దగాపడ్డ తెలంగాణ!
Another movement should be made against those who have looted in Telangana state, everyone come together
‘జై తెలంగాణ’ ఇది తెలంగాణ ప్రజల ఉద్యమ నినాదం. ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న దృఢ సంకల్పంతో నాటి పోరాటంలో ముక్కోటి గొంతుకలు ఒక్కటై దిక్కులు పిక్కటిల్లేలా, భూమి బద్దలయ్యేలా, పాలకుల గుండెలు అదిరిపోయేలా గర్జించిన రణ నినాదమది. అనుకున్నట్టుగానే, తెలంగాణ ప్రజానీకం ఆశించిన విధంగా రాష్ట్రం సాకారమైంది. చూస్తుండగానే పదేళ్లు గడిచిపోతున్నాయి. ఇప్పుడు మనం చాలా ముందుకు వచ్చాం. అయితే, పదేళ్ల తెలంగాణలో దండుకున్నది ఎవరు? దగా పడ్డది ఎవరని ఒక్క అడుగు ఆగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది.
ఉద్యమానికి ఆకర్షణీయ నినాదమిచ్చి!
తెలంగాణ ఉద్యమంలో కలాలను, గళాలను, హలాలను, ఒక్కటిగా చేసి ఉద్యమంలో భాగస్థులను చేసింది జర్నలిస్టులు. రాష్ట్రంలోని అన్ని సమస్యలకు ప్రత్యేక తెలంగాణ ఒక్కటే పరిష్కార మార్గమని అందుకోసం అలుపెరుగని పోరాటం అవసరమని భావించాం, మనం ఏది అనుకున్నామో, ఏమి ఆలోచించామో ఆ భావాలన్నింటినీ ప్రజలపై రుద్దాం. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ ఒక ఆకర్షణీయ నినాదాన్ని తయారుచేసి ఉద్యమకారులకు అందించాము. 1969 నుంచి పోరాటం ఉన్నా దానికి రాజకీయ ఆలోచన లేని కారణంగా, తెలంగాణ పోరాటం ఎప్పటికప్పుడు అణిచివేయబడుతుందని భావించి. అధికారం కోసం, అందలం కోసం కాచుకుని కూర్చున్న ఓ ప్రాణికి బలాన్ని ఇచ్చి బలవంతుడిని చేసాం. ఉద్యమ నినాద మంత్రాన్ని ఉపదేశించి తెలంగాణ బాహుబలిని చేసాం.
ఇందులో ఉద్యమకారులుగా మనకు ఎన్ని అవమానాలు ఎదురైనా, తెలంగాణ కోసం అన్నింటిని దిగమింగి మన అందరి బలాన్ని ఒక్కనికే ఇచ్చి, మన మస్తిష్కాన్ని రంగరించి ఆయనకు మేధస్సును ఇచ్చాం. శిలను చెక్కి శిల్పం చేసాం. అది రాయి కాదు రత్నం అని మనమే ప్రజలను నమ్మించాము. తెలంగాణ అన్న పదమే పలకరాని వ్యక్తిని తెలంగాణ భాషకే పట్టాభిషిక్తున్ని చేసాం. తెలంగాణ యాసలో ఆయనను మించినోడు లేడని మనమే ప్రచారం చేసాం. భస్మాసురుడికి శివుడు వరమిచ్చినట్లుగా తెలంగాణ మేధావులు, జర్నలిస్టులు, కవులు, కళాకారులు అందరం కలిసి తెలంగాణ పైకి ఓ బస్మాసురుడు వదిలిపెట్టాం. ఇప్పుడు ఆ భస్మాసురుడి నుంచి రక్షణ కోసం రాష్ట్ర ప్రజలు నలుదిక్కులు పరిగెడుతున్న పరిస్థితి కనబడుతున్నది. అందుకే ఒక్క అడుగు ఆగి వెనక్కి చూసుకొని ఇప్పుడేం చేద్దామని ఆలోచించుకొని సంఘటితంగా ముందడుగు వేయడం కోసం చర్చలు జరపాల్సిన సమయం ఆసన్నమైంది.
ఎమర్జెన్సీని తలపిస్తున్న పాలన!
