ఏ దిక్కూ లేని ఏఆర్ పోలీసులు

Armed rifle police who have no direction

Update: 2024-04-11 01:15 GMT

నలభై ఏళ్ల కిందటనే "ముప్పైయేండ్లు నిండిన గానీ మూడుపట్టీలు రాకపాయేరో ఓ పోలీసన్నా" అంటూ ప్రముఖ వాగ్గేయకారుడైన గద్దరన్న బృందం పాట రూపంలో చెప్పారు. ఇదంతా నేటికీ మారనీ కానిస్టేబుల్ పరిస్థితికి అద్దం పడుతుంది. ప్రభుత్వాలు ఎన్ని మారినప్పటికీ నేటికీ తెలుగు నాట పోలీసుశాఖలో పని చేస్తున్నటువంటి ఏఆర్ పోలీసులకు కన్వర్షన్ వంటి సమస్యలపై ఎలాంటి న్యాయం జరగలేదు.

వివిధ రకాలుగా రక్షణగా నిలుస్తున్న ఏఆర్ విభాగపు పోలీసులకు ఎవరూ దిక్కులేరనే చెప్పుకుని తీరాలి. ఈ శాఖలో అనేక రకాలైన వివక్షా పూరితమైన సిస్టం వీరిపట్ల అమలౌతూవుంటుంది. రాష్ట్రంలో మిగతా పోలీసులతో పోల్చుకుంటే వీరికి మాత్రమే అన్యాయం జరుగుతూనే ఉంటుంది. వీరి పక్షాన మాట్లాడి న్యాయం చేసిన ప్రభుత్వాలు లేవు. వీరి కోసం గొంతు విప్పిన ప్రజాప్రతినిధి గానీ లేదా మానవతావాది కూడా ఏ ఒక్కరూ లేరనే చెప్పుకోవాలి.

ఇతర పోలీసులతో పోలిస్తే..

చాలామందికి పోలీసు అనగానే అందరూ స్టేషన్లో పనిచేసేవారే అనుకుంటారు. కానీ ఇందులో నానారకాల పోలీసులు ఉంటారనేది పచ్చి నిజం. రాష్ట్ర పోలీసు శాఖకు కూడా భర్తీ విధానం ఈ మూడు వింగ్స్ నుండే జరుగుతుంది. ఒకరు శాంతి భద్రతల విభాగం పోలీసులు, మరొకరు స్పెషల్ పోలీసులు... వీరినే బెటాలియన్ పోలీసులు అంటారు. ఇక మూడో వింగ్‌కి చెందినవారు ఏఆర్ పోలీసులు. వీరు జిల్లా ఆర్ముడ్ పోలీసుగా విధులు నిర్వహిస్తూ ఉంటారు. ప్రధానంగా వీరు జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఆస్తులకు, ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించడం, ఖైదీలకు, వీఐపీలకు, వీవీఐపీలకు ఎస్కార్ట్ విధులు నిర్వహిస్తూ ఉంటుంటారు. చిత్రమో లేక విచిత్రమో గానీ వివిధ రకాలుగా రక్షణగా నిలుస్తున్న ఏఆర్ విభాగపు పోలీసులకు ఎవరూ దిక్కులేరనే చెప్పుకుని తీరాలి.

జిల్లా ఆర్ముడ్‌గా విధులు నిర్వహించే పోలీసులకు ఎలాంటి ప్రత్యేక పరపతి లేకపోగా వీరు కేవలం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటారు. పోలీసు వాహనాలకు డ్రైవర్లుగా, ప్రజాప్రతినిధులకు గన్‌మెన్లుగా, ప్రభుత్వ సంస్థలకు గార్డు విధులు నిర్వహిస్తూ ఉంటారు. వీరికి రాష్ట్రంలో మిగతా పోలీసులతో పోల్చుకుంటే వీరికి మాత్రమే అన్యాయం జరుగుతూనే ఉంటుంది.

