అభద్రతాభావంలో జగన్!

ఎవరు ఏ పనికి అర్హులో ప్రజలు వారినే ఎన్నుకోవాలి. అనుభవం లేని అసమర్థులను ఎన్నుకుంటే పరిపాలన ఇలానే అఘోరిస్తుంది.

Update: 2023-10-10 01:00 GMT

ఎవరు ఏ పనికి అర్హులో ప్రజలు వారినే ఎన్నుకోవాలి. అనుభవం లేని అసమర్థులను ఎన్నుకుంటే పరిపాలన ఇలానే అఘోరిస్తుంది. ఎటువంటి పాలనా అనుభవం లేని జగన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడంతో అధికారం పిచ్చివాడి చేతిలో రాయిలా మారింది. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ మినహా ఏ వ్యవస్థ పనిచేయడం లేదు. ఆదాయం పెంచడం చేతగాక ఆర్థిక అరాచకత్వంతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. ఒక్క ఛాన్స్ ఇవ్వమని ప్రజలను వేడుకొని అధికారంలోకి వచ్చారు. ఇక ఆయనకు ప్రజలు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకపోవచ్చు. అందుకే జగన్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టేందుకు మరో కొత్త నాటకానికి తెరతీశారు. జగన్ పప్పులుడకవు ఈ పీడ ఎప్పుడు విరగడ అవుతుందో అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. మీరు ఎన్నిసార్లు గేర్లు మార్చినా ఎవరూ నమ్మరు. మీ తలరాతలు మార్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

రాష్ట్రంలో పగ, ప్రతీకారాలు పెంచి..

రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలనే కొత్త నినాదంతో ప్రజల ముందుకు వైసీపీ రాబోతుంది. ముందు అసలు జగన్ ఎందుకు కావాలో వైసీపీ సమాధానం చెప్పాలి. ప్రజలు మాత్రం మాకొద్దు బాబోయ్ ఈ జగన్ అని తిరస్కరిస్తున్నారు. గతంలోనూ మా నమ్మకం నువ్వే జగన్, జగనన్నే మా భవిష్యత్ పేరుతో కార్యక్రమాలను ప్రారంభించగా ప్రజల నుంచి స్పందన కరువైంది. బలవంతంగా స్టిక్కర్లు అంటించారు. కానీ ఆ స్టికర్లు ఇప్పుడు ఒక్కటి కూడా కనిపించడం లేదు. గడప గడపకు కార్యక్రమంలో ఎక్కడికక్కడ ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ప్రజలు గడ్డి పెట్టారు. ప్రజలు నమ్మి ఇచ్చిన అధికారం వారికే శాపమైంది. రాజకీయ పరిణితి లోపించి ప్రతీకారేచ్ఛ లాంటి అవలక్షణాలు చోటుచేసుకున్నాయి. ప్రజలు ఇచ్చిన అపూర్వ అవకాశం అభాసుపాలైంది. కూల్చివేతలు, కక్షసాధింపులు, అణచివేతలు, దాడులు చేయడం, అక్రమ కేసులు బనాయించడం, మీడియా, ప్రతిపక్షాల గొంతు నోక్కెందుకు చీకటి చట్టాలు తేవడం జగన్ ప్రభుత్వం సాధించిన నాలుగేళ్ల విజయాలు. రాష్ట్రాన్ని పగ, ప్రతీకార కుంపట్లు రాజేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. అటు కేంద్ర ప్రభుత్వ పెద్దల అండ, ఇటు తెలంగాణ దొరల ఆశీస్సులు దొరకడంతో జగన్ రెడ్డి మితిమీరి వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య ఇండియా టుడే సీ ఓటర్‌ నిర్వహించిన సర్వేలో వైసీపీకి 10 ఎంపీ స్థానాలకు మించి రావన్న విషయం బట్టబయలైంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలను ఎదిరించి మెజారిటీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అంతకుమునుపు జరిగిన శాసన మండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. దీంతో జగన్ రెడ్డిలో ఓటమిభయం మొదలైంది. అభద్రతాభావంతో ప్రజలను మభ్యపెట్టేందుకు పగటివేషగాళ్లలా రకరకాల రూపాలతో వస్తున్నారు.

ఏ ముఖంతో ఓట్లు అడుగుతున్నారు?

రాష్ట్రానికి జగన్‌రెడ్డి పాలన ఒక పీడకలలా మారింది. మీరు ఏం ఉద్దరించారని మీకు అధికారం అప్పగిస్తారు? జగన్ వద్దని చెప్పడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయి. ఏటా జాబ్ కేలండర్ ప్రకటిస్తామని, 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి యువతను మోసం చేసినందుకా? కమీషన్ల కోసం పరిశ్రమల్ని తరిమేసి యువతకు ఉపాధి లేకుండా చేసినందుకా? మద్య నిషేధం చేస్తానని మాట తప్పి నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నందుకా? సీపీఎస్ రద్దు చేస్తానని జీపీఎస్ తెచ్చి ఉద్యోగులను మోసం చేసినందుకా? ప్రత్యేక హోదాను, రైల్వేజోన్ తెచ్చినందుకా? రైతు భరోసాను రైతు దగాగా మార్చినందుకా? 3వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినందుకా? మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకోనందుకా? రూ.11 కోట్లు పెట్టి నిర్మించిన ప్రజావేదిక కూల్చివేసినందుకా? అధికారంలోకి రాగానే అమరావతిని అటకెక్కించి మూడు రాజధానుల ముసుగులో రాజధాని లేని రాష్ట్రంగా మార్చినందుకా? రివర్స్ టెండరింగ్‌తో సాగునీటి ప్రాజెక్టులను గాలికి వదిలేసినందుకా? గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టును 72% పూర్తి చేస్తే.. మీ పాలనలో నాలుగున్నరేళ్లలో 4 శాతం పనులు కూడా పూర్తి చేయనందుకా? నాలుగున్నరేళ్లలో రాష్ట్రాన్ని నలభై ఏళ్లు వెనక్కి నెట్టి ఏ ముఖం పెట్టుకుని మళ్లీ జగనే కావాలని మీరు ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడుగుతారు?

