సంక్షేమం ముసుగులో.. ఆర్థిక అరాచకం!

Actual calculations on AP state Debts

Update: 2023-08-17 00:45 GMT

ఆంధ్రప్రదేశ్ అప్పులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఏపీ ఆర్థిక పరిస్థితి విషమంగా ఉందని, అప్పు తీసుకోనిదే రోజు గడవని రుణ విష వలయంలో చిక్కుకుందని, రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఏకంగా 65 శాతం రుణాల భారమే ఉందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కారణమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే మొత్తం అప్పు రూ.4.42 లక్షల కోట్లు మాత్రమేనని, రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరిగిందని, రెవెన్యూ రాబడి కూడా నాలుగేళ్లలో 16.7 శాతం పెరిగిందని, ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలను సమర్థిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ చట్టాలను, రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడం, ఇష్టానుసారం సొంతంగా చట్టాలను సవరించుకోవడం ద్వారా రాజ్యాంగానికి, చట్టాలకు జవాబుదారీగా ఉండాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అనేక ఆర్థిక నేరాలకు పాల్పడుతోందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది?

అప్పులపై అర్ధ సత్యాలు

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019 జూలై 10న విడుదల చేసిన శ్వేత పత్రం ప్రకారం 2019 మార్చి 31 నాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పులు (గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు, చెల్లించాల్సిన బకాయిలు మొత్తం కలసి) రూ. 3,62,372 కోట్లు. 2023 జూలై 31న లోక్ సభలో ఒక ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు రూ. 4.42 లక్షల కోట్లని, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో తీసుకున్న అప్పు రూ. 1,77,991 మాత్రమేనని సమాధానం ఇచ్చారు. ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కోవడానికి ఆమె సమాధానాన్ని ఏపీ ప్రభుత్వం ఉదహరిస్తోంది. వాస్తవానికి ఈ లెక్కలు కేంద్ర ప్రభుత్వం తేల్చినవి కాదు. ' స్టేట్ ఫైనాన్స్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ 2022-23‘ పేరిట ఆర్బీఐ ప్రచురించిన గణాంకాల ఆధారంగా వివరాలు వెల్లడిస్తున్నట్లు కేంద్రం పార్లమెంటుకు ఇచ్చిన అధికారిక పత్రాల్లో స్పష్టం చేసింది. అంటే కేంద్రం వెల్లడించినా, ఆర్బీఐ తన వెబ్ సైట్లో చూపినా అవన్నీ రాష్ట్రం అందచేసిన అప్పుల లెక్కలే. కార్పొరేషన్ల అప్పులు, నాన్ గ్యారంటీ రుణాలు, పెండింగ్ బిల్లులు అందులో లేవు. ఈ వాదనకు మద్దతుగా 2023 ఆగస్టు 2న రాజ్యసభలో గడచిన రెండేళ్లలో రూ. 79,815 కోట్ల కార్పొరేషన్ రుణాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రి ఇచ్చిన సమాధానాన్ని ప్రతిపక్షాలు ఉదహరిస్తున్నాయి.

అప్పులపై స్పష్టత ఎక్కడ?

ఎఫ్ఆర్‌బిఎం చట్ట ప్రకారం రాష్ట్రాలు తమ స్థూల ఉత్పత్తిలో (జిఎస్‌డీపీ) 3 శాతం వరకు, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు విద్యుత్ రంగంలో సంస్కరణలు అమలు చేస్తే మరో 0.50 శాతం వరకు అప్పు తెచ్చుకునే వెసులు బాటు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, స్పెషల్ పర్పస్ వెహికిల్స్, ఇతర సంస్థల పేరిట తీసుకున్న రుణాలపై అసలు, వడ్డీని బడ్జెట్ నుంచి చెల్లిస్తున్నా , రాష్ట్ర పన్నులు, సెస్సులు లేదా రాష్ట్ర ఇతర ఆదాయాల ద్వారా చెల్లించినా వాటిని రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే పరిగణించనున్నట్లు, అవన్నీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(3) కింద అనుమతించే రుణ పరిమితిలోకి వస్తాయని రాష్ట్రాలకు 2022 మార్చిలో లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం తెలియ చేసింది. ఈ విధానం అనుసరించి కార్పొరేషన్లు, స్పెషల్ పర్పస్ వెహికిల్స్ ద్వారా సేకరించిన రుణాలను కూడా పరిగణనలోకి తీసుకుని కేరళ రాష్ట్ర వార్షిక పబ్లిక్ రుణ పరిమితిని రూ. 38 వేల కోట్ల నుండి రూ.20,521 కోట్లకు తగ్గించడమే కాక, ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో రూ.15,390 కోట్లు మాత్రమే అప్పు తీసుకునే నిబంధన విధించింది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మద్యంపై వ్యాట్‌ను తగ్గించి, దాన్ని స్పెషల్ మార్జిన్ మనీ పేరిట ఏపీ స్టేట్ బెవరేజేస్ కార్పొరేషన్‌కు మళ్లించి, దాన్ని తాకట్టు పెట్టి సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం రుణాలు, సేకరించడం ద్వారా ఎఫ్ఆర్‌బిఎం చట్టాన్ని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(3) ను ఉల్లంఘించినా కేంద్ర ప్రభుత్వం కేవలం లేఖ రాసి చేతులు దులుపుకుంటోంది తప్ప చర్యలు లేవు. ఢిల్లీ నుండి కాగ్ అధికారుల బృందం ప్రత్యేకంగా వచ్చి రాష్ట్ర సచివాలయంలో తనిఖీలు చేస్తున్నా రుణాలకు సంబంధించి అడిగిన లెక్కల వివరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్రంగా అందించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ప్రజా రుణం (పబ్లిక్ బారోయింగ్) గురించి 2022 మార్చిలో ఇచ్చిన నిర్వచనం ప్రకారం 2019 నుండి 2023 మే నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్‌బిఐ బాండ్లు, భారత ప్రభుత్వం నుండి తీసుకున్న రుణాలు, ప్రభుత్వ హామీతో తీసుకున్న కార్పొరేషన్ రుణాలు, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి చేసిన అప్పులు మొత్తం రూ. 4,70,929 కోట్లు కూడా ఎఫ్ఆర్ బి ఎం రుణ పరిమితి లోకి రావాలి. ఇవి కాకుండా విద్యుత్ డిస్కంలకు, కాంట్రాక్టర్లకు, సప్లై దారులకు ఇవ్వాల్సిన బకాయిలు, పబ్లిక్ అకౌంట్స్ నుండి, వివిధ సంస్ధల నుండి దారి మళ్లించిన నిధులు ఇంకో రూ. 2,28,856 కోట్లు, వెరసి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు, ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.6,99,785 కోట్లు. ప్రభుత్వ గ్యారంటీలు 90 శాతం నుండి 180 శాతానికి పెరిగి బడ్జెట్ మాన్యువల్ పరిమితి మించిపోయాయి. ఎఫ్ఆర్‌బిఎం నిబంధనలను ఉల్లంఘించడమే కాక, వివిధ శాఖలకు శాసన సభ ఆమోదం పొందిన బడ్జెట్ కేటాయింపులను గాలికి వదిలేశారు. కేరళ విషయంలో నిబంధనలు కఠినంగా అమలు చేసిన కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విషయంలో ఉదారంగా వ్యవహరిస్తోందని, ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ఆర్థిక విధానం అమలు చేస్తోందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఏడాదికి 50 వేల కోట్లు వడ్డీనా?

