మూగబోయిన రష్యన్ ప్రజావాణి నావల్నీ

Alexei Navalny was passes away who was a Vladimir Putin critic

Update: 2024-02-22 00:30 GMT

ఇంతకాలం రష్యాలో పుతిన్ దమననీతిపై గర్జించిన సింహం అలెక్సీ నావల్నీ శాశ్వతంగా కన్నుమూసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమలు చేస్తున్న పాలక విధానాల్లోని తప్పులను ధైర్యంగా ఎత్తి చూపిన నావల్నీ పోరాడుతూ, పోరాడుతూ జైల్లో తుదిశ్వాస విడిచాడు. 2023 ఆగష్టులో కోర్టు ఆయనకు మొత్తం 30 ఏళ్ల కారాగార శిక్ష విధించినపుడే తాను మళ్ళీ ప్రాణాలతో బయటపడనంటూ నావల్నీ ప్రకటించాడు. ఫిబ్రవరి 16 ఆ మాటను నిజం చేసింది.

పుతిన్‌కి కొరకరాని కొయ్య..

బొందిలో ఊపిరున్నంత కాలం రష్యాకు తానే సర్వాధిపతినని రాజ్యాంగ సవరణ ద్వారా ఖాయం చేసుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు నావల్నీ మొదటి నుండి కొరకరాని కొయ్య అయ్యాడు. ఈ 47 ఏళ్ల న్యాయవాదికి బాధ్యత గల పౌరుడిగా వ్యవహరించడం ఇష్టమైన వ్యాపకం. 30 ఏళ్లకే డెమోక్రటిక్ ఆల్టర్నేటివ్ అనే యువ సామాజిక ఉద్యమాన్ని మొదలు పెట్టాడు. దాని ద్వారా ఆయనకు వివిధ ఛానళ్ల డిబేట్‌లలో పాల్గొనే అవకాశం దొరికింది. ప్రభుత్వ టీవీ సెంటర్ కూడా ఆయనతో కార్యక్రమాలను రూపొందించి, రెండు ఎపిసోడ్ల తర్వాత ఆపివేసింది. రష్యా ప్రభుత్వ సంస్థ ట్రాన్స్ నెఫ్ట్ నిర్మించిన సైబీరియా పసిఫిక్ సముద్రం మధ్య ఆయిల్ పైప్ లైన్ చెల్లింపుల్లో అవినీతి జరిగిందని రుజువులతో బయటపెట్టాడు. డిసెంబర్ 2010లో రాస్ పిల్ డాట్‌నెట్ అనే సైట్‌ను ఆరంభించి పాలక పక్ష అవినీతి బాగోతాల్ని క్రమంగా వెలుగులోకి తెచ్చాడు. ఆయన దెబ్బకు భయపడి కొన్ని సంస్థలు ప్రభుత్వంతో కాంట్రాక్టులను రద్దు చేసుకున్నాయి. దీన్ని నావెల్నీ ఎఫెక్ట్‌గా పత్రికలు రాశాయి. 2011 రష్యాలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలు రిగ్గింగ్, మోసాల మయమని మాస్కోలో ఓ బహిరంగ ప్రదర్శన జరిగింది. దానికి ప్రతిచర్యగా ప్రభుత్వం నావల్నీతో సహ 300 మందిని అరెస్టు చేసింది. ఆ నేరానికి నావల్నీ పది రోజుల జైలు శిక్ష అనుభవించాడు.

అవినీతిపై యుద్ధం.. ప్రకంపనలు

అదే యేడు నావల్నీ 'రాస్ యామా' అనే మరో ప్రాజెక్టును ఆరంభించి ప్రభుత్వ అవినీతి చర్యలపై మరో యుద్ధం ప్రకటించాడు. దాంట్లో హంగేరీ, రష్యా మధ్య జరిగిన ఓ భూమి కొనుగోలులో అవినీతిని బయటపెట్టాడు. హంగేరి తమ అధికారులపై చర్య తీసుకున్నా, రష్యా మాత్రం ఎవరిపై చర్యలకు ఉపక్రమించలేదు. 2012 మేలో దేశ ఉప ప్రధాని ఇగోర్ సులవోవ్‌కు చెందిన కంపెనీలకు వివిధ కంపెనీల నుండి నిధుల మార్పిడి జరిగిందని ఆధారాలు చూపాడు.

2016లో రాజకీయ పార్టీ స్థాపించిన నావల్నీ తాను రాబోయే దేశాధ్యక్ష ఎన్నికల్లో పాల్గొంటానని పెద్ద బహిరంగ సభలో ప్రకటించాడు. సుమారు 100 పట్టణాలలో అవినీతి వ్యతిరేక ర్యాలీలు నిర్వహించాడు. దాంతో ఆయన కష్టాలు ప్రాణాంతకంగా మారాయి. 2017 ఏప్రిల్‌లో తన యాంటీ కరెప్షన్ ఫౌండేషన్ ఆఫీసు నుండి బయటికొస్తుండగా ఆయనపై విష రసాయనాలతో దాడి జరిగింది. నావల్నీ నిర్వహణలో ఉన్న సంస్థలకు వచ్చిన నిధుల్లో దుర్వినియోగం జరిగిందని ఆయనపై కేసు నమోదైంది. 2019లో జైలులో విషప్రయోగం జరిగినా బతికి బయటపడ్డాడు.

విషప్రయోగం.. అరెస్టు.. మృతి

2020 ఆగస్టు 20న విమానంలో ప్రయాణిస్తున్న నావల్నీపై విషప్రయోగం జరిగి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అత్యవసరంగా విమానాన్ని సైబేరియాలో దింపి రెండు రోజుల చికిత్స అనంతరం ఆయనను జర్మనీకి తరలించారు. రెండు నెలలకు కోలుకున్న ఆయన తిరిగి 2021 జనవరి 17న రష్యాకు పయనమయ్యాడు. ఆయన వస్తున్న విమానాన్ని మాస్కోలో కాకుండా మరో చోట దింపి కస్టడీలోకి తీసుకున్నారు. అదే రోజు నావల్నీ నల్ల సముద్రం ఒడ్డున పుతిన్ చాటుమాటుగా పెద్ద భవంతి కట్టుకున్నాడని వీడియోను యూట్యూబ్‌లో పెట్టాడు. నావల్నీపై మోపిన యాంటీ కరప్షన్ ఫౌండేషన్‌లో నిధుల దుర్వినియోగం కేసులో ఆయనకు 9 ఏళ్ల జైలు శిక్ష పడింది. జైల్లో ఉండగానే మరిన్ని కేసుల తీర్పులతో ఆయన శిక్ష పెరుగుతూ పోయింది. నావల్నీ ప్రాణాలతో బయటకు రావద్దనుకున్న పుతిన్ పంతం చివరికిలా నెరవేరింది. కానీ రష్యా ప్రజల గుండెల్లో నావల్నీ స్థానాన్ని మాత్రం పుతిన్ చెరిపేయలేడు.

-బి.నర్సన్

94401 28169

Tags:    

Similar News