జగన్ రెడ్డిని మారిస్తే పోలా!

AP will improve if Jagan Reddy is replaced

Update: 2023-12-29 01:30 GMT

శాసనసభ్యుల్ని మారిస్తే సరిపోతుందని జగన్ రెడ్డి భావిస్తున్నారు. కానీ ప్రజలు జగన్నే మారిస్తే పోలా అని అనుకుంటున్నారు. వైసీపీ పార్టీకి ఎమ్మెల్యేలు భారంగా మారారా.. లేక జగన్ రెడ్డే గుదిబండగా మారారా? మార్పు జరిగితేనే మనుగడ సాధ్యమనే ఆలోచనలో జగన్ రెడ్డి ఉన్నారు. ఎంతమందిని మార్చినా, ఎన్ని చేసినా చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? అయినా అక్కడ చెల్లని కాసు ఇక్కడెలా చెల్లుతుంది.

అభ్యర్థుల మార్పులు, చేర్పులు, వారి ఎంపిక ఆయా రాజకీయ పార్టీల అంతర్గత వ్యవహారం. కానీ మన రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఏకంగా సగం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేందుకు సిద్ధం అవుతుందనే వార్తలు రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నన్ను చూసి ఓట్లు వేశారు, నా బొమ్మ పెట్టుకుని మీరంతా గెలిచారనే అహంభావంతో జగన్ రెడ్డి ఉన్నారు. వైసీపీలో మంత్రులు, ఇతర సీనియర్ నాయకులందరూ నిమిత్త మాత్రులే. ఈ మార్పులతో వైసీపీలో తీవ్రమైన గందరగోళం, అలజడి మొదలైంది. కొంతమందిని జంబ్లింగ్, మరికొంతమందిని లాటరీ పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు.

పిచ్చోడి చేతిలో రాయి

జగన్‌కు ప్రజాస్వామ్యం పట్ల ఏమాత్రం నమ్మకం లేదు. ప్రభుత్వంలో గాని, పార్టీలో గాని ప్రజాస్వామ్య పద్ధతులు ఏవీ అమలు కావు. నేను చెప్పింది వినాల్సిందే.. ఎవరేం చెప్పినా నేను వినను.. నాకు నచ్చిందే చేస్తానని జగన్ రెడ్డి మొండిగా, మూర్ఖంగా వ్యవహరిస్తుంటారు. సమిష్టి బాధ్యత ఎక్కడా కనిపించదు. ఎవరితో ఎలాంటి సంప్రదింపులు ఉండవు. అన్నీ ఏకపక్ష నిర్ణయాలతో అధికారం పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. మంత్రులైనా గానీ, సీనియర్ నాయకులైనా తనకు నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా పక్కకు పెడతారు. అంతిమ లక్ష్యం తను గెలవాలి. అసలు మార్చాల్సింది ఎవరిని, ఎవరు మారాలి? శాసనసభ్యులా, జగన్ రెడ్డా అని మేధావులు ప్రశ్నిస్తున్నారు.

ఒకవైపు 175 కి 175 గెలుస్తామని ప్రతి సభలో అదేపనిగా ఊదరగొట్టారు. కానీ హఠాత్తుగా కొన్ని రోజుల నుంచి అభద్రతాభావానికి లోనైనట్లుంది. అసలు అధికారమే చేజారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ ఎన్నికల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థుల మార్పునకు శ్రీకారం చుట్టారు. చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండిచేయి చూపుతున్నారు. అయితే ఈ మార్పులతో గెలుపు సాధ్యమేనా? తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీ ఎన్నికలను ఏ మేర ప్రభావితం చేస్తాయో కూడా వేచి చూడాలి. తెలంగాణలో కొంతవరకు అభివృద్ధి చేశారు. ఇక్కడ మాత్రం అభివృద్ధి శూన్యం. అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థులను మార్చకపోవడంతో కేసీఆర్ ఓడారనే భావనతో ఇక్కడ జగన్ రెడ్డి ఇష్టానుసారంగా మారుస్తున్నారు.

గెలుపుపై నమ్మకం కుదరకే...

నవరత్నాలు, కులం, డబ్బు, అధికారం, దొంగ ఓట్లు లాంటి అనేక అంశాలతో తిరిగి అధికారంలోకి రావొచ్చనే ధీమాతో ఇప్పటివరకు ఉన్నారు. దీంతో భారీగా దొంగ ఓట్లు చేర్చారు. ప్రతిపక్షాల ఓట్లు పెద్ద ఎత్తున తొలగించారు. వివిధ కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు కూడా జరిగాయి. అయినా గెలుపుపై ఇంకా నమ్మకం కుదరలేదు. ఇప్పుడు ఏకంగా అభ్యర్థులనే మారుస్తున్నారు. కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలు మారుతా ఉంటే.. మరికొంత మంది సీట్లే గల్లంతవుతున్నాయి. ఇంకొన్ని చోట్ల ఎంపీలు ఎమ్మెల్యేలుగా.. ఎమ్మెల్యేలు ఎంపీలుగా మారుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం పట్ల, పార్టీ పట్ల ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను జగన్ రెడ్డి గమనించి గడప గడపకు వైసీపీ, జగనన్నే మా భవిష్యత్, మా నమ్మకం నువ్వే జగన్, వై ఏపీ నీడ్స్ జగన్ లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు. వాటి ద్వారా తమ శాసనసభ్యుల్ని ప్రజల్లోకి పంపే ప్రయత్నం చేశారు. కానీ సత్ఫలితాలు రాకపోగా.. అనేకచోట్ల ఎమ్మెల్యేలకు నిలదీతలు, ఛీత్కారాలు ఎదురయ్యాయి.

