సుప్రీం రీజనల్ బెంచీలు సాధ్యమేనా?
భారత సర్వోన్నత న్యాయస్థానం మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ తన పదవీ విరమణ చివరి రోజు కోర్టు ప్రొసీడింగ్స్‌ను
హైకోర్టులో న్యాయం దక్కని బాధితులు సుప్రీం కోర్టు గడప తొక్కుతున్నారు. దేశం నలుమూలల నుండి వేల కేసులు పెండింగ్‌లో ఉండటంతో సత్వర న్యాయం జరగడంలేదు. దేశానికి స్వాతంత్రం వచ్చి ఇటీవలే వజ్రోత్సవాలు జరుపుకోవడం శుభపరిణామం. వజ్రోత్సవాలు జరుపుకున్న దేశంలో న్యాయం కోసం సుప్రీంకోర్టుకు రావడానికి ఎంతో వ్యయం, ప్రయాస ఉండటం దురదృష్టకరం. ప్రజలకు మెరుగైన పాలన అందించి, భారాన్ని తగ్గించవలసిన బాధ్యత పాలకులదే. కనుక యుద్ధ ప్రాతిపదికన చొరవ తీసుకొని సుప్రీంకోర్టు ప్రాంతీయ బెంచీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.
భారత సర్వోన్నత న్యాయస్థానం మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ తన పదవీ విరమణ చివరి రోజు కోర్టు ప్రొసీడింగ్స్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయించి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఈ నిర్ణయం ప్రజల చెంతకు న్యాయం చేర్చేందుకు తీసుకుంటున్న చర్యలలో భాగంగానే భావించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిని ఆహ్వానించవలసిన బాధ్యత దేశ ప్రజలపై ఉన్నది. అదే సమయంలో న్యాయ వ్యవస్థలో సుప్రీంకోర్టు రీజనల్ బెంచీలను ఏర్పాటు చేసి మరిన్ని సంస్కరణలు తీసుకువచ్చి బాధితులకు త్వరగా న్యాయం జరిగే అవకాశం కల్పించవలసిన అవసరం కూడా ఉంది.
ఆవిర్భావం నుంచి అంతే
1937 అక్టోబర్ 1 న దేశంలో ఫెడరల్ కోర్టు ఆఫ్ ఇండియా స్థాపన జరిగింది. స్వాతంత్య్రం అనంతరం 26 జనవరి 1950 న ఆర్టికల్ 124 ప్రకారం ఢిల్లీలో సుప్రీం కోర్టును నెలకొల్పారు. ఎనిమిది మంది న్యాయమూర్తులతో ప్రారంభమైన సుప్రీంకోర్టులో నేడు 34 మంది న్యాయమూర్తులు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సుమారు 2,500 మంది న్యాయవాదులు ఉన్నారు. 70 వేల పెండింగ్ కేసులు ఉన్నాయి. అందులో కొన్ని కేసులు దశాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉండడం ఆశ్చర్యకరం.
న్యాయమూర్తులకు, న్యాయవాదులకు ఇప్పటివరకు కూడా సరైన భవన సదుపాయాలు లేవు. దీనికి కారణం ఆవిర్భావం నుంచి ఇప్పటికీ కోర్టు పరిధి విస్తరించకపోవడమే. సుప్రీంకోర్టు ప్రారంభ సమయంలో దేశ జనాభా 36 కోట్లు. ప్రస్తుతం 133 కోట్లు. జనాభా ప్రకారం దేశ ప్రజలందరికీ న్యాయం జరగాలంటే కచ్చితంగా సుప్రీంకోర్టు పరిధి విస్తరించాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ పరిణామాన్ని ముందే ఊహించిన రాజ్యాంగ శిల్పి డా.బీఆర్ అంబేద్కర్ ఆర్టికల్ 130 ప్రకారం ఢిల్లీ దాటి సుప్రీం కోర్టును కాలానుగుణంగా విస్తరించవచ్చని అన్నారు.
వేల కేసులు పెండింగ్
ఇటీవల 18 వ లా కమిషన్ సుప్రీంకోర్టు ఉత్తర ప్రాంతంలోనున్న ఢిల్లీలో, దక్షిణ ప్రాంతంలో ఉన్న హైదరాబాద్ లేదా చెన్నయిలో, తూర్పు ప్రాంతాన ఉన్న కలకత్తా, పశ్చిమ ప్రాంతాన ఉన్న ముంబాయిలో ప్రాంతీయ బెంచీలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. పార్లమెంటులో కూడా కొందరు సభ్యులు ప్రైవేటు బిల్లు పెట్టారు. సుప్రీంకోర్టు ప్రాంతీయ బెంచీల ఏర్పాటుకు పార్లమెంటులో సాధారణ మెజారిటీ ఉంటే సరిపోతుంది. లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రపోజ్ చేస్తే దానిని రాష్ట్రపతి ఆమోదించినా ప్రాంతీయ బెంచీలను ఏర్పాటు చేసుకోవచ్చు.
నిజానికి హైకోర్టులో న్యాయం దక్కని బాధితులు సుప్రీం కోర్టు గడప తొక్కుతున్నారు. దేశం నలుమూలల నుండి వేల కేసులు పెండింగ్‌లో ఉండటంతో సత్వర న్యాయం జరగడంలేదు. దేశానికి స్వాతంత్రం వచ్చి ఇటీవలే వజ్రోత్సవాలు జరుపుకోవడం శుభపరిణామం. వజ్రోత్సవాలు జరుపుకున్న దేశంలో న్యాయం కోసం సుప్రీంకోర్టుకు రావడానికి ఎంతో వ్యయం, ప్రయాస ఉండటం దురదృష్టకరం. ప్రజలకు మెరుగైన పాలన అందించి, భారాన్ని తగ్గించవలసిన బాధ్యత పాలకులదే. కనుక యుద్ధ ప్రాతిపదికన చొరవ తీసుకొని సుప్రీంకోర్టు ప్రాంతీయ బెంచీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.
కైలసాని శివప్రసాద్
జర్నలిస్ట్, కాలమిస్ట్
94402 03999