చంద్రబాబుపై ఆరోపణలే.. ఆధారాలెక్కడ...?
Allegations against Chandrababu.. Where is the evidence?
భారత న్యాయ వ్యవస్థపై ప్రజల్లో ప్రగాఢమైన నమ్మకం ఉంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబునాయుడుకు బెయిల్ రావడం ద్వారా అది మరింత పెరిగింది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని న్యాయస్థానాలే పరిరక్షిస్తున్నాయి. జగన్ రెడ్డి లాంటి వ్యక్తుల వల్ల పవిత్రమైన వ్యవస్థల ప్రతిష్ట మసక బారకుండా అప్రమత్తంగా ఉండాలి. పీడనకు, హింసకు ప్రజాస్వామ్యంలో తావుండకూడదు. ఇది చంద్రబాబుపై దాడి కాదు.. ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడి. తప్పుడు కేసులు న్యాయస్థానాల ముందు నిలబడవని తెలిసి కూడా జగన్ రెడ్డి స్కిల్ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించడం అతని కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట. ప్రాధాన్యత క్రమంలో సుప్రీంకోర్టులో వేయాల్సిన కేసులు చాలా ఉన్నాయి. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, కృష్ణా జలాల పంపిణీ, విద్యుత్ బకాయిలు, ఇతర ఆస్తుల విభజన వంటి అనేక సమస్యలు ఉన్నప్పటికీ వాటిని గాలికి వదిలేశారు. రాజధాని కోసం ఉదారంగా భూములు ఇచ్చిన అమరావతి రైతులపైన, చంద్రబాబుపైన అంత అర్జెంటుగా సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఏమిటి?
మాట్లాడితే కేసులు, అరెస్టులా?
రెండు రెళ్లు నాలుగు అంటే జైళ్లు నోరు తెరుస్తున్నాయని శ్రీశ్రీ అన్న మాటలు ఈ సందర్భంగా గుర్తుకువస్తున్నాయి. ఎక్కడో ఉన్న ఉత్తర కొరియా దేశంలో సాగుతున్న అణచివేతలు, నియంతృత్వ పోకడలు గురించి విన్నాం. కానీ మన రాష్ట్రంలో జగన్ రెడ్డి జమానాలో ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం. శాంతియుతంగా గాంధేయ మార్గంలో నిరసన తెలిపినా తక్షణమే కేసులు పెడుతున్నారు. ఎవరూ మాకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, మమ్మల్ని ఎవరు విమర్శించకూడదని జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారు. విమర్శించడం, ప్రశ్నించడం అనేది పౌరుల ప్రాథమిక హక్కు, అది ప్రజాస్వామ్య మౌలిక సూత్రం. ఎక్కడైతే భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంటుందో అక్కడే ప్రజాస్వామ్యం ఉంటుంది. భావ ప్రకటనా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తే అది నియంతృత్వ పాలనకు దారితీస్తుంది.
జగన్ రెడ్డి పైశాచిక ఆనందం కోసం చంద్రబాబును అక్రమ కేసుల్లో ఇరికించారు. కానీ వాటికి ఆధారాలు చూపలేక న్యాయస్థానం ముందు చతికిలపడ్డారు. వ్యక్తి స్వేచ్ఛను హరించే విధంగా సీఐడీ వ్యవహరించిందని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో చంద్రబాబునాయుడుకు మినహా అందరికీ బెయిల్ వచ్చింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో జగన్ రెడ్డి కక్షపూరిత వైఖరికి హైకోర్టు వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. టీడీపీ ఖాతాకు నిధులు మళ్లించారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. చంద్రబాబుపై ఇంతటి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నప్పుడు దానికి తగ్గ ఆధారాలను సేకరించాలి కదా? ముఖ్యమంత్రి మెప్పు పొందేందుకు సీఐడీ వారు అత్యుత్సాహంతో అక్రమ కేసు పెట్టారు. వాస్తవాలను వక్రీకరించే క్రమంలో దర్యాప్తు సంస్థ తమ డొల్లతనాన్ని బయటపెట్టుకుంది.
