దేశ వ్యతిరేకులకే.. మోడీ పట్ల ద్వేషం..!

ప్రజాస్వామ్య పరిపాలనా విధానం అమలులో ఉన్న దేశాలలో ప్రభుత్వ పనితీరుపై, ఆ ప్రభుత్వాన్ని నడిపే ప్రధానిపై విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టినప్పుడు

Update: 2024-06-01 00:45 GMT

ప్రజాస్వామ్య పరిపాలనా విధానం అమలులో ఉన్న దేశాలలో ప్రభుత్వ పనితీరుపై, ఆ ప్రభుత్వాన్ని నడిపే ప్రధానిపై విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టినప్పుడు మాత్రమే ఆ దేశాలలో ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందని రాజనీతి వేత్తల అభిప్రాయం. కానీ ప్రస్తుత భారతదేశంలో ఇందుకు భిన్నమైన పరిస్థితి కొనసాగుతోంది. ప్రధానిపై ప్రతిపక్షాలు వ్యక్తిగత విమర్శలు చేయడం, అసంబద్ధ ఆరోపణలు చేయడం ప్రభుత్వ పరిపాలనా విధానంపై అపోహలను, అనుమానాలను కలిగించి, దేశ ప్రజల్లో గందరగోళం సృష్టించడం మోడీ వ్యతిరేకులకు ఒక హాబీగా మారింది. శ్రీకృష్ణుడిని శిశుపాలుడు నిరంతరం దూషించినట్లు ప్రధాని మోడీని నిరంతరం ప్రతిపక్ష నాయకులు దూషిస్తూ, ద్వేషిస్తూ వాళ్ల స్థాయిని తగ్గించుకుంటున్నారు.

దేశభద్రత, దేశ సమైక్యత, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణలో జవహర్లాల్ నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిరా గాంధీ, ప్రధాన మంత్రులుగా ఉన్న కాలంలో వ్యవస్థాపరమైన కొన్ని తప్పిదాలు జరిగినప్పటికీ.. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భారతీయ జనసంఘ్ (నేడు అది భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందింది) ఎంతో హుందాగా, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రభుత్వం చేసే తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూ, ప్రభుత్వ పాలన రాజ్యాంగబద్ధంగా సాగేందుకు సహకరిస్తూ వచ్చింది. పాకిస్తాన్‌తో మూడు యుద్ధాల్లో భారత్ తలపడింది. 1962లో చైనా మనపై దాడి చేసింది. ఈ నాలుగు యుద్ధాల్లో బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు అందించింది. కానీ ప్రస్తుత నరేంద్ర మోడీ ప్రభుత్వానికీ కాంగ్రెస్ పార్టీ నాయకులు సహకరిస్తున్నారా? బాలాకోట్ సర్జికల్ దాడుల విషయంలో కూడా వారు మన సైన్యం నైతిక స్థైర్యాన్ని దెబ్బతినే విధంగా వ్యాఖ్యలు చేసి, దేశ ప్రజల దృష్టిలో పలుచనైపోయారనేది ఇక్కడ గమనార్హం.

