ఆదివాసీల జీవన విధానం పర్యావరణం, అడవులు, అక్కడ ఉండే సహజ వనరులు మొదలైన వాటితో ముడిపడి ఉన్నది. కానీ నవీన సమాజం వారి హక్కుల నుండి దూరం చేసే సంక్షోభం నుండి వీరిని రక్షించాల్సిన అనివార్యత ఎంతైనా ఉంది. ఇప్పటికే 1994లో ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. కానీ అదిమజనుల హక్కులు, వాటి రక్షణే ధ్యేయంగా, ఆదివాసీల హక్కుల రక్షణకు, వారి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ ఐక్యరాజ్య సమితి స్థానిక ప్రజలపై కొనసాగుతున్న హింస, దుర్వినియోగం మీద 2006 జూన్ 29న ప్రపంచ మానవహక్కుల కౌన్సిల్ ఆదివాసీల హక్కుల రక్షణకై ఒక తీర్మానం జరగాలని సూచించింది. అప్పుడు మానవ హక్కుల కౌన్సిల్, యూఎన్‌ఓలు కలిసి ఆదివాసీల హక్కుల రక్షణకు తీర్మానించాయి. ఈ తీర్మానం ప్రకారం జనరల్ అసెంబ్లీ 2007 సదస్సులో ప్రతి ఏటా సెప్టెంబర్ 13 తేదీని ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీ హక్కుల దినంగా జరుపుకోవాలని ప్రకటించింది. దీనిని వర్కింగ్ గ్రూప్ సమావేశంలో చర్చించి అదివాసుల హక్కులు, భాషలు, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆదివాసీలు వివక్ష నుండి స్వతంత్రత పొంది శాశ్వతంగా స్వేచ్ఛ పొందడానికి అమలు చేయాల్సిన ముఖ్య అంశాలను వెల్లడించింది. ప్రపంచంలోని ఆదివాసీలను విశ్వమానవులుగా గుర్తించినపుడు, వారికున్న ప్రత్యేక హక్కులను రక్షణ కల్పించాల్సిన బాధ్యతను ఈ హక్కుల దినోత్సవం గుర్తుచేస్తుంది.
46 రకాల హక్కులను కల్పించి..
ఈ కమిటీ గుర్తించిన ముఖ్యమైన అంశాలు రాజకీయ, సామాజిక, ఆర్థిక సాధికారత, సంస్కృతి, సాంప్రదాయాలు, చరిత్ర, వేదాంత శాస్త్రం, వారసత్వ భూమి హక్కులు, స్థానిక వనరులు, అలాగే అన్ని రకాల వివక్షలు మొదలైన వారి హక్కులను రక్షించాల్సిన అవసరం ఉందని, వాటిని గౌరవిస్తూ ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని ఆ సమావేశంలో తీర్మానించిన అంశాలను వెల్లడించిన అంతర్జాతీయ మానవ హక్కుల కౌన్సిల్‌ను అనుసరిస్తూ సెప్టెంబర్ 13ను అంతర్జాతీయ ఆదివాసీ హక్కుల దినోత్సవంగా గుర్తించడం జరిగింది. ఈ డిక్లరేషన్‌లో మొత్తం 46 ప్రకరణలు పొందుపరిచారు. ఈ 46 ప్రకరణలలో ఆదివాసీలు ప్రపంచ మానవ హక్కుల చట్టం ప్రకారం, ఆదివాసీలు స్వేచ్ఛగా మానవహక్కులు, ప్రాథమిక హక్కులు పొందాలి. ఇందులో ఎలాంటి వివక్ష చూపించొద్దని, అలాగే ఆదివాసీలు సంకల్పంతో వారి ఇష్ట ప్రకారం రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో అభివృద్ధి చెందొచ్చు. వీరు స్వయం ప్రతిపత్తి, స్వయం పాలనను స్థానిక అంశాలతో నిర్వహించుకోవచ్చు. వనరులను సైతం ఇష్టరీతిలో వినియోగించుకోవచ్చు. వారి చట్టాలను బలోపేతం చేసుకోవచ్చు. ఆదివాసీ ఏ దేశంలో నివసిస్తున్నప్పటికీ ఆదేశ పౌరసత్వం పొందే హక్కు కల్పించారు. వారి హక్కులపై, సంస్కృతిపై, సంప్రదాయాలపై, భూములపై దోపిడీ జరగకుండా బాధ్యతాయుతమైన యంత్రాంగాన్ని ఆయా రాష్ట్రాలే కల్పించాలి.
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మన ఆదివాసీ సమాజాలకు ఆగస్టు 9 ఆదివాసీ దినోత్సవం గురించి తెలిసినంతగా ఆదివాసీ హక్కుల దినం గురించి తెలియక పోవడానికి కారణం నేటి ప్రభుత్వాల అలసత్వం. ఐక్యరాజ్య సమితి సూచన మేరకు దేశమంతటా ఆదివాసీల హక్కులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కల్పించాలి. వీటి గురించి వివరించేందుకు ఆధార్ సొసైటీ, ఏ ఈ డబ్ల్యూ సి ఏ, ఆదివాసీ సమన్వయ మంచ్ సంయుక్తంగా భద్రాచలంలో జాతీయ సదస్సు నిర్వహిస్తుంది.
(నేడు ప్రపంచ ఆదివాసీ హక్కుల దినోత్సవం )
గుమ్మడి లక్ష్మి నారాయణ,
ఆదివాసీ రచయితల వేదిక,
94913 18409