న్యాయ వ్యవస్థపై నమ్మకం
స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమంలో 2 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందిన విషయాన్ని కోర్టు గుర్తించింది. వాట్సప్ సందేశాలు నడిచినట్లు దర్యాప్తు సంస్థ చెబుతోందే తప్ప.. దానికి తగ్గ రుజువులు చూపించలేదు. ఒప్పందాల్లో తేడాలు ఉంటే దానికి సీఎం ఎలా బాధ్యులు అవుతారు అని కోర్టు ప్రశ్నించడాన్ని గమనించాలి. సీమెన్స్‌కు నిధుల విడుదల అంశంలో ఐఏఎస్ అధికారి సునీత కూడా భాగస్వామి అన్న విషయాన్ని కోర్టు గుర్తుచేసింది. సునీత తప్పు చేసినట్లు కానీ, ఆమెపై చర్యలు తీసుకున్నట్లు కానీ సిఐడి ఎక్కడా చెప్పలేదు. ఈ కేసులో ఉన్నతాధికారులను ఉద్దేశపూర్వకంగా సీఐడీ తప్పించింది. నిధులు విడుదల చేయాలి అని ఆదేశించినంత మాత్రాన ఆ నిధులు పార్టీ ఖాతాకు మళ్లించారనడం సరికాదని కోర్టు పేర్కొంది. సబ్ కాంట్రాక్టర్లు తప్పులు చేస్తే దానికి ముఖ్యమంత్రి ఎలా బాధ్యుడు అవుతారన్న వాదనలతో కోర్టు ఏకీభవించింది. అక్రమాలు జరిగాయని ఆదాయ పన్ను శాఖ అధికారులు తేల్చారన్న సిఐడి.. దానికి అవసరం అయిన ఆధారాలు మాత్రం చూపలేదు. బెయిలుపై బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారు అనే సిఐడి వాదనను కోర్టు కొట్టేసింది. మితిమీరి షరతులు విధిస్తే.. ఎన్నికల్లో పిటిషనర్‌కు చెందిన రాజకీయ పార్టీపై, కార్యకలాపాలపై ప్రభావం పడుతుందన్నారు. హైకోర్టు తీర్పు న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని పెంచింది. మధ్యంతర బెయిల్ వచ్చిన సందర్భంలో ప్రజలు చంద్రబాబుకు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు బెయిల్ రావడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలకు ముఖ్యమంత్రి, మంత్రులు ఎలా బాధ్యులో.. సంబంధిత అధికారులకు అంతకంటే రెట్టింపు బాధ్యత ఉంటుంది. ఒకవేళ ముఖ్యమంత్రి, మంత్రులే బాధ్యులైతే జగన్మోహన్ రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులు ప్రతిరోజూ కోర్టు బోనులో నిలబడాలి, నెలల తరబడి జైలులో ఉండాల్సి వచ్చేది. ముఖ్యమంత్రి తీసుకుంటున్న తుగ్లక్ నిర్ణయాల వల్ల ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మాత్రమే కోర్టు బోనులో చేతులు కట్టుకుని నిలబడుతున్నారు. జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైలు జీవితం గడిపి, 10 ఏళ్ల నుంచి బెయిల్‌పై ఉన్నారు. అసలు గత ఐదేళ్ల నుంచి కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఇంత పెద్ద ఆర్థిక నేరగాడు ఎలా తప్పించుకు తిరుగుతున్నారో జగన్ రెడ్డి, ఆయన తరపున వాదిస్తున్న సుధాకర్ రెడ్డి సమాధానం చెప్పాలి.
కోర్టులపై అనుచిత వ్యాఖ్యలా?