బటన్ నొక్కి పారదర్శకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం కోసం అప్పు చేస్తే విమర్శించడం భావ్యం కాదని కొందరి వాదన. టిడిపి ప్రభుత్వం ఐదు ఏళ్లలో రూ.1,83,169 కోట్లు (శ్వేత పత్రం ప్రకారం) అప్పు చేస్తే, నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పు రూ.4,70,929 కోట్లు. టీడీపీ ప్రభుత్వం ఏడాదికి సరాసరి రూ.32,800 కోట్లు అప్పు చేయగా వైసీపీ ప్రభుత్వం ఏడాదికి రూ.1,77,732 కోట్లు అప్పు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, బకాయిలు అక్షరాలా పది లక్షల 62 వేల కోట్ల రూపాయలు. ఈ అప్పులకు వడ్డీలు చెల్లించడానికే ఏడాదికి 50 వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాల్సిందే. ప్రతి నెల 5 నుంచి 6 వేల కోట్ల రూపాయలు అప్పులు చేయాల్సిన దుస్థితిలోకి రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నెట్టింది. ఈ ఏడాది రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎఫ్ ఆర్ బి ఎం పరిమితి 30 వేల కోట్ల రూపాయల కాగా, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 29 వేల రెండు వందల కోట్ల రూపాయల అప్పు చేసింది.

పెట్టుబడులు లేకుండా ఇంత ఉత్పత్తా?

సంక్షేమ పథకాల కోసం అప్పు చేస్తున్నామన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తన ఆదాయం రూ.7,18,263 కోట్లలో సుమారు రూ.2,10,000 కోట్లు (29.23%) సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తన ఆదాయం రూ.6,15,960 కోట్లలో రూ.2,78,491 కోట్లు సంక్షేమ పథకాల కోసం వెచ్చించారు. ఇక 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను మూలధన వ్యయంలో మన రాష్ట్రం అట్టడుగున నిలవడం ఆర్థిక అరాచకానికి పరాకాష్టగా నిపుణులు పేర్కొంటున్నారు. పెంచిన చార్జీలు, వడ్డించిన పన్నుల వలన చేకూరిన రెండు లక్షల కోట్ల అధిక ఆదాయం, చేసిన లక్షల కోట్ల అప్పు ఏమైనట్లు? 2018-19లో రూ.6,80,332 కోట్లు ఉన్న రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) 2023 నాటికి రూ. 14.49 లక్షల కోట్లకు చేరినట్లు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్‌కు తెలిపింది. ఎఫ్ఆర్‌బిఎం పరిమితి పెంపు కోసం రాష్ట్ర జీఎస్‌డీపి పెరిగినట్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పుడు లెక్కలను చూపించిందని ఆర్థిక నిపుణుల విమర్శ. జిఎస్‌డీపి పెరిగినప్పుడు ఆదాయం కూడా పెరుగుతుంది కాబట్టి అప్పులు చేయాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? నిజానికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర సొంత ఆదాయం 115 శాతం పెరిగితే, వైసీపీ పాలనలో పెరిగింది 32 శాతమే. అధికంగా అప్పు తీసుకునే వెసులుబాటు కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా జీఎస్‌డీపిని పెంచి చూపిందనేది విపక్షాల వాదన. ఈ నాలుగేళ్లలో ఏ విధమైన కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు రాకుండా రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఎలా పెరిగింది అనే విషయం ప్రభుత్వం వివరించాలి. బుకాయింపులు కాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై 2019లో విడుదల చేసిన విధంగా ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తే అన్ని అనుమానాలకు సమాధానం దొరుకుతుంది. కానీ అంత సాహసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉందా అనేది ప్రశ్నార్థకమే.

- లింగమనేని శివరామ ప్రసాద్

79813 20543

Tags:    

Similar News