మారుతున్న సమీకరణాలు… వేడెక్కుతున్న రాజకీయం!
Andhra Pradesh's changing equations... heating up politics!
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఎన్నికలకు సమయం ఉండగానే… ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ పొత్తుల వైపు అడుగులేశాయి. అధికార పార్టీ మాత్రం తాము ఒంటరిగానే వస్తామని తేల్చి చెప్పేసింది. తెలుగుదేశం, జనసేన ఏకతాటిపై కలిసి నడవాలని నిర్ణయించడంతో, రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. నిజానికి జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య ఇంతకాలం పొత్తు ఊహగానాలు వచ్చినా, చంద్రబాబు అరెస్ట్‌తో ఇది అధికారికం అయ్యింది. ఇలాంటి సమయంలో పొత్తుపై స్పష్టమైన ప్రకటన రావటంతో ఇరు పార్టీల కేడర్‌లో ఉన్న సందిగ్ధతలన్నీ తొలగిపోయాయనే చెప్పొచ్చు.
ఆసక్తికరంగా మారనున్న సమీకరణాలు
మొన్నటి వరకు బీజేపీతో ఉన్న జనసేన ఏపీ రాజకీయాల్లో టీడీపీ వైపు మళ్లడంతో పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఆసక్తికరంగా మారింది. గతంలో మాదిరిగా ఈసారి కూడా మూడు పార్టీలు కలవాలనేది పవన్ ఆకాంక్ష. కానీ ఈ విషయంలో బీజేపీ నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు పొడవడంతో సమీకరణాలు మారే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఎవరికి వారుగా అన్నట్టు పని చేస్తూ వచ్చారు. ఇకపై ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్లాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి.
వైసీపీ నేతలు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. వచ్చే రెండు నెలల పాటు ప్రజల్లో ఉండేందుకు బస్సు యాత్రలు ప్రారంభించి ఆ దిశగా సాగుతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా 175 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకునేందుకు సామాజిక సాధికార యాత్ర పేరుతో వైసీపీ బస్సుయాత్ర చేపట్టింది చేపడుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఈ కార్యక్రమాలను అమలు చేసిన తర్వాత జీవన ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపడ్డాయి అనేది యాత్ర ద్వారా వివరించాలన్నది వైసీపీ లక్ష్యం. ఉత్తర ఆంధ్ర, రాయలసీమ, కోస్తా ప్రాంతంతో సహా మూడు ప్రాంతాలలో గడిచిన నాలుగున్నరేళ్లలో చేసిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద వర్గాలకు చేసిన మేలును వివరించడంతో పాటు ఆయా వర్గాలకు మరింత చేరువ కావాలన్న ధ్యేయంతో ఈ యాత్ర కొనసాగుతోంది.
బస్సు యాత్రలో చుక్కెదురు
సామాజిక న్యాయ భేరి పేరిట చేస్తున్న బస్సు యాత్రకు జనం మొహం చాటేస్తున్నారు. గడపకూ మన ప్రభుత్వం అంటూ జనం వద్దకు వెళ్లిన మంత్రులు, ఎమ్మెల్యేలకు గడప గడపలోనూ నిరసనలు ఎదురైతే ఇప్పుడు చేపట్టిన సామాజిక న్యాయ భేరి బస్సు యాత్రకు జనం మొహం చాటేస్తున్నారు. ఈ పరిస్థితి వైసీపీ ఇబ్బంది కరమే దీనికి కారణం. స్వయంకృతాపరాధమే అధినాయకుని దగ్గర ఒక తీరు, ప్రజల ముందు మరో తీరుగా ప్రవర్తిస్తున్న నేతల ప్రవర్తన ప్రజల్లో మమేకం కాకుండా తమ వర్గీయులకే ప్రాధాన్యత ఇవ్వడం. ప్రభుత్వ పథకాల అమల్లో వైఫల్యం తదితర కారణాలు తీవ్ర వ్యతిరేకతను తెలియజేస్తున్నాయి. పైకి గంభీరంగా ఉన్నా, లోపల మాత్రం గెలుపు భయంతో కొంతమంది నాయకులు ఉన్నారు. సీట్ల కేటాయింపులో అధినేత చేసిన ప్రకటన కూడా కొంత ఉదాసీనతను దారితీస్తోంది. పార్టీ టిక్కెట్ దక్కదని తెలిసిన నాయకులు అంటీముట్టనట్లు పార్టీ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు.
సోము వీర్రాజు గతంలో అధ్యక్షునిగా వున్న సమయంలో సంస్థాగత నిర్మాణం పై దృష్టి పెట్టకపోవడం పార్టీలోకి చేరికలను ప్రోత్సహించకపోవడం జనసేనతో కలిసి ఏ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమం చేపట్టకపోవడం ఆ పార్టీకి నష్టాన్ని చేకూర్చిందనే చెప్పాలి. బీజేపీ అధిష్టానం జనసేనానితో మంచి సంబంధ బాంధవ్యాలను కలిగివున్నా, క్షేత్ర స్థాయిలో అవి కార్యాచరణలోకి రాలేదు. ఈ పరిణామం వల్ల జనసేన తెలుగుదేశం పొత్తుపై ఎక్కువ శ్రద్ధ చూపటానికి దోహదపడింది. పురంధేశ్వరి ఏపీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంస్థాగత కార్యకలాపాలపై దృష్టి సారించి పార్టీని గాడిలో పట్టే పనిలో పడ్డారు.
