రాజధానిగా అమరావతికి జై కొట్టాలి!
ఎన్నాళ్లకెన్నాళ్లకు అన్నట్లుగా అమరావతికి మంచి ఊపు వచ్చినట్టు అయింది. గత ఐదు సంవత్సరాల కాలం నుంచి నిర్వీర్యమై, పిచ్చి మొక్కలతో
ఎన్నాళ్లకెన్నాళ్లకు అన్నట్లుగా అమరావతికి మంచి ఊపు వచ్చినట్టు అయింది. గత ఐదు సంవత్సరాల కాలం నుంచి నిర్వీర్యమై, పిచ్చి మొక్కలతో నిండి ఉన్న ప్రాంతం నేడు జనంతో కళకళలాడుతోంది. 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులు ఆనందంతో చిందులు వేస్తున్నారు. అమరావతిని రాజధానిగా ఒప్పుకున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం కక్ష సాధింపు ధోరణితోనే అమరావతిని నిర్లక్ష్యం చేశారు. ఆయన ఓటమికి ఇది కూడా ఓ ప్రధాన కారణం.
కాలయాపన చేయడంతో..
జగన్ అమరావతిని అభివృద్ధి పరచి ఉంటే ఫలితం మరోలా ఉండేది. మూడు రాజధానులు అని ఊదరగొట్టి చేసింది ఏమీ లేదు. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది. కొందరు మీ రాష్ట్రానికి రాజధాని ఏది అన్నప్పుడు మనసు చివుక్కుమంటుంది. 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నా ముందు చూపుతో చంద్రబాబు నాయుడు అమరావతిని ప్రకటించారు. అమరావతికి ఓ రూపు రావడానికి సమయం పట్టవచ్చని తెలిసే అలా భావించారు. అప్పటికి అక్కడ కొన్ని కట్టడాలు, హైకోర్టు ఏర్పాటు అయ్యాయి. దురదృష్టం కొద్దీ 2019లో చంద్రబాబు ఓటమి చెందడం, గెలిచిన జగన్మోహన్ రెడ్డి అమరావతిలో అభివృద్ధి దిశగా చర్యలు తీసుకోలేదు. మూడు రాజధానులు అంటూ తీవ్ర జాప్యం చేశారు. అసలు మూడు రాజధానులు అవసరమే లేదు. అమరావతిని వృద్ధి చేసి ఉంటే ఈ పాటికి ఓ సుందర నగరమై ఉండేది. కాలయాపన చేయడం, ఎటువంటి పనులకు పూనుకోకపోవడం, భూములు ఇచ్చిన రైతులు ఉద్యమాలు చేయడం, వారిని నానా బాధలకు గురి చేయడం తెలిసిందే.
వైసీపీ మద్దతు ఇవ్వాలి!
ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో మళ్లీ చంద్రబాబు నాయుడు గెలవడంతో అమరావతి రైతులలో ఆనందం వెల్లివిరుస్తోంది. పైగా ఇప్పుడు గెలిచిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అమరావతి ప్రాంతంలోనే ప్రమాణ స్వీకారం చేయనుండటంతో మళ్ళీ మంచి రోజులు వచ్చాయి అని సంబరపడిపోతున్నారు. నిజమే అమరావతి ఓ వినూత్న నగరంగా రూపు దాలుస్తుంది. ఎన్నో పరిశ్రమలు అక్కడికి రావొచ్చు. ఎలాగూ ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా ఉంది కనుక నిధుల కొరత ఉండకపోవచ్చు. ప్రధాన ప్రతిపక్షం జనసేన పూర్తిగా సహకరిస్తుంది. ఈ సందర్భంగా వైసీపీ కూడా మద్దతు ఇచ్చి, అమరావతి నిర్మాణంలో పాలు పంచుకోవాలి. మద్దతు ఇవ్వకపోతే మాత్రం వాళ్లకు ఉనికి ఉండదు. ఇక్కడ రాజకీయాలు పనికి రావు. నిబద్ధత, చిత్తశుద్ధితో అధికార పక్షానికి సహకరిస్తే ప్రజలు హర్షిస్తారు. లేకపోతే నవ్వుల పాలు కావడం ఖాయం.
ప్రభుత్వానికి సహకరిద్దాం!
అమరావతి ఆంధ్రుల కల అది సాకారమయ్యే రోజు వచ్చింది. దీనికి ప్రధాన కారణం అక్కడి రైతులు మొక్కవోని దీక్షతో పోరాటాలు, త్యాగాలు చేసి నిబ్బరంగా నిలిచారు. ఇక ఏ శక్తీ అమరావతిని ఆపలేదు, అడ్డుకోలేదు. భారతదేశంలో అమరావతిని చూడడానికి పర్యాటకులు కూడా వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల రాబడి కూడా పెరగవచ్చు. పరిపాలన చూస్తూనే అక్కడ వేగంగా నిర్మాణాలు జరగాలి. అబ్బుర పరిచే కట్టడాలతో అపురూప నిర్మాణ శైలితో అమరావతికి అన్ని హంగులు అద్ది 'న భూతో న భవిష్యత్ ' అనే విధంగా నిలవాలి. మనమంతా అమరావతికి జై కొడుతూ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిద్దాం.
- కనుమ ఎల్లారెడ్డి,
అమెరికా
93915 23027