్లకు రూ.4 లక్షల కోట్ల నష్టాల్ని మిగిల్చింది. హిడెన్ బర్గ్ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్ కంపెనీలు బుధవారమే రూ.లక్ష కోట్ల మార్కెట్ విలువను కోల్పోయాయి. శుక్రవారం కూడా అదానీ గ్రూపు షేర్ల విలువ పతనం ఆగలేదు. మొత్తం పది నమోదిత సంస్థల్లో ఏడు కంపెనీల షేర్లు భారీ నష్టాన్ని చవిచూశాయి. దీనితో రెండు వరుస సెషన్లలో అదానీ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 4 లక్షల కోట్లకు పైగా నష్టం చవిచూసింది. అదానీ గ్రీన్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్ మిషన్ షేర్లు 20 శాతానికి పైగా నష్టపోయాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్ 18 శాతం నష్టపోయింది. ఇటీవలే అదానీ గ్రూపులో చేరిన అంబుజా సిమెంట్స్ షేర్లు 17.33 శాతం (షేరు విలువలో సుమారు నాలుగో వంతు) నష్టపోయింది. అదానీ పవర్ 5 శాతం, యన్.డి. టివి షేర్ 4.99 శాతం పతనమై లోయర్ సర్క్యూ‌ట్‌ను తాకాయి.

మరోవైపు అదానీ ఎంటర్ ప్రైజెస్ రూ. 20 వేల కోట్ల మలి విడత పబ్లిక్ ఆఫర్ (FPO) ఈరోజే మొదలైంది. తాజా ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం రిటైల్ మదుపరులు పెద్దగా ఆసక్తి చూపలేదు. అదానీ గ్రూపులో అనేక కంపెనీలు సుమారుగా 20 శాతం వరకు నష్టాన్ని చవి చూశాయి. సెన్సెక్స్ 874 పాయింట్లు పతనం చెందాయి. ఇంట్రాడేలో 1200 డౌన్ అయ్యింది. రెండు రోజుల్లో రూ 11 లక్షల కోట్ల మార్కెట్ సంపద ఆవిరైంది. హిడెన్ బర్గ్ నివేదికతో మదుపర్లలో అదానీ గ్రూప్‌పై అనుమానాలు రేకెత్తించింది. అదానీకి వ్యక్తిగతంగా రూ.1.84 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. మొత్తం అదానీ గ్రూపు సంస్థల అప్పులు 2 లక్షల కోట్లకు పైగా ఉంటాయి. ఈ అప్పుల్లో కూడా దేశీయ బ్యాంకుల నుండి 81.200 కోట్లను అదానీ గ్రూపు తీసుకుంది.

డోలాయమానంలో మదుపరులు

అయితే హిడెన్ బర్గ్ ఆరోపణలు నిరాధారమనీ అదానీ గ్రూప్ తీవ్రస్థాయిలో ఖండించింది. దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అదానీ గ్రూప్ లీడ్ హెడ్ జతిన్ జలుంధ్వాలా ప్రకటించారు. అదానీ గ్రూప్ అవకతవకలపై అమెరికా పరిశోధనా సంస్థ హిడెన్ బర్గ్ చేసిన ఆరోపణలు అటు స్టాక్ మార్కెట్లతో పాటు ఇటు రాజకీయ వర్గాలలోనూ దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. మొత్తం మీద మదుపరుల గుండెలు ఆగే పరిస్థితులు వచ్చాయి. మన దేశ ఆర్థిక పరిస్థితులు అసలే బాగోలోవు. అతి తక్కువ కాలంలో అదానీ వ్యాపార సామ్రాజ్య విస్తరణకు మన కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకారం లేకపోతే వర్తక, వ్యాపార రంగంలో ఈ స్థాయిలో మోసాలకు ఆస్కారం ఉండదని ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తిత్వం చేస్తున్నాయి.

డాక్టర్ కోలాహలం రామ్‌కిశోర్

98493 28496

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinion@gmail.com, వాట్సప్ నెంబర్ 7995866672

Also Read...

ప్రశ్నించే గొంతుకను మండలికి పంపుదాం 


Tags:    

Similar News