పురంధేశ్వరి తీవ్ర విమర్శలు
వైసీపీ పురంధేశ్వరి ఏపీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విమర్శలు గుప్పిస్తుంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఈ పరిణామాలు మరింత తీవ్ర రూపం దాల్చాయి.ఆమె ఇసుక తవ్వకాలు, కేంద్ర ప్రభుత్వ నిధులు దారి మళ్లింపు... ఇలా ఏదో ఒక అంశంపై పురందేశ్వరి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇటీవల మద్యం అమ్మకాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ కేంద్రానికి కూడా పురంధేశ్వరి ఫిర్యాదు చేశారు. పాత కేసుల్ని ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పురంధేశ్వరి లేఖ రాయడంతో ఈ గొడవ మరింత ముదిరింది. ఇటీవల తిరుపతి పర్యటనలో ఆమె అనేక విషయాలను ప్రజల దృష్టికి తీసుకొచ్చింది. తిరుపతి అభివృద్ధి తిరుమల శ్రీవారి నిధుల వినియోగం, తిరుపతి నగరపాలక సంస్ధకు పన్నుల ద్వారా వచ్చే నిధులు ఎక్కడికి పోతున్నాయని పురందేశ్వరి ప్రశ్నించారు. పార్వేటి మంటపం, అలిపిరి మంటపం తొలగిస్తామని చెపుతున్నారని అసహనం వ్యక్తం చేస్తూనే.. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మంటపాలను తొలగించాలంటే కేంద్ర పురావస్తు శాఖ అనుమతి, పర్యవేక్షణ తప్పనిసరి అని వ్యాఖ్యలు చేసింది. దీంతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ, జనసేన పొత్తు విషయంలో స్పష్టమైన అవగాహన లేక రాష్ట్ర బీజేపీ మల్లగుల్లాలు పడుతోంది. జనసేనతో తెలంగాణాలో పొత్తు కూడా మరిన్ని చిక్కులు తెచ్చిపెడుతోంది.
అరెస్టుతో పెరిగిన బాబు మైలేజ్
చంద్రబాబు అరెస్టు తదనంతర పరిణామాలు తెలుగు దేశానికి కాస్తంత మైలేజ్‌ని పెంచాయి. కరువు పరిస్థితులపై ప్రభుత్వ వైఖరిని ప్రతిపక్షాలు బాగానే ఎండగడుతున్నాయి. ఋషి కొండ నిర్మాణాలపై న్యాయస్థానం వెలిబుచ్చిన అభిప్రాయాలు, సి.అర్.డి పరిధిలో రోడ్ల నిర్మాణంపై మందలింపులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పడేటట్లు చేసాయి. ప్రతిపక్షాన్ని ఇరుకున పెడుతున్నాం అని సంబర పడడం కన్నా ప్రభుత్వంపై వ్యతిరేకత మిన్నగా ఉంది కాబట్టి ఈ దిశగా చర్యలు తీసుకోవాలి. సర్వేలు ఐప్యాక్ రిపోర్టులను అధారంగా చేసుకున్నా, క్షేత్రస్థాయిలో పరిస్దితులను, కార్యకర్తల భావాలను తెలుసుకోవడంలో అధినేత ఇంకా సరైన అవగాహనకు రాలేదనే చెప్పాలి. కోటరీ కోటలో భజన బృందం మధ్యలో వుంటే ఫలితాలు రావు. స్వయంగా క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించి కఠిన నిర్ణయాలు తీసుకుని. పరిపాలనపై దృష్టి సారించాలి. ఆర్థిక మౌలిక వసతుల రూపకల్పనపై దృష్టి సారించాలి. కరువు పరిస్థితిని సమీక్షించి కేంద్రాన్ని ఆర్థిక సహాయం కోరాలి, రైతులను ఆదుకోవాలి. ఇది ప్రభుత్వం ముందున్న లక్ష్యం. సంక్షేమంతో పాటు అభివృద్ధి ముఖ్యమే. ప్రస్తుత పరిస్థితి ప్రకారం, వైసీపీకి, తెలుగుదేశం-జనసేన కూటమికి మధ్య పోటీ. తెలంగాణాలో బీజేపీ, జనసేనతో పొత్తు అంధ్రప్రదేశ్‌లో ఏమేరకు సఫలీకృతమౌతుందో చూడాలి. ఏది ఏమైనా.. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరన్నది జగమెరిగిన సత్యం.
- శ్రీధర్ వాడవల్లి
99898 55445