అతి విశ్వాసమా, ఆత్మ విశ్వాసమా
Are the parties overconfident or self-confident about winning the elections?
మే 13న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో మేమంటే మేము గెలుస్తామని వైసీపీ, కూటమి పార్టీలు, నాయకులు ఎవరికి వారే తాము అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్నారు. కానీ తటస్థ ఓటర్ల ప్రాధాన్యత పెరిగిన ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అంతుచిక్కడం లేదు. 2019 ఎన్నికలను మించి ఈ ఎన్నికల్లో 2.09 శాతం అధికంగా ఓటింగ్ జరగడం విశేషం. గత ఎన్నికలను మించి ఈ ఎన్నికల్లో ఒక్క శాతం అధికంగా ఓటింగ్ జరిగినా ప్రభుత్వ వ్యతిరేకత పనిచేసినట్లుగా భావించాల్సి వుంటుందని రెండు తెలుగురాష్ట్రాల ప్రజలలో విశ్వసనీయత కలిగిన ప్రముఖ సర్వే సంస్థల అధిపతులు కొందరు ఎన్నికల అనంతరం తెలియ చేశారు. ఈ పరిణామంతో కూటమి అధికారంలోకి వస్తుందని, ఆంధ్రప్రదేశ్‌లో కోట్లాది రూపాయలు బెట్టింగ్ జరిగినట్లు బలంగా వార్తలు వస్తున్నాయి.
ఏపీలో కూటమి చాలా వరకు సైలెంటుగా ఉన్నప్పటికీ, తమ పార్టీ 2019 ఎన్నికల నాటి ఫలితాలు కంటే మెరుగైన పలితాలతో తిరిగి అధికారంలోకి వస్తుందని జగన్ చెబుతుండడం గమనార్హం. జగన్ అతి విశ్వాసంతో చెపుతున్నారా లేక కచ్చితమైన సమాచార సేకరణ వలన కలిగిన ఆత్మ విశ్వాసంతో చెపుతున్నారా అనేది రాజకీయ విశ్లేషకులకు సైతం అర్థం కావడం లేదు.
ఆనాటి విశ్వసనీయత ఉందా?
ఎన్నికల అనంతరం వైసీపీ అధ్యక్షులు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడలోని ఐ ప్యాక్ సంస్థ ఆఫీసును సందర్శించిన సమయంలో ఈ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కరాఖండీగా చెప్పారు. తమ పార్టీకి 2019 ఎన్నికల్లో వచ్చిన స్థానాల కన్నా ఎక్కువ స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పైగా ఈ ఎన్నికల్లో తమ పార్టీకి వచ్చే ఫలితాలు చూసి దేశం యావత్తు షాక్‌కు గురవుతుందని మాటల తూటాలు పేల్చి జగన్ తన ప్రత్యర్ధులకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. జగన్ మాటలను 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు విశ్వసించి ఆ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి 151 శాసనసభ స్థానాలు. 22 పార్లమెంట్ స్థానాలు ఇచ్చారు. ఆయన మాటలకు ప్రజలలో 2019 ఎన్నికలప్పటి విశ్వసనీయత ఉందా, లేదా అని తెలియాలంటే ఈ ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాలి.
రాష్ట్ర భవిష్యత్తు కోసం ఓటు కాదు
అదే సమయంలో రాబోయే ఎన్నికల ఫలితాలపై జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలలో, అన్ని రాజకీయ పార్టీలలో తీవ్ర చర్చకు దారితీసాయి. ఆ వ్యాఖ్యలను అతి విశ్వాసంతో చేశారా లేక కచ్చితమైన సమాచార సేకరణ వలన కలిగిన ఆత్మ విశ్వాసంతో చేశారా అనేది సెఫాలజిస్టులకు, రాజకీయ విశ్లేషకులకు సైతం అర్థం కావడం లేదు. గతానికి భిన్నంగా ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌మోహన్ రెడ్డి కేంద్రంగా జరిగాయనేది నిర్వివాదాంశం. ఏపీలో ఈ పర్యాయం కులాల వారీగా, వర్గాల వారీగా చీలిపోయి ప్రజలు ఓట్లు వేశారు. వారిలో జగన్ ప్రభుత్వం గత అయిదేళ్లలో తమకు చేసిన మేలుకు ప్రతిఫలంగా మళ్ళీ జగనే ముఖ్యమంత్రి కావాలి అని ఒక వర్గం వారు ఓట్లు వేస్తే.. ఇంకొక వర్గం మాత్రం జగన్ మళ్ళీ వస్తే తమకు ఇబ్బంది అని ఓట్లు వేశారు. అంతే కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేశారు అనుకోవడం కచ్చితంగా తప్పు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఎన్నడూ లేనంతగా ఇరువర్గాల ఓటర్లు అమెరికా, కువైట్ లాంటి దేశాలతో పాటూ హైదరాబాద్, బెంగళూరు, ముంబై, పూణే లాంటి సుదూర ప్రాంతాల నుంచి లక్షలాది మంది వారి స్వగ్రామాలకు తరలి వచ్చారు. ఈ విధంగా బయట ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు ఓట్లు వేసేందుకు వచ్చిన వారిలో కూటమి సానుభూతిపరులైన ఓటరులే అధికంగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
లబ్ధిదారుల ఓట్లే గెలిపిస్తాయా?
ఈ ఎన్నికల్లో గతానికి భిన్నంగా ఈ ఎన్నికల్లో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు, మధ్యతరగతి ప్రజలు, స్త్రీలు, వృద్ధులు, ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలు అధికంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈ వర్గాలలో తమ ప్రభుత్వం వలన నూరు శాతం కుటుంబాలు లబ్ది పొందినందువలన వారంతా తమ పార్టీకే ఓట్లు వేశారని వైసీపీ నాయకులు తెలియచేస్తున్నారు. అదే విధంగా యువకులు, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుతో ప్రయోజనం పొందిన రైతులు, రాష్ట్రంలో నెలకొల్పిన సచివాలయాలు, వాలంటీర్ల వలన ప్రయోజనం పొందుతున్న ఒక వర్గం ప్రజలు అధికంగా ఈ పర్యాయం తమ పార్టీకే ఓట్లు వేసినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు.
ఈ గణాంకాల ప్రాతిపదికనే 2019 ఎన్నికలను మించి తమ పార్టీకి ఈ ఎన్నికల్లో స్థానాలు లభిస్తాయని జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో గౌరవ ప్రదమైన స్థానాలతో అధికారంలోకి మళ్ళీ వైసీపీ పార్టీ గెలిస్తేనే.. జగన్ మోహన్ రెడ్డి మాటలకు ప్రజలలో గతంలో ఉన్న విశ్వసనీయత బలపడే అవకాశం ఉంటుంది. ఫలితాలు తారుమారై కూటమి అధికారంలోకి వస్తే జగన్‌మోహన్ రెడ్డి మాటలకు ప్రజలలో విశ్వసనీయత మొత్తం కోల్పోయి తద్వారా వైసీపీ ఉనికికే ప్రమాదం ఏర్పడే పరిస్థితులు ఉద్భవించవచ్చని కచ్చితంగా చెప్పవచ్చు.
కైలసాని శివప్రసాద్
సీనియర్ జర్నలిస్ట్
94402 03999