భారత్ గౌరవాన్ని పెంచిన నిర్ణయాలు

బీజేపీ మాతృసంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యుద్ధ సమయాల్లో తన పూర్తి సహాయ సహకారాలు సైన్యానికి అందించి, దేశభక్తికి, సేవాతత్పరతతకు ఆ సంస్థ కేరాఫ్ అని దేశ ప్రజల మనసుల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఆ సంస్థ కార్యకర్తగా ఎదిగిన నరేంద్ర మోడీ ప్రధానిగా తీసుకున్న నిర్ణయాలు దేశ భద్రత, దేశ సమైక్యతలను పటిష్ట పరిచి, ప్రపంచ దేశాల్లో భారతదేశ గౌరవం పెంచే విధంగా ఉన్నాయి. ప్రపంచదేశాల అధినేతల పనితీరు విషయంలో 76% ర్యాంకింగ్‌తో ముందంజలో ఉండడం ఈ దేశం నాది అనే మానసిక భావన ఉన్న భారతీయులందరికీ గర్వకారణం. మోడీ మీద ద్వేషంతో, కక్షతో, ఈర్ష్యతో రగిలిపోయే వారికి, జిహాదీ ఉగ్రవాదులకు, వారి చర్యలకు మద్దతు తెలిపేవారికీ, హిందూ వ్యతిరేక హిందూ రాజకీయ నాయకులకు, హిందూ సమాజం బలహీనపడి, హిందూ సంస్కృతి, సాంప్రదాయాలు నాశనం కావాలని కోరుకునే వామపక్షీయులకు నిరంతరం క్షోభను కలిగించే విషయమే సుమా!

మోదీని ద్వేషించడానికి కారణాలేంటి?

ప్రపంచంలో ఏ దేశ ప్రధానమంత్రి మోడీలాగా దూషణలకు గురికాలేదంటే అతిశయోక్తి కాదేమో.. చాలా దేశాలలో ప్రధాన మంత్రులు దేశం సొమ్మును దోచుకుని, విదేశీ బ్యాంకుల్లో దాచుకొని, దేశం సొమ్మును బంధువులకు దోచిపెట్టి, అపకీర్తిని మూట కట్టుకున్నారు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కుటుంబ వారసత్వ పరిపాలనను సాగించే ప్రాంతీయ పార్టీల నాయకులు ప్రజల సొమ్మును ఎలా దోచుకున్నది దేశ ప్రజలకు బాగా తెలుసు. అందుకే ప్రజలు 2014, 2019 ఎన్నికల్లో ప్రతిపక్షాలను తిరస్కరించి, మోడీ ఆధ్వర్యంలోని ప్రభుత్వానికి బ్రహ్మరథం పట్టారు. మోడీని నిరంతరం ద్వేషించే ప్రతిపక్ష నాయకులు ఆయనపై ఒక్క అవినీతి ఆరోపణను ఆధారాలతో సహా చూపించలేకపోతున్నారు.

పరిశ్రమలకు మద్దతిస్తే కూడా తప్పేనా?

తన మిత్రులైన పారిశ్రామికవేత్తలకు మోడీ దేశం సొమ్మును దోచిపెడుతున్నాడని అసంబద్ధ ఆరోపణలు గుప్పించడం హాస్యాస్పదంగా ఉంది. ప్రపంచంలోని ఏ దేశాలలోనైనా ఆ దేశ ప్రభుత్వాలు పారిశ్రామికవేత్తలకు తగిన ప్రోత్సాహకాలను అందించి, దేశ ఆర్థిక అభివృద్ధిలో వారు భాగస్వామ్యులయ్యేటట్లు చేయడం సహజం. ఈ విషయాన్ని ఈ దేశ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇక మోడీ ముస్లింలకు వ్యతిరేకం అనే విషయాన్ని దేశభక్తులైన చాలామంది ముస్లింలు నమ్మడం లేదు. ఈ విషయంలో ముస్లిం సమాజాన్ని మోడీ వ్యతిరేకులు తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారు. నవాజ్ షరీఫ్ పాక్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పాకిస్తాన్ సందర్శనకు వెళ్లిన మోడీ నవాజ్ షరీఫ్ ఇంటికెళ్లి, ఆయన తల్లి పాదాలకు నమస్కరించి, ఆమె ఆశీస్సులు తీసుకున్న విషయం పరిగణనలోకి తీసుకుంటే ఆయన ఎవరికీ వ్యతిరేకం కాదు కానీ దేశ వ్యతిరేకులకు మాత్రమే ఆయన వ్యతిరేకం అనే విషయం స్పష్టంగా బోధపడుతుంది.

- ఉల్లి బాల రంగయ్య,

సామాజిక, రాజకీయ విశ్లేషకులు

94417 37877

Tags:    

Similar News