అంబేద్కర్ ఆశయాలు.. విస్మరిస్తున్న పాలకులు

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతులు, వర్థంతులు ఘనంగా నిర్వహిస్తూ, వారి ఎత్తైన విగ్రహాలను నిర్మిస్తూనే, రాజ్యాంగ బద్దంగా పాలన

Update: 2024-04-14 01:00 GMT

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతులు, వర్థంతులు ఘనంగా నిర్వహిస్తూ, వారి ఎత్తైన విగ్రహాలను నిర్మిస్తూనే, రాజ్యాంగ బద్దంగా పాలన సాగించని ద్వంద్వ విధానాలు అమలు చేస్తున్నారు. ఇది కడు శోచనీయం. మరోపక్క రాజ్యాంగ మౌలిక విలువలకు విఘాతం కలిగిస్తున్నారు. దేశాన్ని, రాష్ట్రాలను వారి సొంత జాగీర్లుగా భావిస్తున్నారు. అంబేద్కర్ ముందు చూపు, దార్శనిక భావాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరు మారాలి. ప్రశ్నించే స్వేచ్ఛ ఉన్నప్పుడే ఆర్థిక, సాంఘిక, సామాజిక, రాజకీయ సమానత్వం ఏర్పడి అంబేద్కర్ ఆశయాలు ఆశలు నెరవేరుతాయి. అదే పాలకులు, పాలితులు ఆ మహనీయుడికి ఇచ్చే నిజమైన నివాళులు..

స్వతంత్ర భారతావనికి ప్రజాస్వామ్య పాలనా నిర్దేశానికి తోడ్పడేలా, ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని అందించడంలో, తన మేధస్సునంతా ధారపోసి భావ సంఘర్షణకు సమయమిచ్చిన, ముందుచూపున్న మహనీయుడు డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని అమ్మవాడి అనే గ్రామంలో 1891 ఏప్రిల్ 14న జన్మించారు. భారత రాజ్యాంగ రచనలో ఆయన కృషి అనన్య సామాన్యం.

మన దేశానికి 'రాజ్యాంగమే మూల స్తంభం'. స్వాతంత్ర్య లక్ష్యాలు, ఫలాలు, రాజ్యాంగ ఆశయాలు, సంక్షేమ రాజ్య ఆకాంక్షలు నెరవేరి సుస్థిరాభివృద్ధి సాధించాలంటే రాజ్యాంగబద్ధంగా పాలన సాగాల్సి ఉంది. సంపద సమంగా పంచబడినప్పుడే ఆర్థిక అసమానతలు తొలగిపోయి, శ్రేయో రాజ్యంగా వర్ధిల్లుతుంది. కానీ నేడు భారత రాజ్యాంగం దాని మౌలిక విలువలకు తిలోదకాలిస్తున్న నేటి పాలకుల తీరు విశ్లేషకులను విస్మయానికి గురిచేస్తోంది.

ఆయన సందేహమే నిజమయ్యి..

డాక్టర్ అంబేద్కర్ నాడు రాజ్యాంగ సభలో ముసాయిదా కమిటీపై ఉద్విగ్న భరిత కంఠ స్వరంతో మాట్లాడిన తీరు నేటి కాలమాన పరిస్థితులకు అద్దం పడుతోంది. తను రూపొందించిన రాజ్యాంగం అమలు చేయడంలో సందేహాలను వ్యక్తపరిచిన విధంగానే నేటి ప్రజాస్వామ్య పాలన ఇష్టారీతిగా సాగుతుంది.. 'నా దేశం తన స్వతంత్రతను పరిరక్షించుకుంటుందా! పరాభవం పాలవుతుందా? ఇది నన్ను వేధిస్తున్న మొదటి ప్రశ్న. నేను రూపుదిద్దిన రాజ్యాంగం దీర్ఘకాలం నిలుస్తుందా? నా దేశ భవిష్యత్తు పట్ల కలవరం కలుగుతుంది. మన ప్రజల్లో కొందరు నమ్మకద్రోహులు చేసే కుట్రలు కుతంత్రాలు పునరావృతం కాకూడదని నా ఆందోళన. ప్రజాస్వామ్య పాలనలో మత విశ్వాసాల కంటే దేశానికి ఉన్నత స్థానం ఇస్తారా?లేదంటే మత విశ్వాసాలను పెంచి పోషించే వారికి ప్రాధాన్యత పెరుగుతుందా? అదే జరిగితే దేశం మళ్ళీ ప్రమాదంలో పడుతుంది. మనలోని చివరి రక్తం బొట్టును కూడా దేశ స్వాతంత్ర్య రక్షణకు ధార పోయడానికి సర్వ వేళలా దృఢ సంకల్పంతో అప్రమత్తంగా సిద్ధంగా ఉండాలి' అన్నారు అంబేడ్కర్. మన స్వేచ్ఛను ఎంత గొప్పవాడైనా కానీ వాని కాళ్ళ ముందు తాకట్టు పెట్టరాదు అన్నారు. దేశానికి జీవితాంతం సేవలందించే మహానుభావులకు కృతజ్ఞతగా ఉండడంలో తప్పులేదు. కానీ దానికి పరిమితులు ఉండాలన్నారు.