జగన్ రెడ్డి లూటీ కారణంగా విద్యుత్ వినియోగదారులపై రూ.57,188 కోట్ల భారాలు మోపారు. టారిఫ్‌ల కుదింపు, స్లాబుల మార్పు, ఫిక్స్‌డ్ ఛార్జీలు, అదనపు డిపాజిట్లు రూపంలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. మీ ప్రభుత్వ అవినీతి, దుబారా కారణంగా 10 లక్షల కోట్ల అప్పు చేశారు. విద్యుత్, ఆర్టీసీ, యూజర్ ఛార్జీలు, వాహనాల రిజిస్ట్రేషన్ ఛార్జీలు, భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంచారు. చెత్త పన్ను, మంచినీటి పన్ను, మురుగు కాలువల పన్ను, ఖాళీ స్థలాల పన్ను లాంటి 24 రకాల పన్నుల రూపంలో రూ.2 లక్షల కోట్లు భారాలు మోపారు. గతంలో దళితులకు అమలు చేసిన 27 సంక్షేమ పథకాలు రద్దు చేశారు. 33 వేల కోట్లు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల దారిమళ్లించారు. 12 వేల ఎకరాల దళితుల అసైన్డ్ భూములు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. తెచ్చిన అప్పుల్లో, పెంచిన పన్నుల్లో లక్షల కోట్లు దిగమింగారు. సంక్షేమ పథకాల్లో కోతలు పెట్టారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఆసరా పేరుతో మహిళా సంఘాలకు టోకరా వేశారు. రూ.3వేల పెన్షన్ హామీపై మోసం చేశారు. ఆరోగ్యశ్రీని జగన్ రెడ్డి అనారోగ్యశ్రీగా మార్చారు. మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి రూ.41 వేల కోట్లు అప్పు తెచ్చారు. పేదలందరికీ ఇళ్లు పేరుతో లబ్దిదారుల్ని అప్పులపాలు చేస్తున్నారు. రూ.75వేల కోట్ల బీసీ సబ్ ప్లాన్ నిధుల్ని దారి మళ్లించారు.

కేవలం ప్రత్యర్థులను అణచివేయడమే..

స్కిల్ డెవలప్‌మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ అంటూ గతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలన్నింటిని స్కామ్‌లు‌గా అభివర్ణిస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టి మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబును అన్యాయంగా జైలుకు పంపారు. లోకేష్‌ను కూడా అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. పవన్ కల్యాణ్‌ను సైతం అనేక రూపాల్లో వేధింపులకు గురిచేస్తున్నారు. జగన్ రెడ్డికి అంటిన అవినీతి మరకలను అందరికీ అంటించాలని ఉబలాటపడుతున్నారు. అభివృద్ధిని గాలికి వదిలేసి కేవలం ప్రత్యర్థులను అణచివేయడమే ఏకైక అజెండాగా పెట్టుకున్నారు. నాలుగున్నరేళ్లలో 80 మందికి పైగా టీడీపీ కార్యకర్తలను హతమార్చారు. వివేకా హత్య కేసులో నిందితుడైన ఎంపీని, దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని కాపాడుతున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలపై వేలాది కేసులు నమోదు చేశారు. అవినీతి ఆంధ్రప్రదేశ్‌గా మార్చి విశాఖలో జగన్ రెడ్డి అండ్ కో రూ.40 వేల కోట్ల విలువైన భూముల్ని కబ్జా చేశారు. ఇసుక మాఫియా ద్వారా రూ.12 వేల కోట్ల కుంభకోణం జరిగింది. ఒకప్పుడు అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్ నేడు గంజాయిప్రదేశ్‌గా మారింది. నాలుగేళ్లలో రూ.లక్ష కోట్ల విలువైన ఎర్ర చందనం విదేశాలకు తరలించారు. బియ్యం అక్రమ రవాణ ద్వారా రూ.7వేల కోట్లు దోచుకున్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఇల్లు కూడా అమ్ముకొనే స్థితిలో ఉన్న జగన్ రెడ్డి అనతికాలంలోనే రూ.3లక్షల కోట్లకు పైగా ఆస్తులు ఎలా సంపాదించారు?

జగన్ రెడ్డి దుర్మార్గాలు, దౌర్జన్యాలు భరించలేక ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే వున్నాయి. 16వ లూయీ చక్రవర్తి కాలంలో ఫ్రెంచ్ విప్లవమే ఇందుకు ఉదాహరణ. రాజు నిర్భంధాలు, అరాచకాలు సహించలేక స్వేచ్ఛకోసం, హక్కుల కోసం ప్రజలంతా తిరగబడిన చరిత్రను జగన్ రెడ్డి గుర్తించాలి. ప్రజల కష్టాలు పట్టని పాలకులు ఎలా వుంటారో తొలిసారి చూస్తున్నారు. మీ తుగ్లక్ పాలన చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. మీ సొంత పార్టీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేస్తున్నారు. మీరు ఎన్ని వేషాలు వేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మీరు రాష్ట్రానికి అవసరం లేదనడానికి ఇంతకంటే ఏం రుజువులు కావాలి. మీకు అంతిమ గడియలు దాపురించాయి. మిమ్మల్ని బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

మన్నవ సుబ్బారావు

99497 77727

Tags:    

Similar News