మార్కులా...?గ్రేడ్ లా ...? విద్యార్థులకు ఏది ఉత్తమం
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే విద్యా సంవత్సరం(2025-26) నుండి పదో తరగతి విద్యార్థుల అభ్యసన స్థాయి మూల్యాంకనం కోసం ప్రస్తుతం ఉన్న గ్రేడింగ్
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే విద్యా సంవత్సరం(2025-26) నుండి పదో తరగతి విద్యార్థుల అభ్యసన స్థాయి మూల్యాంకనం కోసం ప్రస్తుతం ఉన్న గ్రేడింగ్ పద్ధతికి స్వస్తి పలికి మార్కింగ్ విధానాన్ని పునరుద్ధరించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. పాఠశాల విద్యలో విద్యార్థుల మూల్యాంకనం కోసం మార్కులా ..? గ్రేడ్ లా...? అనేది మరోసారి చర్చనీయ అంశం అయింది. ఈ రెండు పద్ధతుల లాభ నష్టాలను బేరీజు వేసుకునే ప్రయత్నం చేద్దాం.
నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) అమలుపై సమీక్ష జరగాలని చాలా రోజులుగా ఉపాధ్యాయులు కోరుతున్నారు.. సీసీఈ పద్ధతి కొనసాగిస్తారా లేదా రద్దు చేస్తారా? అనే దానిపై ప్రభుత్వం నుండి స్పష్టత లేదు. కానీ సీసీఈలో భాగమైన పరీక్షల (ఎఫ్ఏ, ఎస్ఏ)మార్కులను పరిగణనలోకి తీసుకోవడం లేదని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల్లో కేవలం 10 వ తరగతి మూల్యాంకనం గురించే ఉంది తప్ప మిగతా తరగతుల ప్రస్తావనే లేదు.
విద్యార్థుల వ్యక్తిత్వమే ప్రామాణికం!
మార్కులు, గ్రేడ్లు అసలు ప్రామాణికాలు కాదు విద్యార్థుల సమగ్ర అభివృద్దే ప్రామాణికం, వారి పరిపూర్ణ వ్యక్తిత్వమే ప్రామాణికం. మార్కుల కోసం ప్రైవేటు విద్యా సంస్థలు అక్రమాలకు పాల్పడుతున్నాయని, పిల్లలపై ఒత్తిడి ఎక్కువ అవుతుందని భావించి భారతదేశంలో 2009లో గ్రేడింగ్ విధానాన్ని అమలు చేశారు. గ్రేడింగ్ అనేది ఒక సమగ్రమైన, శాస్త్రీయ విధానం. పనితీరు పరిధిని సూచించడానికి అక్షరం లేదా పరిధిని (A,B ,C,D...లేదా 1,2,3,4... వంటివి) కేటాయించడం జరుగుతుంది. గ్రేడింగ్ ఒత్తిడిని తగ్గిస్తుంది. విద్యార్థి ఆలోచనను ప్రోత్సహిస్తుంది. మార్కులతో పోల్చినప్పుడు గ్రేడింగ్ వ్యవస్థ మంచిది. మొత్తం అభ్యాసం, అవగాహన వైపు దృష్టిని మళ్లిస్తాయి. పిల్లల సమగ్ర అభివృద్ధికి ఈ విధానం దోహదపడుతుంది. మార్కులు.. విద్యార్థులు చేసే నిర్దిష్ట పనులు లేదా పరీక్షలపై తక్షణ, పరిమాణాత్మక అభిప్రాయాన్ని తెలియచేస్తాయి. మార్కులు.. విద్యార్థుల పనికి ఖచ్చితమైన ఒక సంఖ్యా విలువను అందిస్తాయి. ఈ విధానం విద్యార్థుల మధ్య ప్రత్యక్ష పోలికను సులభతరం చేస్తూ వారి మధ్య పోటీ వాతావరణాన్ని పెంచి మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల నేర్చుకోవడం కంటే మార్కులు సాధించడంపై విద్యార్థులు దృష్టి పెట్టే ప్రమాదం ఉంది.
ప్రభుత్వ పాఠశాలలకు గ్రేడింగ్ బెటర్!
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న వారి అభ్యసన స్థాయిలు, మానసిక స్థాయిలు ఒకే రకంగా ఉండే అవకాశాలు ఒకే రకంగా ఉండ దని, విద్యార్థులపై మానసిక ఒత్తిడి తగ్గించడానికి, నిరంతర, సమగ్ర మూల్యాంకనం కోసమే సీసీఈ పద్ధతిలో గ్రేడింగ్‌ని తీసుకువచ్చారు. కానీ ఇప్పుడు గ్రేడింగ్ స్థానే మార్కుల విధానం తీసుకురావడం వల్ల పిల్లలపై ఒత్తిడి పెరుగుతుంది. సృజనాత్మకత, ప్రశ్నించే స్వభావం తగ్గే అవకాశం ఉంది. మళ్లీ బట్టిపట్టే విధానం పెరుగుతుంది. మార్కుల విధానం ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు అనుకూలంగా గ్రామీణ, ప్రభుత్వ బడులకు ప్రతికూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు మార్కుల విధానం అనుకూలంగా ఉంటుంది కానీ అకడమిక్స్‌కి గ్రేడింగ్ విధానమే శ్రేయస్కరం. ప్రపంచంలోనే నాణ్యమైన విద్యను అందించే దేశాల్లో గ్రేడింగ్ విధానమే అమలవుతోంది. దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు, సీబీఎస్‌సీ కూడా గ్రేడింగ్ విధానాన్ని అమ లు చేస్తున్నాయి. ఒకవైపు సీబీఎస్సీ విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడానికి ఓపెన్ బుక్ ఎగ్జామ్స్‌కి ప్రణాళికలు వేస్తుంటే మనం మార్కుల విధానం వైపు వెళ్ల డంపై ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- పాకాల శంకర్ గౌడ్
విద్యావేత్త
98483 77734