కన్వర్షన్ విధానంలో తీవ్ర అన్యాయం

ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని ఏఆర్ పోలీసులకు జరుగుతున్న అన్యాయంలో అతి పెద్దది కన్వర్షన్ విధానం. ఏఆర్ విభాగంలోకి కన్వర్షన్ ద్వారా వచ్చే బెటాలియన్ పోలీసులకు(స్పెషల్ ) కేవలం పది సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకుని ఉంటే సరిపోతుంది. ఇదే ఏఆర్ పోలీసులు శాంతి భద్రతల (సివిల్) విభాగంలోకి పోవాలంటే నలభై సంవత్సరాల వయస్సు నిండినవారై ఉండాలట. ఇదెక్కడి న్యాయం!? అంటే పద్దెనిమిది సంవత్సరాల వయస్సులో ఏఆర్ విభాగంలో భర్తీ అయిన పోలీసు కానిస్టేబుల్ సివిల్ పోలీసులోకి కన్వర్షన్ పోవాలంటే దాదాపుగా 22 సంవత్సరాలపాటు సర్వీసు పూర్తి చేసుకుని ఉండాలి. అదే స్పెషల్ పోలీసు వాళ్ళ ఏఆర్ విభాగంలోకి కన్వర్షన్ ద్వారా రావాలంటే కేవలం పది సంవత్సరాల సర్వీసు ఉంటే చాలునట. ఇదెక్కడి పోలీసు నీతి!? సరే పోనీ ఇదే పద్ధతి స్పెషల్ పోలీసుల్లో గానీ లేదా ఏఆర్ విభాగంలో భర్తీ అయినటువంటి ఆఫీసర్లకు ఉండదు. కేవలం ఈ విభాగాలలో భర్తీ అయినటువంటి ఆర్ఎస్ఐలకు (రిజర్వుడు సబ్-ఇన్‌స్పెక్టర్) కేవలం ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తిచేసుకుని ఉంటే చాలు, డైరెక్ట్‌గా వీరిని సివిల్ పోలీసు విభాగంలోకి కన్వర్షన్ ద్వారా అనుమతినిస్తారు. మరీ ఇదెక్కడి ధర్మం!?

వీరి జీవితాలపై తూటా పేలుస్తూ..

ఇదంతా ఇలా ఉంటే కానిస్టేబుల్‌గా భర్తీ ఆయినవారికి ప్రమోషన్లు అనుకున్న సమయంలో రానే రావనేది గత నలభై యేండ్ల కిందటనే "ముప్పైయేండ్లు నిండిన గానీ మూడు పట్టీలు రాకపాయేరో ఓ పోలీసన్నా" అంటూ ప్రముఖ వాగ్గేయకారుడైన గద్దరన్న బృందం పాటరూపంలో చెప్పారు. ఇదంతా నేటికీ మారనీ కానిస్టేబుల్ పరిస్థితికి అద్దం పడుతుంది. ప్రమోషన్లు రాకపోవడం ఒక బాధైతే ఈ కన్వర్షన్ విధానంలో కేవలం ఏఆర్ కానిస్టేబుల్ వారికి వయస్సు పరిమితిని అమలు చేస్తూ వీరి వయస్సు పైన, కన్వర్షన్ ఆశలపైన, క్లీన్ సర్వీస్ రికార్డుల పేరిట ఏఆర్ కానిస్టేబుల్ జీవితాలపైన మరొక తూటాను ఎక్కుపెట్టి డిపార్ట్‌మెంట్ పెద్దలు పేల్చుతూనే ఉన్నారు.

జీవో వచ్చినా అమలు కాలేదు

అన్ని విభాగాల్లో పని చేస్తున్నటువంటి కానిస్టేబుల్ కిందిస్థాయి ఉద్యోగులకు రక్షణ నిలుస్తున్నటువంటి జీ.వో నెం.679 అనేది అసలు అమలుకే నోచుకోని పరిస్థితి ఉన్నది. ఈ జీవో ప్రకారం సస్పెన్షన్ వంటి పరిస్థితి సదరు పోలీసు ఎదుర్కొంటున్నపుడు ఓరల్ ఎంక్వరీ పేరిట సంవత్సరాల తరబడి కాలయాపన చేయకుండా వెంటనే మూడు నెలల కాలపరిమితి లోపల తగు న్యాయం చేయాల్సిందిగా 2008 నవంబర్ 1న ఆనాటి ప్రభుత్వ కార్యదర్శి అయిన రమాకాంత్ రెడ్డి ఈ జీవోను ఇచ్చారు. ఈ జీవో ప్రకారమైనా న్యాయం జరిగిన లేదా పొందిన కిందిస్థాయి పోలీసులు లేరనే చెప్పుకోవాలి. ఇలాంటి పరిస్థితి ఉండటం వలన పనిష్మెంట్ అనేది పెండింగ్‌లో ఉండటం వలన కన్వర్షన్ సమయంలో ఏఆర్ పోలీసులకు ఇదికూడ మరొక శాపంలా మారిపోయింది. గత ప్రభుత్వాలు ఎన్ని మారినప్పటికీ తెలుగు నాట పోలీసు శాఖలో పని చేస్తున్నటువంటి ఏఆర్ పోలీసులకు ఎలాంటి న్యాయం జరగలేదు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వమైనా ఏఆర్ పోలీసులకు కన్వర్షన్ వయోపరిమితిని తగ్గించాలి. అలాగే ఎలాంటి పనిష్మెంట్ ఉన్నప్పటికీ కన్వర్షన్‌కు అడ్డురాకుండా వేలాధిమంది ఏఆర్ పోలీసులకు న్యాయం చేస్తుందేమో వేచి చూడాలి.

వరకుమార్ గుండెపంగు

సామాజిక కార్యకర్త

99485 41711

Tags:    

Similar News