అభివృద్ధి కంటే ఆత్మగౌరవమే మిన్న అంటూ ఎన్నో మాటలు చెప్పి, ఆత్మగౌరవ తెలంగాణ కోసమే పోరాటమని చెప్పాం. కానీ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ జర్నలిస్టులకు దక్కిన గౌరవంలో ఆవగింజంత అయినా ఇప్పుడు దక్కుతుందా ఆలోచిద్దాం రండి! నీళ్లు, నిధులు, నియామకాలు ఏమయ్యాయి? ఎవరి పాలయ్యాయి? పదేళ్ల తర్వాత కూడా వీటి గురించి ఆలోచించకపోతే మనం తెలంగాణ ద్రోహులమవుతాం. దండుకున్నోడు దండుకొని పోతుంటే మనం దగాపడ్డ జనం పక్షాన నిలవాల్సి ఉంది. ఎందుకంటే దగాపడ్డ జనంలో మనమూ ఉన్నాం. పదేళ్ల పండుగ ఉత్సవంలా జరుపుతామని ప్రభుత్వం అంటుంది. కానీ నిజంగా ప్రజలు ఉత్సవం చేసుకునే ఆనందంలో ఉన్నారా? రైతు ఆత్మహత్యలు, నిరుద్యోగుల బలవన్మరణాలు ఎక్కడైనా ఆగాయా? వందలాదిమంది ఉద్యమకారుల బలిదానం మూలంగా ఏర్పడ్డ తెలంగాణ, ఏ ఒక్కరి సొత్తు కాకూడదని ప్రజలందరికీ ఫలితం దక్కాలని ఆలోచించి, ఆ వైపుగా అడుగులు వేస్తే ఇనుప సంకెళ్లు, పోలీస్ లాఠీలు సమాధానాలు ఇస్తున్న ఈ పరిస్థితులు ఎమర్జెన్సీకి భిన్నంగా ఏమాత్రం కనిపించడం లేదు. ఎవరికివారు మనకెందుకులే అని కూర్చుంటే తెలంగాణ ప్రజానీకంలో పుట్టబోయే బిడ్డ కూడా అప్పుతోనే జన్మనిస్తుంది. చనిపోయి శవం కూడా లక్షన్నర అప్పును మోస్తూనే ఉంది. చావు కాడ, బతుకు కాడ ఒక్కటే పాట అన్నట్టు ప్రభుత్వం అన్నింటికీ కాళేశ్వరాన్ని చూపించి ప్రపంచం కళ్ళు కప్పడానికి ప్రయత్నిస్తున్నది. అభివృద్ధి అంటే ఆకాశ హర్మ్యాలు, 100 అడుగుల వెడల్పు రహదారులు కాదు. ప్రజల జీవనంలో మౌలిక మార్పులు సంభవించి ఉత్పాదకత పెరిగి, స్వయం సమృద్ధి సాధించడం. ఇవేవీ ఇప్పుడు తెలంగాణలో మచ్చుకైనా అభిపించడం లేదు. ఓటు కోసం నోటు ఇస్తున్న తీరు మారి ఓట్ల కొనుగోలు కోసం కొత్త పథకాలను ప్రవేశపెట్టే తీరు తెలంగాణలో మొదలయ్యింది.
ద్రోహులే అందలాన్నెక్కి..
ప్రభుత్వ పథకాలలో స్థానిక నాయకులకు అమ్యామ్యాలు లేనిదే ఏ లబ్ధిదారుడికి సహకారం అందడమే లేదు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనూ ఈ తిప్పలు తప్పడం లేదు. వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనం ఉన్నా అందులో డాక్టర్ పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. అందమైన భవనాల్లో హాస్టల్లు, స్కూళ్లు ఉన్నా ఉన్నతమైన విద్య అందడమే లేదు. నియోజకవర్గం చుట్టూ కాలువలు పరుచుకొని ఉన్నా ఏ ఒక్క ఎకరానికి కూడా కాళేశ్వరం నీళ్లు అందనే లేదు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ముంపు గ్రామాల బాధితులకు ఇప్పటివరకు పూర్తి పరిహారం అందనే లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటేమిటి... ఏదీ పూర్తిగా అమలు కాలేదు. కేజీ టు పీజీ కనుమరుగైపోయింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకానికి సమాధి కట్టబడ్డది. మూడు ఎకరాల భూమి ఊసే లేదు. ధరణి పథకం పేరుతో పేదల భూములన్నీ పెద్దలపరమైపోయాయి. కేటీఆర్ చెప్పే కంపెనీల పేర్లు ఆకర్షణీయంగా ఉన్న, ఆశలు కల్పిస్తున్నా ఈ ప్రాంత ప్రజానీకానికి ఎన్ని ఉద్యోగాలు దక్కాయో ఎవ్వరికీ అర్థం కాదు.
నాటి నిజాములు వదిలి వెళ్ళిన వేలాది ఎకరాల భూములు ఈ నయా నిజాముల పాలైపోయాయి. నాటి పాలకుల ముందుచూపు నేటి పాలకులకు కాసుల పంట పండిస్తున్నది. కంపెనీల పేరుతో వందలాది ఎకరాల భూమిని వారికి కావలసిన వాళ్లకు కట్టబెట్టి కమిషన్లు దండుకునే దుష్ట సంస్కృతి నేడు నెలకొని ఉంది. ఎన్నో ఆశలతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు ఎటూ కాకుండా పోయారు. ఉద్యమ ద్రోహులే అందలాన్నెక్కి ఉద్యమకారుల తలలపై నాట్యమాడుతుంటే ఇంకా ఇలానే చూస్తూ కూర్చుందామా? అప్పుడే పదేళ్లు గడిచిపోయాయి. ఇంకా చూస్తూ కూర్చుంటే మరోసారి ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తెలంగాణ అంతా ఆ కుటుంబం పాలే అవుతుంది. అందుకే మరొక్కసారి అందరం కలవాలి ఆలోచించాలి. పదేళ్ల తెలంగాణలో దండుకున్నది ఎవరు దగా పడ్డది ఎవరు. తేల్చుకోవాలి. తెలంగాణ ఆత్మగౌరవానికి, తెలంగాణ సమగ్ర అభివృద్ధికి మరో పోరాటం అవసరమవుతున్నది. అందుకు జేఏసీ మళ్లీ పురుడు పోసుకోవాలి. ఉద్యమకారులారా ఆలోచించండి.
కప్పర ప్రసాదరావు
96767 76622
Also Read: దేనికి దశాబ్ది ఉత్సవాలు!?