సమాజానికి ఏం నేర్పుతున్నారు?

Anchors, What are you teaching the society?

Update: 2024-03-21 00:30 GMT

నేటి సమాజంలో అడుగడుగునా పుట్టుకొస్తున్నట్లు యూట్యూబ్ యాంకర్లు అతి వేగంగా ప్రసార మాధ్యమాలలో వ్యాప్తి చెందుతున్నారు.. అయితే, ఒయ్యారం ఒలుకబోసే ఆ భామల నోటి నుండి తియ్యనైన తెలుగు భాష జాలువారేనా? వివిధ ఛానల్లలో జరిపే ఇష్టాగోష్టీలు సమాజానికి ఉపయోగపడేనా? ఒక స్వచ్ఛంద సంస్థ నెలకొల్పి సమాజ సేవ చేసేవారితో సంభాషించి వారి క్రియ ప్రక్రియలు వింటే సమాజానికి ఎంతో మేలు. తద్వారా మంచి సందేశం ప్రజల్లోకి పోతుంది. వారిలో మనిషిని ప్రేమించాలనే స్ఫురణ కలుగవచ్చు. మానవీయ విలువలు చిగురించ వచ్చు. కానీ నేటి యూట్యూబ్ యాంకర్లు ఆ పని చేస్తున్నారా? సోషల్ మీడియాలో బూతులు మాట్లాడేవారిని, అశ్లీల నృత్యాలతో ప్రజాదరణ పొందిన వారిని తీసుకొచ్చి వారితో ఇంటర్యూలు చేయడమేమిటి?

చేతబడులపై ఇంటర్వ్యూలా?

జనవిజ్ఞాన వేదిక నిర్వహించే మేధావులతో ఇంటర్వ్యూ చేస్తే ప్రజలలో ప్రశ్నించే తత్వం, శాస్త్రీయ దృక్పథం మొలకెత్తుతుంది. అంతేగానీ చేతబడులు, బాణామతి చేసే వారితో ఇంటర్వ్యూ చేస్తే సమాజానికి కీడే కదా! ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చెప్పి దెయ్యాలు, భూతాలు, ఆత్మలు, అతీత శక్తులు ఉన్నాయని అవి మానవుడిని ప్రభావితం చేస్తున్నాయని సంకేతాలు ప్రజల్లోకి పోతాయని అర్థం కాదా? ఇది ఎంత మూర్ఖత్వం. సమాజంలో కుళ్ళును పెంచే ఇలాంటి యాంకర్లు నేటి సమాజానికి అవసరమా? ట్రాన్స్ జెండర్లతో, విటులతో ఇష్టాగోష్టి ఎందుకు, వారి మనో భావాలను దెబ్బ తీయడానికా? మహిళా యాంకర్లు సావిత్రి బాయి ఫూలేలా విజ్ఞానం అందరికీ పంచాలి. మదర్ థెరిస్సాలా తోటి మనిషిని ప్రేమించి సహాయం చేయాలి. కాని పనికిరాని ఇంటర్వ్యూలు చేసి ప్రజలను పక్క దారులు పట్టించకూడదు. మీరు చేసే ఇలాంటి పనికిమాలిన ఇంటర్యూల వలన మన సమాజాన్ని రెండు శతాబ్దాలను వెనక్కి తీసుకొనిపోయే ప్రమాదముంది. సోషల్ మీడియా అనేది ప్రపంచంలో ఉన్న మానవులందరిని ఒకే చోటికి తీసుకొని వచ్చే దృశ్య శ్రవణాల వేదిక. దీనిని ఒక బలమైన ఆయుధంగా తీసుకొని కులమతాలకతీతంగా మానవవాదం బలోపేతం చేయాలి. ఆ దిశగా యాంకర్‌లు అడుగులు వేస్తారని ఆశిద్దాం.

- పూసాల సత్యనారాయణ

సామాజిక విశ్లేషకుడు

90007 92400


Similar News