జేపీఎస్‌లకు..ఇంకెన్ని పరీక్షలు?

Are these conditions for regularization of Junior Panchayat Secretaries?

Update: 2023-07-18 00:00 GMT

సాధారణంగా ప్రభుత్వ పోటీ పరీక్షలలో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. కానీ నెగిటివ్ మార్కింగ్ ఉన్నా, పోటీ పరీక్షలో ఒక అభ్యర్థి విజయం సాధించాడంటేనే ఆ అభ్యర్థి అదృష్టంతో కాకుండా అన్ని రకాలుగా ఆలోచించే తెలివితేటలతో పరీక్షలో నెగ్గాడని అర్థం. రాష్ట్రం పరిధిలో నిర్వహించే పోటీ పరీక్షల్లో నెగిటివ్ మార్కింగ్ విధానం అమలు చేయడం చాలా అరుదు. నోటిఫికేషన్లు లేని సమయంలో పెద్ద దిక్కుగా విడుదలైన జూనియర్ పంచాయతీ సెక్రటరీ పరీక్షకు లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి. పరీక్ష కఠినంగా ఉన్నప్పటికీ అందులో గెలిచి, తమ చదువుకు, స్థాయికి తగినది కాదనిపించినా ప్రభుత్వోద్యోగం మీద ఇష్టంతో, ఎన్నో ఆశలతో 9355 మంది ఉద్యోగాల్లో చేరారు. ఈ కఠినమైన పరీక్ష గెలిచాం కదా... ఇక మాకు ఏ సమస్యా ఉండదు, హ్యాపీగా పనిచేస్తూ, గ్రామాల్లో సేవ చేస్తూ ఆనందంగా ఉండొచ్చని వాళ్లంతా అనుకున్నారు. కానీ అది భ్రమగానే మిగిలింది. వృత్తి నిర్వహణలో దాని కంటే కఠినమైన పరీక్షలను వాళ్లు ఎదుర్కొన్నారు. వాటిని కూడా అధిగమించి నాలుగేళ్లు పని చేసి, మొన్న పదిహేను రోజులు సమ్మె చేశారు. సమ్మె విరమించిన తర్వాత కమిటీ అని, రెగ్యులరైజేషన్ అని ప్రభుత్వం శుభవార్త చెప్పినప్పటికీ, ఇప్పుడు మదింపు ప్రక్రియ అంటూ మరో పరీక్షకు సిద్ధం చేస్తుండటంతో ఇంకెన్నాళ్లీ పరీక్షలు అంటూ బాధపడుతున్నారు.

నాలుగేళ్ల శ్రమ.. అంచనా ఎలా?

ఈ కమిటీ ద్వారా నిర్వహించబోతున్న ఈ మదింపు పక్రియలో ఒక్కో పనికి కొన్ని మార్కులు కేటాయించారు. కాబట్టి దీన్ని కూడా ఒక రకమైన పరీక్ష అనడంలో ఏమాత్రం తప్పు లేదు. అయితే ఈ పరీక్ష ప్రమాణాలు మాత్రం జేపీఎస్‌ల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. రోడ్లు, మురికి కాల్వలు, ప్రభుత్వ కార్యాలయాల పరిశుభ్రత, దోమల నిర్వహణ, రికార్డుల నిర్వహణ, క్రీడా ప్రాంగణం నిర్వహణ, నర్సరీ నిర్వహణ, చెత్త నిర్వహణ లాంటి వాటికి మార్కులు ఇస్తుండటంతో వీటి ద్వారా పనిని ఎలా అంచనా వేస్తారని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, ఇవి చాలా డైనమిక్ పనులు. కమిటీ సందర్శించడానికి ఓ పది రోజుల ముందు నుండి కష్టపడినా సరే, ఈ పనులన్నింటినీ అద్భుతంగా చేసేయవచ్చు. మరి నాలుగేళ్ల వారి శ్రమను ఇలాంటి పనులతో అంచనా వేయాలనుకోవడం ఎంతవరకు సబబు అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది.

ఇది మాత్రమే కాకుండా ఒకటి కంటే ఎక్కువ గ్రామపంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఈ మదింపు ప్రక్రియ గురించి మరింత ఆందోళనగా ఉన్నారు. ఒక్కటే గ్రామపంచాయతీలో పనిచేసిన వారితో పాటుగా కాకుండా, వీరి పనితనాన్ని బేరీజు వేయడానికి రెండు లేదా మూడు జీపీలను లెక్కిస్తే పరిస్థితితేంటని వాపోతున్నారు. అలాగే గత నాలుగేళ్లలో బదిలీల కారణంగా జీపీలు మారిన వారు కూడా ఈ విషయమై ఆందోళన చెందుతున్నారు. స్పష్టమైన సూచనలు విడుదల చేయకుండా కేవలం మార్కుల విషయాన్ని మాత్రమే సర్క్యులర్ ద్వారా తెలియజేయడంతో ఏం చేయాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు.

కొందరినే.. రెగ్యులరైజ్ చేస్తారా?

అలాగే మదింపు ప్రక్రియలో పొందుపరిచిన అంశాలన్నీ కూడా దాదాపుగా జేపీఎస్ ప్రమేయం లేకుండా సర్పంచ్‌లు, నిధుల అందుబాటు మీద ఆధారపడి అభివృద్ధి చేయాల్సినవే కావడంతో ఈ పనులు సరిగా లేకపోతే తమ భవిష్యత్తుపై ప్రభావం పడటంపై జేపీఎస్‌లు అసంతృప్తిగా ఉన్నారు. అంతేకాకుండా కేవలం నాలుగేళ్లు పూర్తయినవారు మాత్రమే మదింపు పక్రియకు అర్హులు అనడం, మూడింట రెండు వంతులు మార్కులు తప్పనిసరి అనడం కూడా జేపీఎస్‌లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నాలుగేళ్లు పూర్తి చేసుకున్నవారు కేవలం 5600 మంది ఉన్నారు, ఈ మదింపు ప్రక్రియ ద్వారా వారిలో కొందరిని రెగ్యులర్ చేయకపోతే పరిస్థితితేంటని ప్రశ్నిస్తున్నారు.

ఏదేమైనా ఈ జూనియర్ పంచాయతీ సెక్రటరీలు ఏ మూహుర్తానా పరీక్ష రాశారో గానీ, వారి వృత్తిలోనూ, కెరీర్‌లోనూ, చివరికి కష్టానికి తగిన ఫలితం పొందడంలోనూ అనేక రకాల పరీక్షలను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ మదింపు ప్రక్రియ అనంతరం, ఇన్ని పరీక్షలను ఎదుర్కున్న వీళ్లు రెగ్యులరైజ్ అయ్యాక ఇంతే నిబద్ధతతో పనిచేస్తారా లేదా అన్నది కొసమెరుపు. అంతేకాకుండా ఈ మదింపు ప్రక్రియ విధివిధానాలు సరిగ్గా లేని కారణంగా నిజాయతీగా నాలుగేళ్లు పనిచేసిన వారికి అన్యాయం జరిగే అవకాశం కూడా ఉందంటూ పంచాయతీ సెక్రటరీల వర్గం అభిప్రాయపడుతోంది. అందుకే ప్రభుత్వం వారి మదింపు ప్రక్రియలో కొన్ని మినహాయింపులివ్వాలని, అందరిని క్రమబద్ధీకరించాలని వారు కోరుకుంటున్నారు.

- చిలుక కరుణాకర్,

టీఈఏ పీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు

9948951280

Tags:    

Similar News