నేతల నిర్వేదం

రాజధాని అమరావతిని మార్చబోమని, అక్కడే నివాసం ఉంటామని ఎన్నికల్లో నమ్మబలికాం. ఏడాదిలో పోలవరాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చాం. సీపీఎస్ వారంలో రద్దు చేస్తామని చెప్పి అది కూడా మాట తప్పాం. 10 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశాం. కనీసం ఎక్కడా ఒక్క రోడ్డు కూడా బాగుపడింది లేదు. కనీసం ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేకపోయాం. ఉద్యోగాలు రాక, ఉపాధి లేక ప్రజలందరూ తమ ప్రభుత్వాన్ని తిడుతున్నారు. దశలవారీగా మద్య నిషేధం చేస్తేనే ఓట్లడుగుతామని చెప్పాం.. ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని ఓట్లడగాలని శాసనసభ్యుల్లో అంతర్మధనం మొదలైంది. ఇలా శిశుపాలుడిలా మన వంద తప్పులు పూర్తయ్యాయి. గత ఎన్నికల్లో మనం చేసిన ఈ పాపాలన్నీ శాపాలుగా మారబోతున్నాయని వారంతా నిర్వేదం చెందుతున్నారు. అన్ని సమస్యల పరిష్కారానికి బటన్ నొక్కుడు ఒక్కటే ఏకైక మార్గమని ముఖ్యమంత్రి అనుకున్నట్లుంది. బటన్లు ఎన్నిసార్లు నొక్కినా ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. వైసీపీ పార్టీ బతికి బట్టకట్టాలంటే జగన్ రెడ్డిని మార్చడం ఒక్కటే మార్గం.

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేతగానితనానికి, వైఫల్యాలకు మమ్మల్ని ఎలా బాధ్యులను చేస్తారని ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి దర్శనభాగ్యం కరువైంది. కనీసం తమను గుర్తు కూడా పట్టడం లేదని వారు వాపోతున్నారు. కేవలం జగన్ రెడ్డి ఇమేజ్‌తో మాత్రమే తాము గెలవలేదు.. తమ వ్యక్తిగత ప్రతిష్ట, కష్టం, డబ్బు అన్నిటితో గెలిచామని బాహాటంగానే చెబుతున్నారు. ఈ విషయాలన్నీ గత నాలుగేళ్ల నుంచి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూనే ఉన్నారు. అప్పుడెవరికీ పట్టలేదు. ఇప్పటికి అందరికీ తత్వం బోధపడింది. అవినీతిని కేంద్రీకరించి అంతా జగనే దోచుకుతింటున్నాడనే భావన శాసనసభ్యుల్లో ఏర్పడింది. పైగా ఎన్నికల్లో పోటీ చేయాలంటే రూ.50 కోట్లు ఖర్చు పెట్టగలిగితేనే టికెట్లు ఖరారు చేస్తామంటున్నారు. రాష్ట్ర సంపదనంతా జగన్ రెడ్డి దోచుకున్నారు. ఇన్ని కోట్లు ఎక్కడ నుంచి తీసుకురావాలని వారు వాపోతున్నారు.

నాలుగున్నరేళ్లలో ఇంత వ్యతిరేకతా?

జగన్ రెడ్డిపై ఎమ్మెల్యేలకు నమ్మకం సడలడంతో పార్టీని వీడటమే తమ ముందున్న కర్తవ్యంగా భావిస్తున్నారు. చాలా మంది తమకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. తిరుగుబాటు చేసి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేయడమా, లేక ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను గెలిపించడమా అనే ఆలోచన చేస్తున్నారు. పక్క నియోజకవర్గాల నుంచి దిగుమతి అవుతున్న అభ్యర్థులను స్థానిక నాయకత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తూ వారికి సహాయ నిరాకరణ చేస్తున్నారు. నాలుగున్నరేళ్లలో ఇంత వ్యతిరేకత మూటగట్టుకుంటారని ఎవరూ ఊహించలేదు. ప్రజలిచ్చిన అవకాశాన్ని చేజేతులారా కాలదన్నుకున్నారు. తానే రాజు, తానే మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఇంతమంది సలహాదారులను పెట్టుకున్నారు. మరి వారి సలహాలు ఏమవుతున్నాయి? 108 నియోజకవర్గాల పరిధిలో ఉన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగంతో పాటు డబ్బు వెదజల్లినా ఘోర పరాభవాన్ని చవిచూశారు. రాబోయే శాసనసభ ఎన్నికల ఫలితాలు ఆనాడే కళ్ల ముందు మెదిలాయి. అప్పుడే వైసీపీ ఓటమి ఖరారైంది. తలకిందులుగా తపస్సు చేసినా ఇక ఎవరూ కాపాడలేరు. జగన్ రెడ్డి కబంధ హస్తాల నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారు.

మన్నవ సుబ్బారావు

99497 77727

Tags:    

Similar News