జగన్మోహన్ రెడ్డి రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై పగ, ప్రతీకారేచ్ఛతో న్యాయస్థానాలను వేదికగా మార్చారు. ఎలాంటి ఆధారాలు లేని కేసులు పెట్టి కోర్టుల సమయాన్ని, ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. ప్రతి వ్యవస్థను నియంత్రించాలనుకుంటున్నారు. ప్రభుత్వ పత్రిక, జగన్ రెడ్డి విషపుత్రిక సాక్షిలో స్కిల్ డెవలప్ మెంట్ కేసులో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి రాయడం జరిగింది. హైకోర్టు తన పరిధిని దాటి తీర్పు ఇచ్చినట్లు న్యాయస్థానాలకు, న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదించే విధంగా కథనాలు వండివార్చారు. హైకోర్టు కంటే ఏసీబీ కోర్టే పెద్దదనే భావన కలిగించేలా రాశారు. ఈ కేసు మెరిట్స్‌పై విచారణ జరిపి బాబు పాత్రకు ఆధారాలు ఉన్నాయని ఏసీబీ కోర్టు తేల్చిచెప్పిందని కూడా సాక్షిలో ప్రచురించారు. చంద్రబాబు పాత్రపై ఆధారాలు ఉంటే హైకోర్టుకు సమర్పించాలి కదా ఆ సాక్ష్యాలను ఎందుకు దాచి ఉంచారు బెయిల్‌పై విచారణ జరుగుతున్న సందర్భంలో కేసు మెరిట్స్ జోలికి వెళ్లకూడదనే సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది. హైకోర్టులో కేసు మెరిట్స్ జోలికి వెళ్లినట్లైతే సీఐడీ నిజస్వరూపం బయటపడి ఉండేది. సకల శాఖ మంత్రి సజ్జల తన స్థాయిని మరచి న్యాయమూర్తులను కించపరుస్తూ మాట్లాడారు. సాక్షి పత్రిక, సజ్జల రామకృష్ణారెడ్డి న్యాయవ్యవస్థను అవమానించే విధంగా చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికి కోర్టు ధిక్కరణే అవుతుంది. అసలు సజ్జల ఏ హోదాలో, ఏ అధికారంతో మాట్లాడారో సమాధానం చెప్పాలి. అడిషనల్ అడ్వకేట్ జనరల్ హోదాలో ఉన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన పరిధిని దాటి న్యాయస్థానాలు, న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యం కాదా గతంలో కూడా న్యాయమూర్తులు, తోటి న్యాయవాదుల పట్ల దురుసుగా వ్యవహరించారు. ఇప్పుడు ఏకంగా చంద్రబాబుకు బెయిల్ విషయంలో హైకోర్టు తీర్పు న్యాయసమ్మతం, చట్టసమ్మతం కాదన్న సుధాకర్ రెడ్డికి ఏఏజీగా కొనసాగే అర్హత లేదు.
కేసులు మోపడమే రాష్ట్రాభివృద్ధా?
ప్రభుత్వ విధానాలను ఎవరైనా విమర్శించినా, వ్యతిరేకించినా, మాట్లాడినా వారిపై కేసులు పెట్టి, వారి ఆస్తులను జప్తు చేస్తామని నిస్సిగ్గుగా సీఐడీ చీఫ్ సంజయ్ ప్రకటించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి, అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టిన సంజయ్ ఆస్తులు జప్తు చేసి కేసులు నమోదు చేయాలి కదా? ప్రపంచ చరిత్రలో నియంతలు, నియంతృత్వాలు ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు. కానీ జగన్ రెడ్డి లాంటి నియంతలు సృష్టించిన విధ్వంసం సుదీర్ఘకాలం ఉంటుంది. జగన్ రెడ్డి ప్రతిరోజూ ప్రజాస్వామ్యాన్ని హననం చేస్తున్నారు. ప్రతిపక్ష నేతలను హింసించడానికి, వేధించడానికే తన అధికారాన్ని, సమయాన్ని వెచ్చిస్తున్నారు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు న్యాయస్థానాలను ఆశ్రయించడం పరిపాటి. అందుకు భిన్నంగా ప్రతిపక్ష నేతలను వేధించేందుకు కోట్లాది రూపాయల ప్రజల డబ్బుతో న్యాయస్థానాల్లో పిల్స్ వేస్తున్నారు. సంబంధం లేని ప్రతిదానికి చంద్రబాబును బాధ్యుడిని చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబును వేధించడం ద్వారా వైసీపీ మరింత బలహీనపడింది. ఈ కక్షలు, కార్పణ్యాలు మాని రాష్ట్రాభివృద్ధిపై దృష్టిపెడితే బాగుంటుంది. జగన్ రెడ్డి ఇప్పటికైనా కళ్లు తెరవాలి. వాస్తవాలను గమనంలోకి తీసుకుని పాలన సాగించాలి. ఇట్లాంటి విధ్వంస విధానాలు కొనసాగితే ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.
మన్నవ సుబ్బారావు
99497 77727