శ్రేయోరాజ్యమే పాలన లక్ష్యం

దేశంలో భక్తి మార్గం లేదా వ్యక్తి ఆరాధన మార్గం ఎప్పుడైతే తారా స్థాయిలోకి చేరుతుందో.. దాని మూలంగా అధః పతనానికి, నియంతృత్వానికి దారి తీస్తుంది అన్నారు. కొందరు అంతులేని సంపదలతో తులతూగుతుంటే?. ఎంతోమంది అష్ట దరిద్రంలో మునిగిపోతున్న పరిస్థితి దేశంలో ఉండరాదని ఆయన ఆందోళనతో కూడిన సందేహాన్ని వ్యక్తపరిచారు. అంబేద్కర్ రాజ్యాంగం దృష్టిలో దేశ ప్రజలంతా సమానం అందుకే ఒక మనిషికి ఒకే ఓటు ఒకే విలువ ఏర్పరిచారు. కానీ సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం సాధించడం రేపటి పాలకుల పాలనా విధానంలో ఉంటుందన్నారు. అనాదిగా పీడనకు గురైన వర్గాలకు ఎస్సీ, ఎస్టీలకు చట్టసభల్లో ప్రత్యేక నియోజకవర్గాలను సాధించారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లపై పోరాడి మంత్రి పదవిని వదులుకున్నారు. స్వాతంత్ర ఫలాలు అందరికీ అందకపోతే మనల్ని మనమే నిందించుకోవాల్సి ఉంటుంది. శ్రేయో రాజ్యానికి అడ్డుపడే దుష్టశక్తులను గమనించి పాలన సాగించాలని ఉద్బోధించారు.

అందని ద్రాక్షగా అంబేద్కర్ ఆశయం

ప్రజాస్వామ్య పాలనలో నాటి నుంచి నేటికీ దేశంలో కొంత మేరకు అభివృద్ధి జరిగినప్పటికీ, అంబేద్కర్ ఆలోచనలు ఆశయాలు నెరవేరలేదనేది సత్యం. నేటి పాలకులు చాప కింద నీరులా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వీటిలోకి చేరి ప్రజల హక్కులను హరిస్తున్నారు. ఎన్నికల్లో "ధన ప్రవాహం" కట్టడి చేయలేక ఎన్నికల సంఘం ఉత్సవ విగ్రహంగా మారింది. రాజకీయాల్లో అవినీతి ఎక్కువైంది, అవినీతి వటవృక్షానికి తల్లి వేరు రాజకీయాలని తేలిపోయింది. ఇదంతా.. నల్లధనమే. రాజకీయాల్లో రోజు రోజుకు క్షీణిస్తున్న నైతిక విలువలు, ఆర్థిక అసమానతలతో దేశంలోని సంపద గుప్పెడు మంది చేతుల్లో కేంద్రీకృతం అవ్వడం జరుగుతోంది. దేశంలో ఇన్నాళ్ల ప్రజాపాలనలో కూడా నేటికీ సుమారు 40 కోట్ల జనాభా ఆకలి కేకలతో అలమటించడం చూస్తుంటే వారి సందేహాలు నిజమే అనిపిస్తుంది. సంకుచితత్వం, ప్రాంతీయ, భాష, కుల, మతోన్మాదం, లింగవివక్ష, అవకాశవాద, నేరపూరిత రాజకీయాల వలన సమగ్రత, సమానత, సమసమాజ స్థాపన కోరుకున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలు నేటికీ అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి..

అదే నిజమైన నివాళి

రాజ్యాంగ మౌలిక విలువలకు పాలకులే విఘాతం కలిగిస్తున్నారు. విద్య, వైద్యం అంగడి సరుకైంది. కార్పొరేట్ శక్తుల చేతుల్లో పాలకులు కీలుబొమ్మలుగా మారారు. దేశాన్ని, రాష్ట్రాలను వారి సొంత జాగీర్లుగా భావిస్తున్నారు. అంబేద్కర్ ముందు చూపు, దార్శనిక భావాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరు మారాలి. అంబేద్కర్ ఆలోచనలు, రాజ్యాంగ విలువలు కాపాడుతూ పాలన సాగితేనే పౌరహక్కులు రక్షించబడతాయి. స్వయం ప్రతిపత్తి గల సంస్థలు స్వేచ్ఛగా వ్యవహరిస్తాయి. ప్రశ్నించే స్వేచ్ఛ ఉన్నప్పుడే ఆర్థిక, సాంఘిక, సామాజిక, రాజకీయ సమానత్వం ఏర్పడి అంబేద్కర్ ఆశయాలు ఆశలు నెరవేరుతాయి. అదే పాలకులు, పాలితులు ఆ మహనీయుడికి ఇచ్చే నిజమైన నివాళులు..

మేకిరి దామోదర్

95736 66650

Tags:    

Similar News